Saturday, July 3, 2010

నరేంద్రనాథ్

గొర్రెపాటి నరేంద్రనాథ్.. ఇంకా ఉన్నాడు. పోయిన సంవత్సరం ఈరోజున చనిపోయినప్పటికీ, మిత్రులందరి హృదయాల్లో నరేన్ ఇంకా పదిలంగానే ఉన్నాడు.

రాజకీయాల్లో అరాచకీయాన్ని చూస్తున్నా, రక్షకుల అకృత్యాలను చూస్తున్నా, కులాల పేరిట జరిగే కొట్లాటల్ని చూస్తున్నా, చదువుల పేరిట తెస్తున్న దుర్మార్గపు చట్టాల్ని చూస్తున్నా, నేలను దోచుకునే దళారుల్ని- తిరుపతి వేంకటేశ్వరునికి వాళ్లిచ్చే కోట్ల రూపాయల తెల్లధనపు ముడుపుల్ని చూస్తున్నా, వినియోగదారీ సంస్కృతిలో కొట్టుకుపోతున్న యువతరాన్ని చూస్తున్నా, స్వలాభాపేక్షతో మునిగిపోయే ప్రజాసంస్థల్ని చూస్తున్నా, అప్పుల్లో‌ చిక్కుకుని అలమటించే రైతుల్ని చూస్తున్నా- ఆ వ్యథలో జనించే ప్రతి స్పందన లోనూ నరేన్ ప్రతిరూపం కదులుతున్నది ఇంకా.

స్వతంత్ర జీవితాన్ని ప్రేమించిన నరేన్ స్వతంత్రం లేనన్ని రోజులూ- ప్రతి రోజూ గుర్తుకొస్తూనే ఉంటాడు.

Thursday, May 13, 2010

సుబ్బారావు ఎందుకు చచ్చిపోయాడు?

సుబ్బారావుకి కూడా, అందరిలాగే, ప్రాణం అంటే తీపే. చచ్చిపోవాలని అస్సలు లేకుండింది అతనికి.

సుబ్బారావుకి ఒక భార్య, ఒక కొడుకు. వాడికి రెండేళ్ళు. వచ్చీరాని మాటల్తో వాడు ముద్దు ముద్దుగా "ఓయ్, నాన్నా, అవ్వా" అని అరుస్తుంటే సుబ్బారావు మనసు పులకరించిపోయేది. తను చచ్చిపోతానని అసలు ఏనాడూ అనుకోలేదు అతను.

అందుకనే, డాక్టర్లు తన కిడ్నీలో రాళ్ళున్నాయని గుర్తించినప్పుడు, బాగా నీళ్ళు తాగటం కూడా మొదలుపెట్టాడు. ఆయుర్వేదమందులూ వాడాడు.

ఆరోజు సుబ్బారావు పుట్టిన రోజు.

పుట్టినరోజు పార్టీని పదిమంది మిత్రులతో కల్సి జల్సాగా ఫలానా ఊళ్లో తోటలో జరుపుకుంటానన్నాడతను.

"వద్దు- ఇంట్లో ఉండు" అన్నది భార్య, ఎప్పటిలాగానే.

భార్యమాటలు వినాలని అనిపించలేదు సుబ్బారావుకి. మందు పార్టీ ఊరించింది.

పదిమంది మిత్రులూ ఆరేడు మోటారుసైకిళ్లు వేసుకొని, తాగేందుకు మందు సీసాలూ, తినేందుకు మాంసాలూ తీసుకొని బర్రున వెళ్ళిపోయారు- ఫలానా ఊరువైపుకు.

ఫలానా ఊరి తోటలో మిత్రులందరూ కులాసాగా మందు పుచ్చుకొని వీరంగాలు చేస్తుంటే, ఆ తోట వోనరుకు మంటగా అనిపించింది. "పోతారా,లేదా? తాగి తందనాలాడేందుకు మీ అయ్య పొలం అనుకున్నారా?" అని రగడ పెట్టుకున్నాడు.

"నేనేమన్నా మామూలోడ్నా? సుబ్బారావుని!" అని సుబ్బారావుకూ అనక తప్పలేదు. మాటకు మాట పెరిగింది. తోటవాడు పోయి పోలీసుల్ని పిల్చుకు వచ్చాడు.

పోలీసులు మరి ఏమనుకున్నారో, తోటవాడి వెంబడి బయలుదేరి వచ్చారు.

పోలీసులు వస్తున్నారని, మిత్రులంతా తలొకదారినా పరుగెత్తారు- ఎవరి మోటారు సైకిళ్లు వాళ్ళు పట్టుకొని.

సుబ్బారావూ, ఇంకొకడూ హడావిడిగా మోటారుసైకిలెక్కి, హడావిడిగా, జోరుగా బయలుదేరారు- ఇంటివైపుకు.

గవుర్మెంటు వాళ్ళు కొత్తగా వేయించిన రహదారి మెరిసిపోతోంది- పాములాగా, పొడుగ్గా, వంకర్లు తిరుక్కుంటూ పోతోంది.

పొలంవాడిని తాము ఎలా ఏడిపించారో చెప్పుకుంటూ పోతున్నసుబ్బారావుకు వేగం హుషారెక్కించింది.

ఆ తర్వాత ఏమైందో తెలీదు సుబ్బారావుకూ, వెనక కూర్చున్న మిత్రుడికీ: తలపగిలి చచ్చిపోయిన రెండు శరీరాలు, ముద్దైపోయిన ఒక మోటారు సైకిలు దొరికాయి ఊళ్లో వాళ్లకు.

"వద్దంటున్నా వినకుండా వెళ్ళాడు- సినిమాకు" అని ఏడ్చింది సుబ్బారావు భార్య.

రెండేళ్ల పిల్లవాడు బిక్కు బిక్కుమంటూ నిల్చుంటే అందరి గుండే తరుక్కుపోయింది.

భార్య మాట వినకపోవటం వల్లే సుబ్బారావు చచ్చిపోయాడన్నారు కొందరు.

పుట్టిన రోజు పార్టీలు ఇలా చేస్తాయనుకున్నారు, పాత తరం వాళ్ళు కొందరు.

పొలం వోనరుతో రగడ పెట్టుకోకపోతే బాగుండేది. రగడ పెట్టుకునే చచ్చిపోయాడు, సుబ్బారావు" అన్నారు పారిపోయిన సహచరులు.

"అయినా పోలీసులు చేసిన హత్యే, ఇది. వాళ్ళు రాకపోయి ఉంటే సుబ్బారావు చనిపోయేవాడు కాదు" అన్నారు వాళ్లలో ఓ పక్షం వాళ్ళు.

" ఈరకం మోటారు సైకిళ్ళు ఇంతే- బ్యాలన్సు సరిగ్గా లేదు- ఆ బైకు వల్లే సుబ్బారావు చచ్చిపోయాడు" అన్నారు ఊళ్ళో కుర్రవాళ్ళు కొందరు.

"ఇంత వెడల్పాటి రోడ్డుకు ఆ వంకరలెందుకట? వంకర్ల వల్లే సుబ్బారావు పోయాడు" అన్నారు ఊరి పెద్దలు.

"హెల్మెట్ పెట్టుకోనందువల్లే సుబ్బారావు చచ్చిపోయాడు" అని శ్రద్ధాంజలి సభలో ఆర్టీవోగారితోపాటు, స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులూ వక్కాణించారు.

"చచ్చిపోయిన సుబ్బారావు తాగి ఉన్నాడని రాస్తే, పాపం వాడి కుటుంబానికి ఇన్సూరెన్సు డబ్బులు రావు" అని, డాక్టరు గారు దయతలచారు- పోస్టుమార్టం రిపోర్టులో ఆ ఒక్క మాటా రాయలేదు.

ఇంతకీ, అసలు సుబ్బారావు ఎందుకు చచ్చిపోయాడంటారు?

Saturday, January 9, 2010

బందులూ-ఉద్యమాలూ ఇంకెన్నాళ్ళు?

రాష్ట్రంలో బందులను చూస్తుంటే తిక్క రేగుతోంది.

చాలు స్వామీ! ఈ బందులు ఇక బందు చేయండి. మామూలు జనాల్ని బొంద పెట్టకండి.

మీకు ఏది కావాలో అది తీసేసుకోండి- తొందరగా- ఈ ఒక్క సారికీ. మళ్ళీ‌మీక్కావలసింది మీకు దొరుకుతుందో, దొరకదో. ఇప్పుడే తీసేస్కోండి. మామూలు జనాల్ని బందు చేయటం మాత్రం ఆపేయండి ఇంక.

'ఉద్యమాలవాళ్ళూ'! మీ బ్రతుకు తెరువులేంటి? ఉద్యమాలేనా? ఉద్యమాలు బాగా కూడు పెడుతున్నాయా? బందుల్లో జనాలకు ఉప్పు దొరక్క అల్లాడుతుంటే, పగలగొట్టిన మెగా దుకాణాల చక్కెర మీకు దక్కటంలేదు గద!?

ఉద్యమాల్లో బస్సుల్ని కాల్చేసీ కాల్చేసీ, అవైపోయిన తరువాత అరచేతులు దురద పెడితే మీ కోడళ్ళనీ, భార్యల్నీ, అమ్మల్నీ, అక్కచెల్లెళ్లనీ కాల్చెయ్యరు గద!?

టివి దుకాణాల టివిలు, నగల దుకాణాల నగలు, ఆర్టీసీ‌బస్సుల సీట్లు, కనబడ్డ టూ వీలర్లూ, కార్లూ, రిలయన్సు దుకాణాల పచారీ సరుకులూ అన్నీ మీకేనా? అవన్నీ‌ అయిపోయాక, రాళ్ళూ వేసేందుకు వేరే ఏవీ దొరక్క, మామూలు జనాల ఇళ్ల మీదికి వస్తారేమో, ఎలాగ!?

మీడియా వాళ్ళూ! మిమ్మల్ని ఎవ్వరూ‌ఏమీ అనకూడదు కాబోలు. దేవుళ్ళూ మీరే, దయ్యాలూ మీరే, సర్వమూ మీరే. అందరూ మీ బాంచలే. కాల్మొక్కాలి కాబోలు. ముసలి గంగారాం గుండెజబ్బుతో పోతే మీకు అది తెలంగాణా మరణమా? సుబ్బయ్య ఊపిరాడక చస్తే మీకు అది చప్పున సమైక్యాంధ్ర మృతి లెక్కల్లోకి చేరుకుంటుందా? శవాల మీద బ్రతికేది రాబందులేమో గదా, వాటి పాత్రా మీరే నిర్వహిస్తే ఎలాగ? ఇంతకీ మీరు రాష్ట్రాన్ని కాల్చబోవట్లేదా? ఎందుకు కాల్చట్లేదు? పోనీ, రేపేమన్నా కాల్చుతారా? ఎందుకు కాల్చరు? కాల్చకపోవటం వెనక ఏమేం శక్తులున్నాయంటారు? ఏశక్తులూ లేవంటే, దాని అర్థం ఎవరో మనుషులు ఉన్నట్లేనంటారా? లేరంటారా? మరి మీ యజమానులు ఏం చేస్తున్నట్లు? వాళ్లు మనుషులు కారంటారా? ఏమైనా అయితే మీ జర్నలిస్టులను పట్టుకుంటారెందుకు? మీ యజమానులు మీకు అంత స్వేచ్ఛ ఇస్తున్నారుగదా, తప్పులన్నీ‌ మీవేనంటారా? నిజంగానే!? అబ్బ!! ఎంత స్వేచ్ఛాజీవులండీ, మీరు! మీ ఓనర్లు స్వయంగా ఎవరో రాజకీయం వాళ్ళు అని జనాలు అనుకుంటున్నారు గదా! కాదంటారా? అవునంటున్నారా! అయినా ప్రభుత్వం వాళ్ళను ఏమీ ఆనకూడదంటారా? వాళ్ళ పీక నొక్కితే ప్రజాస్వామ్యానికి ఊపిరాడదు కాబోలు. మీరూ నొక్కక, ప్రభుత్వమూ నొక్కక, కోర్టులూ నొక్కకపోతే, మరి మీవాళ్లను అడ్డుకునేదెవ్వరు? "పత్రికా స్వేచ్ఛ" అంటే మీ వోనర్ల స్వేచ్ఛేనా? నెలన్నరగా రాష్ట్రాన్నంతా అతలాకుతలం చేసేస్తున్నారే, మీ వోనర్లూ, రాజకీయనాయకులూ ఒక్కటేనని అందరూ అంటున్నారే, అయినా మీవాళ్ళు ఈ "స్వేచ్ఛ" ముసుగులు వేసుకునే ఉన్నారే, మామూలు జనాలకేనా, స్వేచ్ఛలు లేనిది? మీ వోనర్లనేమైనా చేస్తే మీరంతా కదం తొక్కుతారే, మీకేమైనా అయితే మామూలు జనాల దుకాణాలు మీరంతా కల్సి బందుపెడతారే, మరి మీరు మామూలు జనాలకు ఏం తిండి పెడుతున్నారు? టీఆర్పీ రేటింగులూ, అడ్వర్టైజుమెంట్ల రేట్లూ తప్ప, "మీకు జనాల శ్రేయస్సు అవసరం" అని మేమెందుకు నమ్మాలి? ఎవరైనా మిమ్మల్నెందుకు వదిలెయ్యాలి, ఇంత జరిగాక? సెన్సార్షిప్ పేరుతో మిమ్మల్ని ఎవరో నియంత్రించబూనితే, మా స్వాతంత్ర్యం తగ్గిపోయినట్లు మామూలు జనాలం, మేమెందుకు ఏడవాలి? మీదీ వ్యాపారమే. ఈ బందుల్లో అందరి వ్యాపారాలూ దెబ్బ తిన్నాయి- మీరొక్కరే లాభపడ్డారు. మీ వోనర్లకు ఇది బాగుంది. వాళ్ళు ఇలా కొనసాగించమంటారు. మీరు ఇంకెంతకాలం, వాళ్ళకు చెంచాగిరీ చేస్తారు? మీ అంతరాత్మలు చచ్చిపోనైతే లేదు గద!?

ఒరేయ్, 'విద్యార్థులూ', మీరు గూండాలట్రా? లేకపోతే చెంచాగాళ్ళా? తెలంగాణా వస్తే మీరంతా మంత్రులౌతారట్రా? సమైక్యాంధ్ర మీకేమైనా కిరీటాలు పెడుతున్నదట్రా? మీకేం ఒరుగుతున్నదో మీకేమైనా తెలుస్తున్నదట్రా, అసలు? సభలు పెట్టీ, యూనివర్సిటీల్లో ఊరేగింపులు చేసీ ఎవరేం పొడుస్తున్నార్రా? మీకందరికీ కనీసపు బ్రతుకు తెరువు, మర్యాదతోకూడిన జీవితాలు- చూపించగలర్రా, వీళ్ళు? జలయజ్ఞాల్లో సొమ్ము రాయలసీమకు చేరలేదురా, ఒరేయ్, సీమలో‌పదిమంది జేబుల్లోకి దూరింది. ప్రామిస్. నమ్మండి. మామూలు జనాలకు ఒక్కపైసా లాభం కలగలేదురా. తెలంగాణా వాళ్ళు రాయలసీమ మూలల్లోకెళ్ళి చూడండి. సీమవాళ్ళు తెలంగాణ పల్లెల్లోకెళ్ళి చూడండిరా, ఒరేయ్, మామూలు జనాలు అందరూ-అంతటా అడుక్కుంటూ, పట్నాలను అనుకరించలేక, మురిగిపోతూ, పెద్దోళ్ళ కాళ్లొత్తుతూనే ఉన్నార్రా. తెలంగాణాలో ఉన్నంత వెనకబాటు తనం లేని ఊళ్ళు ఏ జిల్లాలోనూ లేవురా, ఒరేయ్, వీళ్ళూ మిమ్మల్ని వాడుకుంటున్నార్రా! మీ చదువులు నాశనం. మీకు రాబోయే ఉద్యోగాలు నాశనం. మీ ఇంటోళ్ల సంపాదననాశనం. మీ నోటిదగ్గర కూడు నాశనం అవుతోందిరా, ఒరేయ్, అమ్మ అయ్యలు తెచ్చి పెడుతున్నారట్రా, మీకు, ఖాళీ రోడ్లమీద, పంచభక్ష్య పరమాన్నాలు? అవి తెచ్చిపెడుతున్నవాళ్ళూ ఏ స్వార్థమూ లేని గాంధీ మహాత్ములేనట్రా? ఒరేయ్, కొంచెం ఆలోచించండ్రా, తొత్తులవ్వకండి. నిజంగా మేలుకోండి. మీ చదువులు మీరు బాగా చదవండిరా, మీ అమ్మ అయ్యల కలలు నిజం చెయ్యండి. అర్టీసీ బస్సులు పగలగొడితేనూ, సీట్లు-టైర్లు కాలిస్తేనూ‌ ఏమొస్తుందిరా, ధరలు పెరగటం తప్ప? విద్యార్థిశక్తిని పనిలో చూపండిరా, మేధస్సులో చూపించండి. వినాశంలో కాదమ్మా! గూండాలవ్వద్దండమ్మా! ఇంకోళ్లని కాల్చటం పాపం బాబులూ! ఏది కావాలంటే అది తీసేసుకోండి- దయచేసి మీ గూండాగిరీని అంత పబ్లిక్ గా ప్రదర్శించకండి. ప్లీజ్!

గూండాలమీద కేసులు పెట్టటం ప్రభుత్వ బాధ్యత. ప్రజా ఆస్తుల్ని నష్టపరచిన వాళ్లను పట్టుకోవటం, వాళ్లమీద కేసులు పెట్టటం ప్రభుత్వం పని. ఆపని ప్రభుత్వం చేసేట్లుగా చూడటం కోర్టుల బాధ్యత. జనాల ఆస్తుల్ని నాశనంచేసినవాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కై, వాళ్లమీద కేసులు ఎత్తెయ్యాలంటే, మరి నష్టపోయిన ఆస్తుల సంగతేమిటి? వాటినెవరు భరించాలి? కేసులు ఎత్తెయ్యాలనేవాళ్ళు ఆ ఖర్చునూ‌భరిస్తే బాగుంటుందేమో! అందరూ ఆలోచించండి- ఎలాగూ గాలిలో చాలా డబ్బులే మూలుగుతున్నట్లున్నాయి- లేకుంటే ఇంత గొప్ప అల్లర్లను నెలన్నర పాటు రచించటం ఒట్టి మాటలు కాదు. పోనీ, జరిగిన నష్టాలన్నిటినీ గాలి భరిస్తుందేమో అడగరాదూ, ఎవరైనా?

Friday, January 1, 2010

అమ్మా! నాకీ బడి జైలు వద్దే!

అమ్మా! నేను బడికి పోనే!

నేనొట్టి చిన్న పిల్లనే, అమ్మా. నాకెవరైనా కథలు చెప్పాలి, నాకెవరైనా నేర్పించాలి.
కప్పపిల్లల్నీ, సీతాకోక చిలకల్నీ చూడటం నాకిష్టం- అవేం తింటాయో, ఎక్కడ నిద్రపోతాయో తెలుసుకోవటం నాకిష్టం. ఇంకా నేనో కొండనెక్కాలి, పైన ఎగిరే మబ్బుని పట్టుకొని, అది దేంతో తయారైందో చూడాలి.

పారే ఏరులో చేతులు పెట్టి చూడాలి నేను. ఈదే చేపలు నా వేళ్ళకి తగిల్తే ఎంత బాగుంటుందో చూడాలి.
కుక్క పిల్లల్తోబాటు పరుగులెత్తాలి నేను, పిట్టలతో కలిసి పాటలు పాడాలి, వానలో కాయితపు పడవల్ని తేల్చాలి.
మెత్తటి పచ్చ గడ్డిలో పడుకొని పిల్లగాలి చెప్పే కబుర్లు వినాలి- ఆ తర్వాతే నాకు వాటిని గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనిపిస్తుంది, ఆ తర్వాతే వాటిని చదవాలనిపిస్తుంది. నా ఊహలు ఎగిరాకే, తెలుసుకోవాలనే దాహం మొదలయ్యాకే, 'ఎందుకు?'అనే బీజం నా మెదడును తొలిచాకే- ఏమైనా చదువుతా.

అమ్మా! నాకీ బడి జైలు వద్దే!

వాళ్ళు యంత్రాల మాదిరి చెప్పుకుపోతుంటే నా ఆత్మ ముడుచుకుపోతోందే!
మొదట్లో అడగాల్సిందేదైనా అడిగితే, వాళ్లు "అది చెప్పాలంటే సమయం చాలదు. సిలబస్ అయిపోవాలి" అంటారే!

నిజంగా అర్థం కావాలంటే నేను కొంచెం ఆగాలే. -ఆగకుండా మార్కులకోసం పరిగెత్తి నేను అలిసిపోతున్నానే!

పురాతన వస్తువుల్ని చూపించి మా టీచర్లు వాటి చరిత్ర చెప్పాలని నా కోరిక.

ప్రకృతిలో నడిపించి నిజం జీవశాస్త్రం నేర్పిస్తే బాగుండు.

బ్రద్దలయ్యే అగ్ని పర్వతాల్నీ, సముద్తాలలోని అగాధాల్నీ వీడియోల్లో చూపిస్తేనేం?

