Thursday, September 3, 2009

వనమాల

రెండువేల ఐదు వందల సంవత్సరాల క్రితం- గౌతమ బుద్ధుడు తాను కనుగొన్న సత్యాలను ప్రజలందరితోటీ పంచుకుంటున్న సమయం- అప్పుడాయన విదిశా నగరపు ఆవలనున్న మామిడితోపులో విడిది చేసి ఉన్నాడు. బుద్ధుడితోసహా భిక్షువులందరూ భిక్షాపాత్రలు చేతబట్టుకొని, ప్రతిరోజూ ఉదయాన్నే ఊళ్ళోకి వెళ్ళేవాళ్లు- భిక్షనర్ధించేందుకు.

ఒకనాడు బుద్ధుడు నగరపు వీధుల్లో నడుస్తుండగా ఆయన ప్రక్కనే ఒక రథం ఆగింది. దానినుండి సుందరమైన స్త్రీ ఒకామె దిగి, బుద్ధుని దగ్గరకు నడచుకొని వచ్చింది. మల్లెపూల మాలను చేబూనిన ఆ సుందరి, బుద్ధుని ముందు నిలచి, ఆయన మెడలో పూమాల వేసి వరించనెంచింది! బుద్ధుడు ఆమెను వారించాడు. "ఇది సరైన సమయం కాదు అమ్మాయీ! ప్రస్తుతం నేను భిక్షాపాత్రని ధరించి ఉన్నాను గద! ఈ మాలనే నువ్వు గనక నాకు రేపు ఉదయం, నేనుండే మామిడితోపుకు తెచ్చి ఇచ్చావంటే, అప్పుడు నేను దీన్ని సంతోషంగా స్వీకరించగలను" అన్నాడు. ఆమె సరేనని వెనుతిరిగింది.

ఆమె పేరు వనమాల. విదిశా నగరంలో పేరుగాంచిన, సంపన్న వేశ్య ఆమె. తన నాట్యగానాదులతో ఆమె నగరంలోని ధనిక విటులను తన దివ్యభవనంలోనే నిర్మించుకున్న సుందర సభా ప్రాంగణంలో రంజింపజేసేది. వ్యక్తిగత సంబంధాల పరంగా ఆ నగరపు ధనిక యువకులకు ఆమె తనదైన శిక్షణ నిచ్చేదికూడానూ. ఆమె నేర్పు, ఆమె అందచందాలను గురించిన ఖ్యాతి ఆరోజుల్లో ఆ ప్రాంతం అంతటా వ్యాపించి ఉండేది. ఆమె వెళ్ళిన తరువాత బుద్ధుని అనుయాయి ఒకరు ఆయనకు ఈ సంగతులు తెలియజేశారు.

మరునాడు తెల్లవారుతుండగానే వనమాల బుద్ధుని విడిదిని చేరుకున్నది. వయ్యారంగా ఆ మల్లెపూమాలను బుద్ధునికి సమర్పించింది. బుద్ధుడు సగౌరవంగా దానిని స్వీకరిస్తూనే "అమ్మాయీ! నువ్వు గమనించినట్లు లేదు- ఈ మల్లెలు వాడిపోయాయి. వీటి సువాసన కూడా పోయింది. నువ్వు నిన్న నాకు ఇవ్వబోయినప్పుడున్నట్లు లేవు, ఇవి ఇప్పుడు!" అన్నాడు ఆక్షేపించుతున్నట్లు.

వనమాల నొచ్చుకున్నది. "భగవానుడా! ఈ పూలు ఎంత త్వరగా వాడిపోతాయో మీకు తెలియనిదా? ఈ రోజున అవి తాజాగా ఉన్నాయంటే, రేపటికల్లా వాటి పని సరి. అయినా మీరు తెమ్మన్నారని అదే పూమాలను తెచ్చి మీకు సమర్పించాను. నన్ను క్షమించండి" అన్నది.

"అవును, నిజం" అన్నాడు బుద్ధుడు చిరునవ్వుతో. "సరిగా చెప్పావు నువ్వు. కానీ ఏ నియమం అయితే నువ్వు ఈ పూలకు వర్తిస్తుందని చెబుతున్నావో, అదే నియమం మన ఈ శరీరాలకు కూడా వర్తిస్తుంది! దీన్ని గుర్తుంచుకొని మనం మన అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవాలి- ఏమంటే మనకు ఉన్న సమయం చాలా తక్కువ. మేలుకో అమ్మాయీ! నీ శరీరాన్ని అమ్ముకోకు!"

బుద్ధుని బోధ స్పష్టంగా ఉండింది. సునిశితమైన ఆ మాటలు శరాఘాతాలై వనమాలను తగిలాయి.

ఆపైన వనమాల విటులను ఆకర్షించటం మానివేసింది. క్రమంగా తన జీవితాన్ని ధర్మమార్గంలోకి మలచుకున్నది. ప్రతిరోజూ సాయంత్రం బుద్ధుని బోధనలను వినేది.

వానాకాలం ముగిసి, బుద్ధుడు తన అనుయాయిలతో కలిసి వేరేచోటికి పయనమైనప్పుడు, వనమాల తన ఆస్తులు అన్నింటినీ త్యజించి, సన్యాసిని అయి, వారితోబాటు బయలుదేరింది.

అలా బుద్ధుని బృందంలోకి ఒక కొత్త భిక్షుణి చేరుకున్నది. కాలాంతరంలో ఆమె శుద్ధచేతస్కురాలై, తన జీవితాన్ని పావనం చేసుకున్నది.

(మూలం: పర్తాప్ అగర్వాల్, అప్రచురిత కథలు)

No comments: