Monday, December 28, 2009

మనసును వదిలించుకునేది ఎలా?

జనక మహారాజు ఒక ప్రక్కన రాజుగా విధులు నిర్వర్తిస్తూనే, మరో ప్రక్కన ఆత్మచింతనలో మునిగిఉండేవాడు. 'మనసు గురించిగానీ, బుద్ధి గురించి గానీ, ప్రవర్తన గురించిగానీ ఏమైనా సందేహాలుంటే జనకుడిని అడగాలీ అని చెప్పుకునేవాళ్ళు.

ఒకసారి గొప్ప పండితుడు ఒకయన జనకరాజుగారి దర్బారుకు విచ్చేశాడు. వచ్చీరాగానే, సమయాన్ని వృధా చేయకుండా, ఆయన "రాజా! మన దు:ఖాలన్నిటికీ‌ కారణం మన మనస్సే గదా? కనుక, మనం ఈ మనసును వదిలించుకుంటే సరిపోతుంది. మరి మనస్సును వదిలించుకునే మార్గం ఏమిటి? ఊహల్నీ, ఆ ఊహల్లో కోరికల గూడునూ, భయాల్నీ, సృష్టించి అది మనల్ని ఇరికించుకుంటుంది. ఒకసారి ఆ వలయంలో‌చిక్కుబడ్డాక, సమయం గడిచేకొద్దీ మనం‌మరింతగా అందులో‌మునిగిపోతాం తప్ప, ఇక పైకి రాలేం. దయచేసి, ఈ మనస్సును ఎలా వదిలించుకోవాలో, ఎలా మనం సంతోషంగా ఉండచ్చో చెప్పండి" అన్నాడు.

జనకుడు శ్రద్ధగా విన్నాడు. చిరునవ్వు నవ్వాడు. పండితుడు ఇంకా చెబుతూ పోయాడు- మనిషిని మనసు ఎంతగా బంధిస్తున్నదో రకరకాలుగా వివరించి బాధ పడుతున్నాడు.

జనక మహారాజు నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న ఒక పెద్ద మ్రాను దగ్గరకు వెళ్ళాడు. దాని చుట్టూ చేతులు వేసి దాన్ని తన కౌగిలిలో బంధించి పట్టుకున్నాడు. ఆపైన పండితుడితో అన్నాడు, అక్కడినుండే- "అయ్యా! ఈ చెట్టు నన్ను బంధించి వేసింది. ఇది నన్ను వదలగానే మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలను" అని.

ఆ పండితుడు వయసులో చిన్నవాడు, తన పాండిత్యం చూసుకొని గర్వపడేవాడు. "అరే! ఏమిటి, ఈ మనిషి, 'కర్మయోగీ అని ఈయన గురించి ప్రపంచంలో అందరూ చెప్పుకుంటుంటారే, చాలా తెలివిగలవాడు అనుకొని గదా, నేనిక్కడికి వచ్చింది? కానీ ఇతను చేస్తున్నదేమిటి? తనే చెట్టును పట్టుకున్నాడన్న సంగతి ఇతనికి ఇంకా అర్థమే కాలేదా? చెట్టు ఇతన్ని పట్టుకోవటం ఏమిటి? చెట్టు పట్టుకోదుగదా?" అని, అతను జనకరాజుతో "రాజా! జడమైన ఈ చెట్టు, ఇంత తెలివైన ప్రాణివి, నిన్ను ఎలా బంధించగలదు? వాస్తవానికి, దాన్ని పట్తుకున్నది నువ్వే. నీ పట్టును కొంత సడలించావంటే, మరుక్షణంలో నీకు ఆ చెట్టునుండి స్వేచ్ఛ లభిస్తుంది. ఏదైనా సరే, చేసేందుకు అవసరమైన ఆత్మశక్తి నీకున్నది- కానీ ఆ చెట్టు స్వయంగా జడమైనది- శక్తిహీనమైనది" అన్నాడు.

జనకుడు ఆ యువ పండితుడిని అడిగాడు- " నిజంగానా? ఈ చెట్టు నన్ను నిజంగానే బంధించట్లేదా? నేను దీన్ని వదిలేస్తే ఇది నన్ను వదిలిపెడుతుందా? నిజంగా వదిలిపెడుతుందా?" అని.

యువకుడన్నాడు-" అయ్యో!‌అందులో సందేహమేముంది మహారాజా! సూర్యునివెలుతురులో పదార్థాలు ఎంత స్పష్టంగా కనబడతాయో, ఈ సంగతీ నాకు అంతే స్పష్టంగా కనబడుతున్నది. ఆ చెట్టును వదిలెయ్యండి చాలు- మరుక్షణం మీకు స్వేచ్ఛ లభిస్తుంది. వదిలి చూడండి గద! నిజం మన ముందుకొస్తుంది. వదిలెయ్యండి, దాన్ని! " అని

జనకుడు చెట్టును వదిలిపెట్టి పండితుడి దగ్గరకు వచ్చి అన్నాడు- "అదే విధంగా, ఓ పండితుడా, ఈ మనస్సు అనేది జీవంలేని ఒక జడ పదార్థం. మనం ఆత్మశక్తి గలవారం- స్వతంత్రులమైన ఆత్మలం మనం- జీవంలేని మనసుకు ప్రాణంపోసిం దానికి తెలివి తెప్పించేది మనమే. కాబట్టి, ఏంచేయాలో అదీ మన చేతుల్లోనే ఉన్నది. మనస్సుకు మనం నిరంతరంగా ఇస్తూ ఉన్న శక్తిని, ఇక దానికి ఇవ్వకుండా నిలుపుదల చేసినట్లైతేం ఇక దానికంటూ వేరేగా శక్తి ఉండదు. గుర్తించాలి- ఎన్నటికీ యజమానులం మనమే. మన పనిముట్టు మనస్సు. ఈ వాస్తవాన్ని గుర్తించిన క్షణంలోనే మనకు స్వేచ్ఛ లభిస్తుంది.

పండితుడి ప్రశ్నకు జవాబు దొరికింది. అతడు జనకుడికి నమస్కరించి వెనుతిరిగాడు.

(మూలం: పర్తాప్ అగర్వాల్.. స్టోరీస్ ఫర్ ఎ డాటర్)

Wednesday, December 23, 2009

గొడవలు ఎలా తగ్గుతాయి?

మూలం: కారెంస్ పేజ్, చికాగో ట్రిబ్యూన్,
కథనం: పర్తాప్ అగర్వాల్

2006 అక్టోబరు రెండున పెన్సిల్వేనియాలో ఒక ఆమిష్ తెగవారి పల్లెలో ఒక భయానక మారణకాండ జరిగింది. పాల వ్యానును నడిపే డ్రైవరొకడు, చేత తుపాకీ పట్టుకొని, ఊరికి దూరంగా ఉన్న బడిలోకి జొరబడ్డాడు. ఆ చిన్న బడిలో ఉన్నది ఒకే గది. లోనికి జొరబడ్డ ఆ దొంగ తుపాకీ చూపి బెదిరించి, తరగతి గదిలోని టీచరును, మగపిల్లలను అందరినీ బయటికి తరిమేశాడు.

ఆ పైన, మిగిలిన ఆడపిల్లలందరినీ వరసగా నిలబెట్టి చంపేసేందుకు పూనుకున్నాడు ఆ దుర్మార్గుడు. ఆ పిల్లల్లో పెద్దపాప వయసు కేవలం పదమూడేళ్లు. మిగిలిన పిల్లలకు రానున్న మృతిని కొంచెం సేపైనా అవతలికి నెట్టేందుకేమో, మరి, ఆ పాప తనని ముందు కాల్చమని వేడుకున్నది వాడిని. వాడామెను పాశవికంగా కాల్చి చంపాడు.

తరువాత ఆ పాప చెల్లి, పదకొండేళ్లది, ముందుకు వచ్చి తనని కాల్చమన్నది. దుండగుడు ఆమెను కాల్చాడు, కానీ‌ఆమె చివరికి ప్రాణాలతో బయట పడింది. ఆపైన వాడు మిగిలిన పిల్లలందరినీ కాల్చాడు. వాళ్లలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మిగిలినవారి ప్రాణాలు దక్కాయి. అందరినీ కాల్చాక దుండగుడు తనని తాను కాల్చుకుని చచ్చిపోయాడు.

పిల్లల తల్లిదండ్రులు, మొత్తం ఆమిష్ తెగవారందరూ ఈ సంఘటనతో చలించిపోయారు. కానీ ఈ దురాగతానికి వారి ప్రతిస్పందన మాత్రం అనూహ్యంగా ఉండింది. వాళ్ళనుకున్నారు- "మరణాలన్నీ దైవనిర్ణయాలే. ఈ పిల్లల మృతికి మేం దు:ఖిస్తున్నప్పటికీ ఆ దేవుని నిర్ణయాన్ని సవినయంగా స్వీకరిస్తున్నాం. వారిని చంపిన దుండగీడు కూడా చచ్చిపోయాడు. మాలాగే, అతని కుటుంబంకూడా దు:ఖిస్తూ ఉంటుంది. ఆ విధంగా , మేమందరం కూడా హింస వల్ల బాధకు గురైనవాళ్లమే."

అందువల్ల, ఈ దురాగతం జరిగిన కొన్ని రోజుల తరువాత, ఆమిష్ తెగవారు అనేక బండ్లతో ఊరేగింపుగా ఆ దుండగుడి ఇంటికి వెళ్ళి, అతని కుటుంబ సభ్యులకు ఆహార పదార్ధాలు, వగైరాలను ఇచ్చి, వారికి తమ సానుభూతిని తెలియజేశారు.

హింస పునరావృతం కాకుండా ఆపగల్గేది కేవలం క్షమ మాత్రమే.

Thursday, September 24, 2009

మురికి వాళ్లకు రెండు

రామారావు, సరళ రైలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. రైల్వేస్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నది. రైలు వచ్చి ఆగగానే, ఉన్న రెండు జెనరల్ బోగీల్లోకి దూరేందుకూ జనాలు పోటీపడి కొట్టుకోవటం మొదలెట్టారు.

రామారావు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది- S1లో. S1బోగీ జెనరల్ బోగీని ఆనుకొనే ఉన్నది. అయితే దేవుని దయవల్ల, దాన్నీ, దీన్నీ వేరుచేస్తూ మధ్యలో గోడలున్నై. ఆ గోడలు లేకపోతే వీళ్లూ, వాళ్లూ కలిసిపోవాల్సి వచ్చేది. వందలాదిమంది జనాలు అలాగే గనక దాడి చేస్తే S1 ఇక S1గా ఉండేది కాదు. అదీ జెనరల్ బోగీ అయిపోయేది- ఆపైన S2కూడా...

"చూడండి, అలగా జనం ఎలా కొట్టుకుంటున్నారో?" అంది సరళ. "పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలదాకా పోదంటారు-అందుకే. వాళ్లని మనతోటి మర్యాదస్తులతో పోల్చి చూడండి. మనం క్యూలో నిలబడి వరసగా ఎక్కమూ? వీళ్లూ అసలు మనుషులేనా అనిపిస్తుంది. లేకపోతే ఈ నెట్టుకోవటం ఏంటీ, క్రింద-పైన పడటాలేంటి? చినిగిపోయి, కంపుగొట్టే ఆ చొక్కాలేంటి, కిటికీల్లోంచి లోపలికి పిల్లల్ని దూకించటం ఏంటి? ఇది రైలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారసలు?"

అంతలో వాళ్లలోంచి ఓ తరంగం లేచి వచ్చి, అప్పుడే రైలెక్కబోతున్న సరళ చేతిని తాకింది! ఓ పిల్లాడు బాణంలా దూసుకొచ్చి ఆమెచేతివేళ్ళకు తగిలాడు.

"కళ్లు కనబడటం లేదూ? ఛీ, ఫో " విదిలించిందామె. చేతి వేళ్ళు ఆ పిల్లాడి జుట్టుకు తగిలాయి- మడ్డి మడ్డిగా, బంక బంకగా ఉన్నది జుట్టు. "తల స్నానం చేసి సంవత్సరం దాటి ఉండాలి. ఛీ, పాడు మనుషులు. స్వచ్ఛత ఎరుగని ముఖాలు. శుచి, శుభ్రత లేనే లేవు" ఆలోచనల్లో ఉండగానే రామారావు S1లోకెక్కి సరళకు చేయందించాడు. ఇద్దరూ తమ సీట్లలో కూలబడ్డారు.

సరళ చేతివేళ్ళు ఇంకా జిడ్డు జిడ్డుగా, అసహ్యంగా తోస్తున్నాయి. ఆ చేతిని ఒక ప్రక్కకు పెట్టుకొని కూర్చుందిగానీ, ముళ్ళమీద ఉన్నట్లే ఉంది. 'సబ్బెక్కడుందో, ఏమో? బయల్దేరే హడావిడిలో సబ్బు ఎక్కడ పెట్టింది, తను?'

"ఈ సీటు మాదండి" ఒకాయన వచ్చి నిలబడ్డాడు సరళకెదురుగా. "ఎంతండీ? మావి పంతొమ్మిదీ, ఇరవై. మీదెన్నో నెంబరు?" అన్నాడు రామారావు సమరసంగా. "ఇరవై నాది. లేవండి" అన్నాడా పెద్దమనిషి, కొంచెం పదునుగా. "ఎలా అవుతుందండీ? మావి రెండు సీట్లుంటేనూ?" అన్నాడు రామారావు తార్కికంగా, తన జేబులోంచి టికెట్ తీస్తూ. "నాకు తెలీదు- నాది ఇరవై. అంతే" అని ఆయన వచ్చి సరళను ప్రక్కకు నెట్టి కూర్చున్నాడు. సరళ కుంచించుకు పోయింది.

"మీ టిక్కెట్టు చూపించండి. ఈ సీటు మీదో, మాదో చూస్తాను." అన్నాడు రామారావు.

"మీకెందుకు చూపాలి? మీరేమన్నా రైల్వే అధికారులా? నేను చూపించక్కర్లేదు" అన్నాడు పెద్దాయన.

గొడవ మొదలైంది. చిలికి చిలికి గాలివానైంది. చివరికది తుఫానయ్యాకగానీ టీటీసి గారు ప్రత్యక్షం కాలేదు. వచ్చి చూసేసరికి, పెద్దమనిషి ఎక్కాల్సిన రైలు ఆ రోజుది కాదు; అంతకు ముందు రోజుది! పెద్దాయన తనను తాను తిట్టుకోలేక, రైల్వేవాళ్లను తిడుతూ, బోగీ దిగిపోయాడు. అంతలో రైలు కదిలింది.

"అందరూ చూడటానికి మనుషులేనండీ, కానీ గుణాలెలాఉంటాయో చూడండి" అన్నాడు సరళకెదురుగా కూర్చున్న కళ్లజోడు కుర్రాడు- చూపులు తలుపువైపు తిప్పుకుని. తలుపుదగ్గర నిలబడి ఉన్నాడొక మురికి పిల్లవాడు-జిడ్డు తలవాడు- బయటికి చూస్తూ. రైలు బయలుదేరగానే, జెనరల్ బోగీలో చోటు అందక, ఇక్కడ ఎక్కినట్లున్నాడు. నల్లగా, గ్రీజు మరకలతో మురికితేలుతున్న చొక్కా. ఆ చొక్కాలో వాడిలాంటి కుర్రవాళ్ళు ఇద్దరు దూరచ్చు.

సరళ కూడా వెనక్కి తిరిగి చూసింది తలుపువైపు. ఆ మురికివాడు- 'అంతకు ముందు తనను తాకింది వాడేనా?- మరి వాడిప్పుడు నావైపే ఎందుకు చూస్తున్నాడు?' గబుక్కున తల వెనక్కి తిప్పుకున్నది. ఎదురుగా కూర్చున్న కళ్ళజోడు కుర్రవాడు నవ్వి, అన్నాడు- " వీళ్లింతేనండీ, టిక్కెట్లుండవు. మాచెడ్డ రోగులండీ, మన దేశానికి పట్టిన చీడ పురుగులు. వికారపు బుద్ధులు. టిక్కెట్లుంటే మాత్రం ఏంటండీ, జెనరల్ వాళ్లు స్లీపర్లోకి ఎక్కకూడదండీ, చట్టప్రకారం. అయినా ఎక్కుతారంతే. ఈ టీటీసీలూ వాళ్లను చూసీ చూడనట్లు పోతుంటారు. నాకేమో వాళ్ళను చూస్తే వాంతికొచ్చినట్లౌతుంటుంది. మన దేశంలో ఎయిడ్సు పెరగటానికి కారణం వీళ్లేనండీ, మళ్ళీ మాట్లాడితే దేశంలో ఎనభై శాతం మేమేనంటారు."

అందరూ అంగీకరిస్తున్నట్లు తలలూపారు. సరళ అభినందిస్తున్నట్లు చూసింది కళ్లజోడతన్ని. ఆపైన వాళ్ళంతా భారతదేశాన్ని అభివృద్ధిచేయటం గురించి మాట్లాడుకున్నారు, అలసి నిద్ర వచ్చేంతవరకూ.

రాత్రై అందరూ పడుకున్నారు గానీ సరళకు నిద్ర రాలేదు.. తలుపు దగ్గర ఆ మురికి పిల్లవాడుఇంకా కూర్చునే ఉన్నాడు- తనవైపే చూస్తూ. "వీడు ఇక్కడే ఉన్నాడు ఇంకా. ఎవరిని ఏంచేస్తాడో? సామాన్లు ఏమైనా ఎత్తుకుపోడు గద! తన గొంతుకోస్తాడేమో, రాత్రి ?!"

అనుకున్నట్లే జరిగింది. ఏదో పేరులేని స్టేషన్లో రైలు ఆగి ఉన్నది. సరళకు అప్పుడే కునుకు పడుతున్నది. అంతలో ఒక చెయ్యి ముందుకొచ్చి, మొరటుగా ఆమె మెడలోని గొలుసును లాక్కున్నది. ఒక్కక్షణకాలం పాటు సరళకు నోట మాట పెగలలేదు. ఆ సరికి దొంగ ఆమె నగను లాక్కొని, బయటికి పరుగెత్తాడు. "దొంగ! దొంగ! పట్టుకోండి! నా గొలుసు!" అని సరళ అరిచేసరికి అందరూ మేలుకొని లైట్లు వేశారు.

ఆ సరికి బయట ప్లాట్ ఫారంపైన చీకట్లో దొమ్మీ జరుగుతున్నది. మురికి పిల్లవాడూ, కళ్ళజోడు కుర్రాడూ ఒకళ్లమీద ఒకళ్ళు పడి కొట్టుకుంటున్నారు. సరళ బ్యాగులు రెండూ వాళ్ల ప్రక్కన పడి ఉన్నై.

"పట్టుకోండి, దొంగ వెధవని. నా నగల్నీ, సామాన్లనీ ఎత్తుకుపోతున్నాడు"- అని కేకలు పెడుతూ సరళ బయట పెనుగులాడుతున్న మురికి పిల్లాడిమీదికి దూకింది, రుద్రమదేవిలా.

ఆ తర్వాతేమైందో ఆమెకు తెలీలేదు: కళ్లజోడు కుర్రవాడి పిడికిలి సూటిగా వచ్చి సరళ ముక్కుకు తాకింది. రామారావు పరుగెత్తుకొస్తున్నాడింకా. సరళకు తలతిరిగింది. కళ్ళు బైర్లు కమ్మాయి.

కళ్ళు తెరిచేసరికి తనూ, రామారావూ రైల్లో ఉన్నారు. రైలు ముందుకు పోతున్నది. ముక్కుకు పట్టీతో, తన తల రామారావు వొళ్ళో ఉన్నది. "ఏమండీ, నేను ముందునుండీ చెప్తూనే ఉన్నాను గదండీ; ఆ అలగావాడు మన బోగీలోకి ఎక్కినప్పుడే నాకు వాడి ఉద్దేశం అర్థమైంది. వాళ్ళ జాతి ఇంతేనండీ. నా నగలూ, మన సామాన్లూ అన్నీ ఎత్తుకుపోయాడు చూశారా? నాగతి ఇలాగైంది. మీకేమీ కాలేదుగద!" అని మూలిగింది సరళ.

"ఏమీ కాలేదు సరళా! మన సామానంతా మనకు దొరికింది. వాడెవడోగానీ, దేవుడిలా అడ్డం వచ్చాడు. లేకపోతే ఆ దొంగ వెధవ పూర్తిగా ఉడాయించేవాడే. ఆ తరువాత నేను వందరూపాయలిస్తే, "వద్దండీ" అని, తీసుకోకుండానే వాడు పోయి జెనరల్ బోగీ ఎక్కాడు" అని రామారావు చెబుతుంటే, ఎవరిగురించో అర్థం కాని సరళ బిక్కముగం వేసింది.

"చూడటానికి కళ్ళజోడు పెట్టుకొని టింగురంగామంటూ ఎంత బాగున్నాడో చూడు, ఈ దొంగ వెధవ! వాడి వేషం చూసి మనలాంటివాడే అనుకున్నాంగదా, మనం అందరం? వాడిట్లా దొంగతనాలు చేస్తుంటాడని మనకేం తెల్సు? ఆ మురికి పిల్లాడిలో ఉన్నంత మర్యాద వీడిలో లేకపోయింది చూడు!" అన్నాడు రామారావు సరళ తల నిమురుతూ.

రైలు పోతూనే ఉంది ఇంకా- మురికి వాళ్ళనీ, మర్యాదస్తుల్నీ మోసుకొని.

మురికివాళ్లకోసం రెండు బోగీలు. మర్యాదస్తులకోసం పదహారు.

Thursday, September 3, 2009

పద్యం

ఈ మధ్య "తెలుగు పద్యం" బ్లాగును చూశాను. మళ్ళీ నా చిన్నతనం గుర్తుకొచ్చింది. చిన్నతనంలో నేను, మా నాన్న పోటీగా తెలుగులో సొంత పద్యాలు చెప్పుకునేవాళ్ళం. ఆ తరువాత నేను గద్యాన్ని- అందులోనూ మామూలు జనాలు మాట్లాడుకునే వచనాన్ని- అలా అలా చిన్నపిల్లలు ఇష్టపడే కథల్ని- ఇష్టపడటం మొదలుపెట్టాను. 'తెలుగు పద్యం' ద్వారా భైరవభట్లగారు నాకు పద్యాలంటే మళ్ళీ ఓసారి అభిమానం పుట్టించారు. వారికి ధన్యవాదాలతో, ఈ చిన్న పద్యసుమం..

ఉ. ఉల్లమునందు భావనలు తుమ్మెదలై విరితావిగోరి పై
దేలగ, వాని యాకలిని దీర్పగనెంచిన పల్కుబోడి ప్రా-
ల్మాలెడి నొక్కతోట కథలై, యొకచో కవితా సుమంబులై
అల్లన పద్యమై యొక వనంబున తేనియలూరు గద్యమై.


చాలారోజుల తరువాత రాయబూనటంతో అన్నీ మర్చిపోయాను-- నాకోసం ఛందస్సుకు సంబంధించి ఈ చిన్న నోట్సు తయారు చేసుకున్నాను. ఎవరికైనా ఉపకరిస్తుందేమోనని ఇక్కడే జతపరుస్తున్నాను:


గణాలను గుర్తించేందుకు ప్రధాన సూత్రం: యమాతారాజభానసలగా
సూర్య గణాలు: గల, న
ఇంద్ర గణాలు: నల, నగ, సల, భ,ర, త.



కంద పద్యం:

౧. నాలుగు పాదాలు. మొదటి రెండూ ఒక భాగం; తర్వాతి రెండూ ఒక భాగం.
౨. ఒక్కో భాగంలోను మొదటి పాదంలో మూడు గణాలుంటాయి; రెండో పాదంలో ఐదు గణాలు- మొత్తం ఒక్కో భాగంలోను ఎనిమిది గణాలు.
౩. 'నల, గగ, భ, జ, స' అనే గణాలు మాత్రమే ఉండాలి. అంటే ప్రతి గణంలోను నాలుగు మాత్రలు ఉంటై.
౪. ఆరవ గణం 'నల'కానీ, 'జ' కానీ అయిఉండాలి.
౫. బేసి గణం 'జ' కాకూడదు.
౬. రెండు, నాలుగు పాదాల్లో ఒకటి-నాలుగు గణాల మొదటి పాదాలకు యతి మైత్రి ఉండాలి.
౭. ప్రాస మైత్రి ఉండాలి.


కందానికి ఉదాహరణలు:

'కందము చెప్పక కవిగా
డందము చందమును కంద పదమే యనగా..'

'తనయుల నజాత పక్షుల
ననల శీఖాభీతి చంచలాత్ముల నెటయుం
జననేరని బాలకులను
జననియు వీక్షించి శోక సంతాపితయై'

తేటగీతి

'సూర్యుడొక్కడుండు- సురరాజులిద్దరు- ఇన గణ ద్వయంబు తేటగీతి'

౧. నాలుగు పాదాలు.
౨. ప్రతి పాదంలోను వరసగా ఒక సూర్య గణం, రెండింద్రగణాలు, రెండు సూర్య గణాలు- మొత్తం అయిదు గణాలుంటాయి.
౩. మొదటి గణం మొదటి అక్షరానికి, నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి.
౪. ప్రాస నియమం లేదు.
౫. ప్రాసయతి చెల్లుతుంది.

తేటగీతి కి ఉదాహరణ:

"బిలము సొచ్చితిమేని నందెలుక చంపు
నింద యుండితిమేని దా నేర్చునగ్ని
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలన శిఖల
గ్రాగి పుణ్యలోకంబుల గాంతుమేము."

ఆటవెలది:

"ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు ఆటవెలది"

౧. పై సూత్రంతో ఒకటి-రెండు పాదాలు తయారౌతాయి. అలాగే మూడు-నాలుగు పాదాలున్నూ.
౨. మొదటి పాదంలోను, మూడవ పాదంలోను మూడు సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు ఉంటాయి. ఇక రెండవ పాదంలోను, నాల్గవ పాదంలోను వరసగా అయిదేసి సూర్యగణాలుంటాయి.
౩. అన్నిపాదాలలోను ఒకటవ, నాల్గవ పాదాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది.
౪. ప్రాస నియమం లేదు.
౫. ప్రాస యతి చెల్లుతుంది.

ఆటవెలదికి ఉదాహరణ:

అన్ని వేమన పద్యాలు-
"మేడి పండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ."


సీసము:

౧. నాలుగు పెద్ద పెద్ద పాదాలు: ప్రతి పాదంలోను ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు ఉంటై.
౨. ఒక్కో పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి- రెండు ముక్కలుగా రాయాలి.
౩. ఒక్కో ముక్కలోను మొదటి గణపు తొలి అక్షరానికి, మూడోగణపు తొలి అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౪. ప్రాసయతి పరవాలేదు.
౫. ప్రాయ ఉండనవసరం లేదు.
౬. సీస పద్యం తరవాత దానికి తోడుగా ఆటవెలదిగాని, తేటగీతిగాని ఉండటం తప్పనిసరి.

సీస పద్యానికి ఉదాహరణ:

"ఇరులు కోకిలములై నెచ్చోట కూయునో
అచ్చోట మధుమాసమవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
అవ్వేళ ల వసంతమందగించు
ఇరులేమయూరమై ఎటనాట్యమాడునో
అటనే నవాషాఢమావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆరోజు కార్తికమ్మాగమించు"



ఉత్పలమాల:
"భరనభభరలగ"

౧. నాలుగు ఒకేలాంటి పాదాలు. ప్రతి పాదంలోను వరస గణాలు 'భరనభభరలగ' వస్తాయి. అలా ఒక్కో పాదానికి మొత్తం ఇరవై అక్షరాలు వస్తాయి.
౨. మొదటి అక్షరానికి, పదవ అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౩. ప్రాస మైత్రి ఉండాలి.

ఉత్పలమాలకు ఉదాహరణ:

"కానుగ చెట్ల నీడననొకానొక స్వప్నపు సెజ్జ మీద ని-
ద్రాణత హాయిగొల్పగ సదా శయనింపగ నీ మహాంధకా-
రాన మనస్సు శాంతిగొనె- రాను భవత్కమనీయ కాంతి సౌ
ధానికి- నన్ను బిల్వకుము తన్వి- విభావిభవాభిరామవై."


చంపకమాల:
"నజభజజజర"

౧. నాలుగు పాదాలూ ఒకే రకంవి: "నజభజజజర" అలా ఒక్కో పాదంలోను ఇరవైఒక్క అక్షరాలు వస్తాయి.
౨. ప్రతిపాదంలోను మొదటి అక్షరానికి, పదకొండవ అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౩. ప్రాస మైత్రి ఉండాలి.

చంపక మాలకు ఉదాహరణ:

"పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కు, కఠోరవాక్యముల్
పలుకడొకానొకప్పుడవి పల్కిన కీడును కాదు; నిక్కమే!-
చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు, వేగిరమె శీతల నీరముగాక ? భాస్కరా!"


శార్దూలము:

"మసజసతతగ"

౧. నాలుగు ఒకేరకం పాదాలు. "మసజసతతగ". అలా ఒక్కో పాదంలోను మొత్తం పంథొమ్మిది అక్షరాలు ఉంటాయి.
౨. ప్రతి పాదంలోను మొదటి అక్షరానికి, పదమూడవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.
౩. ప్రాస ఉంటుంది.

శార్దూలానికి ఉదాహరణ:

"ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి, సు-
శ్లోకంబైన హిమాద్రినుండి భువి; భూలోకంబునందుండి య-
స్తోకాంబోధి; పయోధినుండి పవనాంధోలోకమున్ జేరె గం-
గా కూలంకష; పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్."


మత్తేభము:

"సభరనమయలగ"

౧. నాలుగు ఒకే రకమైన పాదాలు: "సభరనమయలగ". అలా ఒక్కో పాదంలోను మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి.
౨. మొదటి అక్షరానికి , పధ్నాలుగో అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.
౩. ప్రాస మైత్రి ఉంటుంది.

మత్తేభానికి ఉదాహరణ:

"ఇది కల్పాంతమొ ఇమ్మహోగ్ర సలిలంబేకార్ణవాకారమై
పొదలంజూచెనొ ఇంతతోన జగముల్ పోజేసెనో ధాత- యె
య్యది దిక్కెక్కడ సొత్తుమెవ్విధమునన్ బ్రాణంబు రక్షించుకో
లొదవున్ దైవమ యంచు గోపనివహంబుద్వేగమొందెన్మదిన్."

ఇవికాక మరిన్ని మళ్లీ ఇంకోసారి ఎప్పుడైనా.

వనమాల

రెండువేల ఐదు వందల సంవత్సరాల క్రితం- గౌతమ బుద్ధుడు తాను కనుగొన్న సత్యాలను ప్రజలందరితోటీ పంచుకుంటున్న సమయం- అప్పుడాయన విదిశా నగరపు ఆవలనున్న మామిడితోపులో విడిది చేసి ఉన్నాడు. బుద్ధుడితోసహా భిక్షువులందరూ భిక్షాపాత్రలు చేతబట్టుకొని, ప్రతిరోజూ ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్ళేవాళ్లు- భిక్షనర్ధించేందుకు.

ఒకనాడు బుద్ధుడు నగరపు వీధుల్లో నడుస్తుండగా ఆయన ప్రక్కనే ఒక రథం ఆగింది. దానినుండి సుందరమైన స్త్రీ ఒకామె దిగి, బుద్ధుని దగ్గరకు నడచుకొని వచ్చింది. మల్లెపూల మాలను చేబూనిన ఆ సుందరి, బుద్ధుని ముందు నిలచి, ఆయన మెడలో పూమాల వేసి వరించనెంచింది! బుద్ధుడు ఆమెను వారించాడు. "ఇది సరైన సమయం కాదు అమ్మాయీ! ప్రస్తుతం నేను భిక్షాపాత్రని ధరించి ఉన్నాను గద! ఈ మాలనే నువ్వు గనక నాకు రేపు ఉదయం, నేనుండే మామిడితోపుకు తెచ్చి ఇచ్చావంటే, అప్పుడు నేను దీన్ని సంతోషంగా స్వీకరించగలను" అన్నాడు. ఆమె సరేనని వెనుతిరిగింది.

ఆమె పేరు వనమాల. విదిశా నగరంలో పేరుగాంచిన, సంపన్న వేశ్య ఆమె. తన నాట్యగానాదులతో ఆమె నగరంలోని ధనిక విటులను తన దివ్యభవనంలోనే నిర్మించుకున్న సుందర సభా ప్రాంగణంలో రంజింపజేసేది. వ్యక్తిగత సంబంధాల పరంగా ఆ నగరపు ధనిక యువకులకు ఆమె తనదైన శిక్షణ నిచ్చేదికూడానూ. ఆమె నేర్పు, ఆమె అందచందాలను గురించిన ఖ్యాతి ఆరోజుల్లో ఆ ప్రాంతం అంతటా వ్యాపించి ఉండేది. ఆమె వెళ్ళిన తరువాత బుద్ధుని అనుయాయి ఒకరు ఆయనకు ఈ సంగతులు తెలియజేశారు.

మరునాడు తెల్లవారుతుండగానే వనమాల బుద్ధుని విడిదిని చేరుకున్నది. వయ్యారంగా ఆ మల్లెపూమాలను బుద్ధునికి సమర్పించింది. బుద్ధుడు సగౌరవంగా దానిని స్వీకరిస్తూనే "అమ్మాయీ! నువ్వు గమనించినట్లు లేదు- ఈ మల్లెలు వాడిపోయాయి. వీటి సువాసన కూడా పోయింది. నువ్వు నిన్న నాకు ఇవ్వబోయినప్పుడున్నట్లు లేవు, ఇవి ఇప్పుడు!" అన్నాడు ఆక్షేపించుతున్నట్లు.

వనమాల నొచ్చుకున్నది. "భగవానుడా! ఈ పూలు ఎంత త్వరగా వాడిపోతాయో మీకు తెలియనిదా? ఈ రోజున అవి తాజాగా ఉన్నాయంటే, రేపటికల్లా వాటి పని సరి. అయినా మీరు తెమ్మన్నారని అదే పూమాలను తెచ్చి మీకు సమర్పించాను. నన్ను క్షమించండి" అన్నది.

"అవును, నిజం" అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో. "సరిగా చెప్పావు నువ్వు. కానీ ఏ నియమం అయితే నువ్వు ఈ పూలకు వర్తిస్తుందని చెబుతున్నావో, అదే నియమం మన ఈ శరీరాలకు కూడా వర్తిస్తుంది! దీన్ని గుర్తుంచుకొని మనం మన అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవాలి- ఏమంటే మనకు ఉన్న సమయం చాలా తక్కువ. మేలుకో అమ్మాయీ! నీ శరీరాన్ని అమ్ముకోకు!"

బుద్ధుని బోధ స్పష్టంగా ఉండింది. సునిశితమైన ఆ మాటలు శరాఘాతాలై వనమాలను తగిలాయి.

ఆపైన వనమాల విటులను ఆకర్షించటం మానివేసింది. క్రమంగా తన జీవితాన్ని ధర్మమార్గంలోకి మలచుకున్నది. ప్రతిరోజూ సాయంత్రం బుద్ధుని బోధనలను వినేది.

వానాకాలం ముగిసి, బుద్ధుడు తన అనుయాయిలతో కలిసి వేరేచోటికి పయనమైనప్పుడు, వనమాల తన ఆస్తులు అన్నింటినీ త్యజించి, సన్యాసిని అయి, వారితోబాటు బయలుదేరింది.

అలా బుద్ధుని బృందంలోకి ఒక కొత్త భిక్షుణి చేరుకున్నది. కాలాంతరంలో ఆమె శుద్ధచేతస్కురాలై, తన జీవితాన్ని పావనం చేసుకున్నది.

(మూలం: పర్తాప్ అగర్వాల్, అప్రచురిత కథలు)

Wednesday, September 2, 2009

ఒంటి చేతి చప్పట్ల శబ్దం!

పర్తాప్ అగర్వాల్ గారు వారానికొకటి చొప్పున, అనేక సంవత్సరాలుగా తనకు గుర్తుకొచ్చిన కథలు రాస్తున్నారు-ఇంగ్లీషులో. ఉడతాభక్తిగా వాటిలో కొన్నింటిని తెలుగులోకి చేద్దామని ప్రయత్నం మొదలెట్టాను... ఆ క్రమంలో ఈ బ్లాగుకు మొదటి కథ ఇది:


జపాన్ లో బౌద్ధభిక్షువులు చాలామంది కాలినడకన దేశమంతటా తిరిగేవాళ్ళు. వాళ్ళకు సాయంగా ఉండేందుకని, దారిలో, ఎక్కడపడితే అక్కడ, జెన్ ఆరామాలు ఉండేవి. నడిచే భిక్షువులు ఎవరైనా, ఒకటి రెండు రోజులపాటు నడిస్తే, ఏదో ఒక ఆరామాన్ని తప్పక చేరుకోగలిగేవాళ్ళు. వాళ్ళకి అక్కడ ఉచితంగా వసతి, భోజనం వగైరా సదుపాయాలుండేవి.

అయితే ఈ ఆరామాల్లో ప్రవేశం అంత సులువుగా లభించేదికాదు. భిక్షువులలాగా వేషం వేసుకొని తిరిగే మోసకారులను గుర్తించి, త్రిప్పి పంపేందుకుగాను ఆరామాల్లో ప్రత్యేక పద్ధతులుండేవి. దీనికి కారణాలు రెండు: వనరులు పరిమితంగానే ఉండటం ఎలాగూ ఒక కారణం; అయితే సమయాన్ని వృధా చేసుకోవటం ఇష్టం లేకపోవటం ముఖ్యమైన అసలు కారణం.

ఇలా సందర్శకుల్ని త్రిప్పి పంపేసేందుకు వాడే విధానాల్లో ముఖ్యమైనది, "ప్రశ్నించటం". ప్రతి సందర్శకుడినీ ఒక ప్రత్యేకమైన ప్రశ్ననడుగుతారు. దానికి వాళ్లిచ్చే జవాబు అర్థవంతంగా లేకపోతే వారికి ఆ ఊళ్ళోని హోటళ్ల, సత్రాల చిరునామాలుండే పట్టికనిచ్చి మర్యాదగా సాగనంపుతారు.

ఒకసారి, సన్యాసి ఒకడు, రెండురోజుల నడకనీ ఒకే రోజున ముగించి, చాలా అలసిపోయి, విపరీతమైన ఆకలితో, సూర్యాస్తమయం అయిన తరువాత చాలాసేపటికి ఒక ఆరామాన్ని చేరుకొని తలుపు తట్టాడు. అప్పటికి బాగా చీకటి పడింది. బయట ఎముకలు కొరికేంత చలిగా ఉన్నది. ఆరామంలో చదువుకునే పిల్ల సన్యాసి ఒకడు, తలుపు రెక్కను కొద్దిగా తెరిచి, బయటికి తొంగి చూసి, మామూలుగా అడిగే ప్రశ్నల పరంపర మొదలుపెట్టాడు: "నువ్వెవరు? ఎక్కడినుండి వస్తున్నావు? ఎక్కడుంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు?..." ఇలా.

నడిచి వచ్చిన సన్యాసికి సంగతి అర్థమైంది. ప్రతి ప్రశ్నకూ అతను మర్యాదగా, జెన్ సన్యాసులకు సహజమైన స్పష్టతతో, సమాధానం ఇచ్చాడు. కానీ అప్పటికే అతను బాగా అలసిపోయి ఉన్నాడు; అతని ఓపిక వేగంగా తగ్గిపోతున్నది; "ఇక ఈ వెర్రి, కుర్ర సన్యాసి తన ప్రశ్నల జోరును ఆపి, తలుపు తెరిచి తనని లోనికి రమ్మంటే బాగుండును- తనకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, నిద్రముంచుకొస్తున్నది" అనుకుంటున్నాడు అతను.

ఆలోగా కుర్ర సన్యాసికి ఉదయం తన గురువుగారు తనని అడిగిన ప్రశ్న ఒకటి గుర్తుకొచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క తను ఉదయంనుండీ తంటాలు పడుతున్నాడు! అందుకని, అతను తమ సందర్శకుడిని పరీక్షించేందుకుగాను అదే ప్రశ్నని ఎంచుకున్నాడు- " ఒక చేత్తో కొట్టిన చప్పట్ల శబ్దం ఎలా ఉంటుందో నీకు తెలుసా?" అని.

బయట చలిలో నిలబడ్డ సన్యాసి ఓపిక ఆసరికి పూర్తిగా నశించింది. ఈ కుర్రవాడితో మరిన్ని ప్రశ్నలు అడిగించుకునే శక్తి లేదు అతనికి. అలాగని వీడితో సైద్ధాంతిక చర్చలో పాల్గొనే ఇష్టమూ లేదు! అందుకని, అతను మెరుపువేగంతో తన కాలి చెప్పును తీసి, ఆ చెప్పుతో కుర్ర సన్యాసి గూబ గుయ్ మనేట్లు ఒక్కటిచ్చాడు- "వినబడిందా? ఒంటి చేతి చప్పట్ల శబ్దం?" అంటూ.

కుర్ర సన్యాసి నిర్ఘాంతపోయాడు. అతనిలోని ప్రశ్నలన్నీ ఎండుకుపోయాయి. వెంటనే తలుపులు తెరిచి, అతను సందర్శకుడిని లోనికి రానిచ్చాడు.

భోజనం కానిచ్చిన సన్యాసి వెంటనే నిద్రపోయాడు.

మరునాడు ఉదయం అతను శలవు తీసుకుంటుండగా, కుర్ర సన్యాసి అడిగాడు వినమ్రంగా: "అయ్యా! నిన్న రాత్రి మీరు నాకు ఇచ్చిన ఒంటిచేతి చప్పట్ల శబ్దం నిజంగా ఒంటి చేతి చప్పట్ల శబ్దమేనంటారా?" అని.

"ఏమాత్రం సందేహ పడకు సోదరా, అది ఒంటి చేతి చప్పట్ల శబ్దం ఎంతమాత్రమూ కాదు. రోజంతా నడిచీ, నడిచీ అలసిపోయిన నేను, నీ ప్రశ్నల పరంపరకు తాళలేక, నిన్ను ఆపేందుకని, నీకు ఒక్కటిచ్చుకున్నాను- అంతే. అయితే, మరికొంత ఆలోచించినమీదట, నా చర్య నువ్వడిగిన శబ్దాన్ని ఉత్పత్తి చేసిందనే తోస్తున్నది నాకు. ఎందుకంటే, అది తక్షణమే కోరిన ఫలితాన్ని ఇచ్చింది గద! అంతేకాక, నా చర్య ఆలోచనా రహితంగా ఉత్పన్నమైన అసంకల్పిత చర్య. ఒంటిచేతి చప్పట్ల శబ్దం అలాంటి చర్యనుండే ఉత్పన్నం అవ్వాలి మరి!" అన్నాడు సన్యాసి, నవ్వుతూ.

(మూలం: పర్తాప్ అగర్వాల్, అప్రచురిత కథలు)

Monday, July 6, 2009

నరేంద్రనాథ్ ఉన్నాడు.