మేముండే నగరంలోని చారిత్రక కట్టడాల్నీ, సాంస్కృతిక నిర్మాణాల్నీ నిజంగా చూపిస్తేనేం?

ఖగోళ విజ్ఞానం చదివేముందు, కనీసం ఒక్కసారన్నా టెలిస్కోపులోంచి ఆకాశాన్ని చూస్తానే!

వీటన్నిటినీ ఊరికే చదవటం నాకిష్టం లేదే, అమ్మా! నేను వీలైనన్నిటిని చూడాలి, వినాలి, తాకాలి, వాసన చూడాలి, రుచి చూడాలి- నాకు వీటన్నిటి అనుభూతీ కావాలే!

బడి సంవత్సరంలో కనీసం ఒక్కసారన్నా అట్లా బైట తిప్పచ్చుగదే!

ఇంకా..
పుస్తకాల సంచీ బరువును మోసేందుకు నా నడుమును ఇంకా వంచటం నావల్ల కాదే! ఇప్పటికే నడుం విరిగేందుకు సిద్ధంగా ఉంది. అన్ని పుస్తకాలూ రోజూ ఎందుకు మొయ్యాలి, నేను? రోజుకో రెండు సబ్జెక్టులు నేర్పించచ్చుగా, ఎందుకు చేయరలాగ? లేకపోతే వేరే దేశాల్లోలాగా బళ్లో లాకర్లు పెట్టమనండే, నా పుస్తకాల్ని అక్కడే పడేసి వస్తాను. నేను ఊపిరాడని ఆ ఆటోల్లో ఇరుక్కుని ఎందుకు పోవాలే?

ఎదగటం నాకు నచ్చట్లేదే, అమ్మా! అసలు పెద్దవ్వాలనే అనిపించట్లేదు. పెద్దైతే ఇంకా ఎక్కువ హోం వర్కులు, ఇంకా పెద్ద శీతాకాలం ప్రాజెక్టులు, వేసవి తరగతులు, వారాంతపు పరీక్షలు, నెలవారీ పరీక్షలు, మూడు నెలల పరీక్షలు, ఆరు నెలల పరీక్షలు, వార్షిక పరీక్షలు, బయటి పోటీ పరీక్షలు, ఇంకా పరీక్షలు, ఇంకా పోటీలు, ఇంకా వత్తిడి, ఇంకా ఒత్తిడి... నేనసలు పెద్దవ్వనే, అమ్మా!

నేనెప్పుడు పాడాలి, బొమ్మలకి రంగులెయ్యాలి, డాన్సు చెయ్యాలి, ఈదాలి, ఎప్పుడు సైకిల్ తొక్కాలి?
ఎప్పుడు క్రికెట్ ఆడుకోను, నేను? ఎప్పుడు దాగుడు మూతలు ఆడను?
నువ్వెప్పుడూ చెబుతావే, " పిల్లలు కనీసం ఇన్ని గంటలు నిద్రపోవాలి" అని? ఆ లెక్కలు ఇప్పుడు ఎక్కడికెళ్లాయే, అమ్మా?

నేనెందుకు ఎప్పుడూ చదవాలి, చదవాలి, చదవాలి?

అమ్మా, నాకు భయమేస్తోందే. నమ్మటానికి వీల్లేని టీచర్లు చేసే చెడ్డపనులు పెరిగిపోతున్నాయే. పెద్ద పిల్లలు ర్యాగింగ్ చేస్తారట. కొందరు తిక్కోళ్లకు యాసిడ్ అంటే ఇష్టమట, వెకిలి పెద్దవాళ్లూ ఎక్కువౌతున్నారే!

అమ్మా, నాకిప్పుడే డాక్టరవ్వాలనీ లేదు; ఇంజనీరవ్వాలనీ లేదు- అసలు ఎవ్వరవ్వాలనీ లేదు.
-భద్రంగా, జాగ్రత్తగా ఉండాలి, ముందు. ఎట్లాంటి ఒత్తిడీ లేకుండా ఆడుకోవాలి. ఆడుకుంటూ నేర్చుకోవాలి, అంతే.

(ఆంగ్ల మూలం: ఇనుమెళ్ల శశికళ, ది హిందూ ఓపెన్ పేజ్.. సేకరణ: విక్రాంత్ పాటిల్)