Wednesday, December 23, 2009

గొడవలు ఎలా తగ్గుతాయి?

మూలం: కారెంస్ పేజ్, చికాగో ట్రిబ్యూన్,
కథనం: పర్తాప్ అగర్వాల్

2006 అక్టోబరు రెండున పెన్సిల్వేనియాలో ఒక ఆమిష్ తెగవారి పల్లెలో ఒక భయానక మారణకాండ జరిగింది. పాల వ్యానును నడిపే డ్రైవరొకడు, చేత తుపాకీ పట్టుకొని, ఊరికి దూరంగా ఉన్న బడిలోకి జొరబడ్డాడు. ఆ చిన్న బడిలో ఉన్నది ఒకే గది. లోనికి జొరబడ్డ ఆ దొంగ తుపాకీ చూపి బెదిరించి, తరగతి గదిలోని టీచరును, మగపిల్లలను అందరినీ బయటికి తరిమేశాడు.

ఆ పైన, మిగిలిన ఆడపిల్లలందరినీ వరసగా నిలబెట్టి చంపేసేందుకు పూనుకున్నాడు ఆ దుర్మార్గుడు. ఆ పిల్లల్లో పెద్దపాప వయసు కేవలం పదమూడేళ్లు. మిగిలిన పిల్లలకు రానున్న మృతిని కొంచెం సేపైనా అవతలికి నెట్టేందుకేమో, మరి, ఆ పాప తనని ముందు కాల్చమని వేడుకున్నది వాడిని. వాడామెను పాశవికంగా కాల్చి చంపాడు.

తరువాత ఆ పాప చెల్లి, పదకొండేళ్లది, ముందుకు వచ్చి తనని కాల్చమన్నది. దుండగుడు ఆమెను కాల్చాడు, కానీ‌ఆమె చివరికి ప్రాణాలతో బయట పడింది. ఆపైన వాడు మిగిలిన పిల్లలందరినీ కాల్చాడు. వాళ్లలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మిగిలినవారి ప్రాణాలు దక్కాయి. అందరినీ కాల్చాక దుండగుడు తనని తాను కాల్చుకుని చచ్చిపోయాడు.

పిల్లల తల్లిదండ్రులు, మొత్తం ఆమిష్ తెగవారందరూ ఈ సంఘటనతో చలించిపోయారు. కానీ ఈ దురాగతానికి వారి ప్రతిస్పందన మాత్రం అనూహ్యంగా ఉండింది. వాళ్ళనుకున్నారు- "మరణాలన్నీ దైవనిర్ణయాలే. ఈ పిల్లల మృతికి మేం దు:ఖిస్తున్నప్పటికీ ఆ దేవుని నిర్ణయాన్ని సవినయంగా స్వీకరిస్తున్నాం. వారిని చంపిన దుండగీడు కూడా చచ్చిపోయాడు. మాలాగే, అతని కుటుంబంకూడా దు:ఖిస్తూ ఉంటుంది. ఆ విధంగా , మేమందరం కూడా హింస వల్ల బాధకు గురైనవాళ్లమే."

అందువల్ల, ఈ దురాగతం జరిగిన కొన్ని రోజుల తరువాత, ఆమిష్ తెగవారు అనేక బండ్లతో ఊరేగింపుగా ఆ దుండగుడి ఇంటికి వెళ్ళి, అతని కుటుంబ సభ్యులకు ఆహార పదార్ధాలు, వగైరాలను ఇచ్చి, వారికి తమ సానుభూతిని తెలియజేశారు.

హింస పునరావృతం కాకుండా ఆపగల్గేది కేవలం క్షమ మాత్రమే.

3 comments:

శరత్ కాలమ్ said...

ఈ విషయం నాకు తెలుసు. నేను ఈ సంఘటన జరిగిన రోజుల్లోనే చదివాను. చక్కటి విషయం గుర్తుంచుకొని వ్రాసారు.

షికాగో ట్రిబ్యూన్ రోజూ చదువుతుంటాను.

Anonymous said...

గాంధీగారు చెప్పిందీ ఇదేకదా . ఒక చెంపను కొడితే రెండో చెంప చూపించమని ......( దీన్ని మనం కామెడీ చేసి పారేసాం కదం

sunita said...

షికాగో ట్రిబ్యూన్ నేనూ చదువుతాను.