In death there is release.

నిజమనిపిస్తుంది.

నరేంద్రనాథ్ వెళ్ళిపోయాడు. విలువైన విషయాలు చెప్పీ, చెప్పీ అలిసిపోయి, ఇక చెప్పాల్సిన పనిలేకుండా వెళ్ళిపోయాడు.

ఇక ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటలకు నరేన్ వస్తాడు మనసులోకి- ఏ మాటల్లో ఉన్నా తొమ్మిదికల్లా అతని మెదడు స్విచాఫ్ అయిపోయేది... ఇప్పుడు పూర్తిగా స్విచాఫ్ అయిపోయింది.

ఘోరమైన జీవిత సత్యాన్ని తన కుళ్ళుజోకుల మాధ్యమంగా పలికించీ, పలికించీ- ప్రేమగా తిడుతూ మనసులో మెచ్చుకునేవాళ్ళను వదిలేసి, ఇప్పుడు పోయాడు.

వద్దంటున్నా హోమియో మందులిచ్చీ, ఇచ్చీ, వద్దనేవాళ్ళకు అలవాటు పడిపోయాడు నరేన్. అతనికి అలవాటు పడ్డవాళ్ళం ఇప్పుడు అతను లేకపోవటానికి అలవాటు పడాలి.

నరేన్ తో ప్రత్యేకమైన వెంకట్రామాపురం ఇప్పుడు ఇంకొక గ్రామం అయిపోతుంది. ఇప్పుడక్కడ ఇక అందరూ ఇంకా లోతైన బోర్లు వేసుకోవచ్చు- అరిచేవాడే ఉండడు.

చాలా డబ్బులు పోగొట్టుకున్నాడట, తన ప్రయోగాల్లో- తనే చెప్పుకున్నాడు "ఇట్లు-ఒక రైతు" పుస్తకంలో. కానీ వాటికి కోటిరెట్లు విలువైన విలువల్ని మిత్రులకు పెట్టుబడిగా ఇచ్చాడు- సంరక్షించి, పెంచమని. పాలగుట్టపల్లిలో మామూలు కుర్రాళ్ళు ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో సంపద దాచుకున్నాడు నరేన్, నిజంగానే.

నరేన్ సంతకంనుండి సంస్థలుగానీ, సంఘాలు గానీ ఏం నేర్చుకున్నాయో తెలీదు. ఇవాల్టి ఆంధ్రజ్యోతి మథ్యపేజీలో బాలగోపాల్ బాగా రాశాడు. సంస్థలు నిజానికి వ్యక్తుల్నించి ఏమీ నేర్చుకోవనిపిస్తుంది నావరకూ. వ్యక్తులకంటే తాము ఉన్నతమైనవనుకుంటాయేమో అవి. వీలుంటే అవి వ్యక్తుల్ని ఏదో ఒక చట్రంలో బిగించి విశ్లేషిస్తాయి. ఆ తరువాత ఇంకా జగన్నాథ రథ చక్రాలు తోసుకొని పోతూనే ఉంటై.

నరేన్ ఒక వ్యక్తి. ఎంత పోయినాసరే, చాలామంది వ్యక్తులకు నరేన్ ఉన్నాడు. ఇంకా ఉంటాడు చాలా ఏళ్ళు.

(గొర్రెపాటి నరేంద్రనాథ్ నాబోటి చాలా మందికి స్ఫూర్తిదాత, గురువు.. మొన్న చనిపోయాడు.)

Friday, May 8, 2009

తెలుగమ్మకు కొత్త కర్పూరం!

రామారావు ఈరోజెందుకో అన్యమనస్కంగా ఉన్నాడు. తెలుగు తల్లికి పదనీరాజనాలు అర్పించాలని అతనికి చాలా కోరిక. పాత కర్పూరాలకంటే కొత్త కర్పూరాలే మంచివని ఎవరో చెప్తే, తెలుగమ్మకోసం కొత్త పదకర్పూరాల్నే వెలిగించాలని పట్టుబట్టి కూర్చున్నాడు అతను ఎంతో కాలంగా. కానీ ఎంత కాలం గడిచినా ఆ కర్పూరాలు అంటుకోవట్లేదు. నిల్వలు పేరుకు పోతున్నై; కానీ ఎందుకో సరుకు అమ్ముడవటం లేదు.

జనాలందరూ పాత కర్పూరాల్నే కొనుక్కు పోతున్నారు. ఏమని అడిగితే- "అవి బాగానే వెలుగుతున్నై కదా?" అంటున్నారు. "అలా కాదోయ్, పాత కర్పూరాల్ని ఉన్నవి ఉన్నట్లు వాడుకోకూడదు, వాటికి నూత్న సొబగుల్ని కూర్చి, నవీన గుబాళింపులు అద్ది హారతులిద్దాం, 'మన తల్లేమీ వెనకబడలేద'ని ప్రపంచానికి చాటుదాం" అని రామారావు ఎంత ప్రేరేపించినా, జనాలు వినటంలేదు. పాత వాసనల్నే పట్టుకు వేళ్లాడుతున్నారు.

'చాలాసార్లూ అనీ అనీ బోరుకొట్టి, తను ఎక్కడో 'పల్సార్లు ' అని రాస్తే, ప్రొద్దున వాడెవడో "ఏమయ్యా, బజాజ్ కంపెనీ వాడి రెండు చక్రాల బండి లాగా?" అన్నాడు- అదీ, ప్రస్తుత విషాదయోగానికి 'తూపుదూబ ' (అర్ధం కాదులెండి.. తూపుదూబనే ఆంగ్లంలో ట్రిగ్గర్ అంటారు అని రామారావు గార్నడిగితే తెలుస్తుంది..). నొచ్చుకున్న రామారావు ముఖం మాడ్చుకొని "అట్లనవలదార్యా" అని పురాణఫక్కీలో మర్యాదగా మొదలుపెడితే, "ఏమండీ, మేం మామూలు మనుషులం. మీరు మమ్మల్ని త్రేతాయుగంలోకి తీసుకుపోతామన్నా , మేం రాం" అన్నాడు వాడు. "పాతవి ప్రశంసిస్తే- అర్థం కావట్లేదంటారు, నవీనతను ప్రతిఫలింపజేస్తే- ప్రయోగాలొద్దంటారు- మరెలాగ, భాషాప్రవృద్ధి?"‌ (భాషాభివృద్ధి అనటం పాతదైయాక రామారావు అట్లా అనటం మొదలుపెట్టాడు) అని రామారావుకు బెంగ పట్టుకున్నది.

అంతలో ఆనందమూర్తి వచ్చాడు. పదప్రయోగాల్లో ఆనందమూర్తి రామారావుకు దీటురాయి. ఆయన పదసమ్మేళనం చేస్తే, ఈయన పద సంఘటనం; ఆయన నవీన పద విసృంభణం చేస్తే, ఈయన పురాణపదఖండనం చేస్తుంటాడు. "ఒరేయ్, రామం, ఈ మధ్య అంతర్జాలంలో తెలుగు భాషామాతకు సువాసన కర్పూరం తప్ప మామూలు ధూపం వేయట్లేదటరా! మనం అంతర్జాల పరిభాషలో పాటవం సంపాదించి, మన ప్రకర్షని నిష్కర్షగా ప్రకటించే రజత తరుణం ఆసన్నమైంది" అన్నాడు ఆనందం, వస్తూనే.

"అంతర్జాలం ఏమిటీ, మార్జాలం లాగా?" అని విస్తుపోయాడు రామారావు.

బదులుగా "ఆ!!" అని నిర్ఘాంతపోయాడు ఆనందం. "ఆమాత్రం తెలీదా? సామాన్యులు దాన్ని బ్రిటిష్ లో ఇంటర్నెట్ అంటున్నారు. మనం మన సుసంపన్న తెలుగులో దాన్ని 'అంతర్జాలం' అనాలి " వివరణాత్మకంగా వదించాడు ఆనందం. ఇప్పటికే చిన్నబోయిన రామారావు ముఖం ఈ దెబ్బకు ఇంకా సంకోచించింది.

ఎందుకో ఆనందం ముందు రామారావు ఎప్పుడూ తెలవెలబోతుంటాడు ఇలాగే.

"అలా కాదోయ్ ఆనందం, ఇంటర్నెట్ను 'అంతర్జాలం' అని పిలిస్తే అందరికీ అర్థం కావొద్దూ? ఎంచక్కా "ఈవల" అనొచ్చుగా? అన్నాడు రామారావు తన ప్రయోగానికి తనే ఉబ్బిపోతూ.

"ఈవల అంటే సామాన్యులకు సగం అవ్వదు. వాళ్లు దాన్ని 'ఇక్కడ ' అనుకునే సందర్భం ఉంటుంది. దాని నివారీకరణకోసం అంతర్జాలం అనటమే ప్రశస్తం" అన్నాడు ఆనందం, కొంచెం తగ్గి.

"కాదోయ్, మన వలలో ఎలాగూ ఒకముడికీ మరో ముడికీ గట్టి దారపు సంబంధం ఉండనే ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పక్కర్లేదు. ఏదో ఒక ప్రత్యయం కూర్చాలి గనక, ('e')'ఈ ' అంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునేవాళ్ళు దేన్నైనా నేర్చుకోవాల్సిందే. ఏ పదాల్నైనా కొంచెం బలవంతంగా వాడింపజేస్తే అవి వాడుకలోకి వచ్చేస్తాయి గద!" అన్నాడు రామారావు వివరిస్తున్నట్లు.

ఆహా, ఇంకా రకరకాలుగా అనొచ్చు. ఎలాగూ కొత్తపదమే గనక దాన్ని 'పరస్పర సంబంధ వల ' అనొచ్చు. ఏమైనా అనొచ్చు, విని, వాడేవాళ్లుంటే సరి. అయినా, ఏమోనోయ్, రామం.. మనలో మనకే సయోధ్య కుదరకపోతే బయట మనపని అయోధ్య అయిపోదూ? కొంచెం ఏకాభిప్రాయ సాధనీకరణ చర్చ చేయాలి మనం" అన్నాడు ఆనందం, కూర్చోబోతూ.

"ఏమండీ, లేస్తారా, లేదా? 'పిల్లకి తెలుగు రావట్లేదు, టీచర్లు సున్నాలు వేయలేక నెగటివ్ మార్కులిస్తున్నారు ' అని మొత్తుకుంటున్నా వినకుండా ముచ్చట్లలో మునిగితేలుతున్నారా? లేస్తారా, లేకపోతే బాపుగారి బామ్మ మాదిరి చపాతీ రుద్దేది-..అదేంటో..- అది చేత పట్టుకురమ్మంటారా?" అరిచింది సరళ లోపల్నుండి.

"కోల!!" అని అరిచారిద్దరూ, ఆనందం లేచి బయటికి పరుగెత్తే లోపు.

"జనాలకి ఈ మాట సులభంగా గుర్తుకు రావట్లేదు..కొత్త పదం ఒకదాన్ని సృష్టించాలి.." అని ఆలోచించటం మొదలెట్టాడు రామారావు.

Thursday, May 7, 2009

చరైవ..చరైవ

ఇరవై ఐదేళ్ళ క్రిందటి సంగతి...

రామారావు, సీత ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు చంద్రం.

చంద్రానికి రెండేళ్ళు నిండగానే నర్సరీలో చేర్పించారు. ఆ రెండేళ్ళూ సీత పడ్డ పాట్లు సీతమ్మకూడా పడలేదు. అందుకని బడి వాళ్లు ఒకరోజు రమ్మంటే, వీళ్ళూ రెండు రోజులు వెళ్ళి- క్యూలో నిలబడి మరీ చంద్రాన్ని బళ్ళో వేశారు. రెండ్రోజులు శలవతోబాటు ఇరవైవేలు డొనేషనూ కట్టాల్సి వచ్చింది. అంతా చేసి ఆ బళ్ళో హాస్టల్ వసతి లేదు! పిల్లల్ని వాళ్ళు రెండింటికల్లా వదిలేసేవాళ్ళు. ఆ తరువాత వాడు నేరుగా క్రష్ కెళ్ళి, మిగిలిన పిల్లల్తో ఆడుకునేవాడు- అమ్మా, నాన్నా వచ్చి ఇంటికి తీసుకెళ్ళేంతవరకూ.

వాడికి నాలుగేళ్ళు నిండాక వాడ్నితీసి ఇంకో బళ్ళో వేశారు. "ప్రగతి కాంవెంట్"లో ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడింటి వరకూ ఉంచుకునేవాళ్ళు పిల్లల్ని. అందరికీ 'మమ్మీ, డాడీ'లు నేర్పించటంతో పాటు, వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఫలితం బాగుంది- చంద్రం తెలుగుకంటే ముందు ఇంగ్లీషులో ముద్దు ముద్దుగా "ఐ ఈజ్ గుడ్" అంటుంటే మురిసిపోయారు ఇద్దరూనూ.

చంద్రం ఒకటికి రాగానే రామారావు అప్పుచేసి అతన్ని డాష్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించాడు. బడి నియమాల ప్రకారం వాడు బడి హాస్టల్ లోనే ఉండేవాడు. 'పిల్లల్ని ఇంటికి వదిలితే, వేర్వేరు సంస్కృతులు వాళ్ళని ప్రభావితం చేస్తై. అలాకాక అందర్నీ కలిపి పెంచితే, వాళ్ళకి చిన్నప్పటి నుండే పోటీ తత్వం, సమాజపు వ్యాపార నైజం అర్థమౌతాయి ' అనే ఉన్నతమైన భావన ఆ బడిని అభివృద్ధిలోకి తెచ్చింది. చంద్రం వారాంతంలో మాత్రం ఇంటికి వచ్చేవాడు - ఇలా రెండేళ్ళు నడిచింది. ఆ తరువాత వాడు శలవల్లో తప్పిస్తే ఇంటికి రాలేదు.

అయితేనేం, చక్కగా చదువుకుని, ఎనిమిదో తరగతికల్లా సోమయ్యగారి కోచింగ్ లో సీటు సంపాదించుకున్నాడు వాడు. ఆ తరువాత గుజరాత్ లో గిగర్వాల్ గారి శిక్షణలో వాడు మెరికలాగా తయారయ్యాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు; పెద్దింటి పిల్ల రమను ప్రేమ వివాహం చేసుకున్నాడు; ఇంద్రానికి తండ్రయ్యాడు.

ఇరవై ఐదేళ్ళ తరువాతి సంగతి:

చంద్రం, రమ ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు ఇంద్రం. వీళ్ళు ముగ్గురి మెడలకీ రెండు బరువులు- చంద్రం తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మలు.

రామయ్య రిటైరైన రెండేళ్ళకు వాళ్ళిద్దర్నీ ఊరి చివర్లో‌ఉన్న వృద్ధాశ్రమంలో‌చేర్పించారు. ఆ రెండేళ్ళూ రమ పడ్డ పాట్లు ఏ సినిమా హీరోయిన్ కూడా పడి ఉండదు. అందుకని, వృద్ధాశ్రమం వాళ్ళు రెండు లక్షలు ఇమ్మంటే, చంద్రం రామయ్యతో చెప్పకుండా మొత్తం తనే కట్టేశాడు అవలీలగా. అంతా చేసి ఆ ఆశ్రమంలో‌హాస్పిటల్ సౌకర్యం లేదు! వీళ్లకు ఏమైనా జబ్బుచేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చి వదిలేసే వాళ్ళు! చివరికి రామయ్య ,సీతమ్మలు అక్కడ ఉండటానికి బదులు నిరంతరం‌ ఇంట్లోనే తిష్ఠవేయటం మొదలుపెట్టారు.

అందుకని రెండేళ్ల తర్వాత వాళ్లిద్దర్నీ ఇంకో వోల్డేజ్ హోం లో వేశారు. "గియానంద వోల్డేజ్ హోం" లో వీళ్ళను చక్కగా చూసుకునేవాళ్ళు. అందరికీ ఇన్ హౌస్ మెడికల్ ఫెసిలిటీ తో బాటు, ప్రతిరోజూ సాయంత్రం మనసుకు ప్రశాంతతను చేకూర్చేందుకుగాను కంపల్సరీ మెడిటేషన్ కూడా ఉండేదక్కడ. అయితే రామారావుకేమయిందో, ఊరికే ఫిట్లు రావటం మొదలై అందరికీ అసౌకర్యంగా తయారైంది.

ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ ఖుషీవ్యాలీ లో ఉన్న 'ఇంటర్నేషనల్ హోం ఫర్ ది ఏజ్డ్ ' లో చేర్పించాడు చంద్రం. దానికోసం అతను ఆఫీసులో లోను తీసుకోవాల్సి వచ్చిందిగానీ, తల్లిదండ్రుల సుఖం కోసం ఆమాత్రం చేయలేదనుకుంటారని, అతను ఆ రిస్కు తీసుకున్నాడు. వీళ్ళు మనల్ని నెలకోసారికంటే ఎక్కువ సంప్రతించరు. చివరికి వీళ్లకేమైనా అయితే క్రిమేట్ చేయించటం, వగైరా అన్నీ వాళ్లే చూసుకుంటారు. "ముసలివాళ్ళని పిల్లలమీద వదిలితే, వాళ్ళు మనవళ్ళకీ, మనవరాళ్లకీ చిన్నప్పటినుండే వెనకబాటు ధోరణులు మప్పుతారు. పిల్లలకు ప్రగతిశీలమైన అలవాట్లు రావాలంటే ముసలివాళ్ళని వీలైనంత దూరంగా ఉంచాలి" అనే ఉన్నతమైన భావన ఖుశీవ్యాలీకి వెలుగులు తెచ్చింది.


అక్కడ వాళ్లిద్దర్నీ కలిసి మాట్లాడుకోనిచ్చినప్పుడల్లా రామయ్య, సీతమ్మ ఒకే సంగతి మళ్లీ మళ్ళీ ముచ్చటించుకునేవాళ్లు- "మనం చిన్నప్పుడు చంద్రాన్ని మనతోపాటు ఉంచుకొని ఉంటే, వాడూ ఇప్పుడు మనల్ని వాడితోబాటు ఉండనిచ్చేవాడేమో" అని!

ఆపైన వాళ్ళిద్దరూ ఇక ఇంటికి పోలేదు. చక్కగా అక్కడే ఉంటూ, హాయిగా అక్కడే కన్నుమూశారు.

Tuesday, May 5, 2009

ఓ ట్రాజెడీ..

రామారావుకు సహనం ఎక్కువ అనుకుంటుంటారు అంతా. కానీ సరళకూ, సరళ తల్లిదండ్రులకూ మాత్రం అసలు సంగతి తెలుసు- రామారావుకున్నంత కోపం, చికాకు, అసహనం ప్రపంచంలో వేరెవరికీ ఉండవంటుంది సరళ. రామారావు పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే, పదిసార్లు పిలిస్తే తప్ప పలకడు. అదీ ఏదోలా ముఖం పెట్టుకొని విన్నట్లు వింటాడు. పదిసార్లు అలా పిలిస్తే- (అంటే పదిపదులు వందసార్లన్నమాట!) అప్పుడు ఇక చికాకు పడూతూ కాగితాలు పక్కన పడేసి లేస్తాడు తను. ఆపైన మాట మాట్లాడకుండా చెప్పిన పని చేస్తాడు. సరళకే అనిపించాలన్నమాట- "ఎందుకు కదిల్చాంరా, భగవంతుడా!" అని.

సరళా ఏమంత సరళమైనది కాదు. హెచ్చుతగ్గులు బాగా ఉంటై, ఆమె తత్వంలో. ఒక్కోసారి తాము గొప్పపేరు సంపాదించుకోవాలని ఉంటుంది. ఒక్కోసారి తాము గొప్ప డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది. రామారావుకు ఆ రెండూ లేనందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది.

రామారావూ ఓ రకం మనిషి. అంటీ ముట్టనట్లే ఉంటాడు; మళ్లీ అన్నీ తనకు నచ్చినట్లే జరగాలంటాడు. సరళకూ అదే ఇష్టం: ఆమె కూడా అన్నీ తనకు నచ్చినట్లే జరగాలనుకుంటుంది. ఇక ఇద్దరి మధ్యా అంతర్యుద్ధాలు చెలరేగేవి. ఈ యుద్ధాల్లో రామారావు నిశ్శబ్దశీలి. సరళ శబ్దశీలి. ఇరుగు పొరుగులందరికీ సరళ గొంతే వినబడుతుండేది. రామారావు మొండితనం, మంకుపట్టూ సరళకు తప్ప వేరెవరికీ వినబడేది కాదు. "పాపం, రామారావు మంచోడు" అనుకునేవాళ్ళు అందరూ.

పిల్లని పెంచటం రాక సరళ సతమతమౌతుంటే, పిలిచేంతవరకు పట్టించుకోడు రామారావు. అతను పట్టించుకోగానే పిల్ల కిలకిలలాడేది. "పిల్లని ఎప్పుడూ ఎందుకు పట్టించుకోడు, ఎందుకు ఎప్పుడూ కాగితాలు ముందేసుకుని కూర్చుంటాడు?" అని సరళ వేధించేది. "మూగమొద్దులాగా కూర్చోకపోతే కొంచెం టైము నాకూ, పిల్లకీ ఇవ్వచ్చుగా" అని సరళ కొంచెం ఉచ్చ స్థాయిలో అంటే తప్ప, రామారావు ఆ కాయితాలను వదిలి లేచేవాడు కాదు.

గొడవలు బాగా ఎక్కువైతే "వదిలిపెట్టి పారిపోతా"ననేది సరళ. "నువ్వు ఒప్పుకోకగానీ, లేకపోతే నేనే ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని" అనేవాడు రామారావు. "ఇలా సర్దుకుపోయి బ్రతుకులు ఈడ్వటం కంటే మమ్మల్ని మా ఇంటికి పంపేసి విడాకులు తీసుకోండి " అనేది సరళ. "ఆ పనేదో నువ్వే చెయ్, నాకు పనిలేదూ?" అని గొణిగేవాడు రామారావు.

రామారావు చేసే పని సరళకు అర్ధవంతంగా అనిపించేదికాదు. అతని రాతలూ, చేతలూ అన్నీ ఏదోలా అనిపించేవి. ఎవరైనా ఆమెముందు అతన్ని మెచ్చుకుంటే , "మీకేంతెలుసు" అనుకునేది. "రాత కోతలు తిండిపెడతాయా, బంగళా కార్లు తెస్తాయా? వాటి బదులు ఇంటిపని చేస్తే ఏం" అని పోట్లాడేది సరళ. "వాటివల్లే ఇల్లు గడుస్తోంది- వాటికి అంతమాత్రం అన్నా గౌరవం ఇవ్వకపోతే ఎలా" అనేవాడు రామారావు, మళ్లీ పేపర్లు ముందేసుకుంటూ.

"తననీ పిల్లనీ మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నాడు. మమ్మల్ని అసలు పట్టించుకోడు" అని సరళకు విశ్వాసం ఏర్పడిపోయింది. "ఇక లాభం లేదు- మా వాళ్లింటికి వెళ్ళిపోతాను. నువ్వు మారితే తప్ప తిరిగి రాను" అని సరళ పెట్టే బేడా సర్దుకొన్నది చాలాసార్లు. రామారావు అలాంటప్పుడు ఏమీ మాట్లాడేవాడు కాదు- మూగమొద్దులాగా నిలబడే అతన్ని చూస్తే సరళకు కోపం ఇంకా పెచ్చుమీరేది.

మనం ఏది తలిస్తే దైవం అదే తలుస్తుందట. జీవితాలు తలక్రిందులైనై, ఓ రోజున. రోడ్డు ప్రమాదంలో సరళ, పిల్ల ఇద్దరూ పోయారు. రామారావు ఏడవలేదు.
ఊరికే కూర్చున్నాడు మౌనంగా.
ఆపైన అతను మాట్లాడటం మానేశాడు.
రాయటం మానేశాడు.
నవ్వటం మానేశాడు.
ముభావంగా తనపని తను చేసుకుంటూ ఉండటం మానేశాడు.
ఓ రోజునుండీ కనబడటం మానేశాడు.

"పాపం, రామారావు మంచోడు. భార్యా,పిల్లలంటే ఎంత ప్రేమ!" అనుకున్నారు ఇరుగుపొరుగులు.

"ఇంకా తత్వం మార్చుకోలేదు. ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు" అనుకున్నది సరళ.

Wednesday, March 11, 2009

మళ్ళీ వచ్చేసింది వసంతం!!

సంతోషంగా ఉందాం!!

గతించిన వసంతం మళ్ళీ రాదు.. కానీ రావలసిన వసంతం ఎలాగూ వచ్చేస్తుంది కదా!?

గత వసంతంలో మొదలు పెట్టిన ఈ కపిత్వానికి జీవితం కొద్దిగా కామాలు పెట్టింది. అయిదారు నెలల కామా తర్వాత, మళ్ళీ ఓసారి వసంతం మొదలైనట్లుంది.

అందరం సంతోషంగా ఉందాం.

పోయిన ఉగాదికి మేం మొదలుపెట్టిన కొత్తపల్లి పత్రిక ( http://kottapalli.in ), ఇప్పుడు మెల్లగా నడవటం మొదలు పెట్టింది, చాలా రచనల్నీ, నవ్వుల్నీ, సంతోషాల్నీ మోసుకుని. అనుకున్నట్లుగానే ఈ మాధ్యమంగా చాలామంది మిత్రులైనారు. వసంతం పోయి, గ్రీష్మం, ఆ పైన మిగిలిన ఋతువులన్నీ వచ్చాయి.. వాటి వాటి వాసనల్ని విరజిమ్మాయి. చూస్తూ చూస్తూండగానే మళ్ళీ చెట్లు చిగురించాయి, మళ్ళీ కోయిలలు కూయటం మొదలెట్టాయి.

మళ్ళీ వచ్చేసింది వసంతం.

అందరం సంతోషంగా ఉందాం!!!