Wednesday, September 2, 2009

ఒంటి చేతి చప్పట్ల శబ్దం!

పర్తాప్ అగర్వాల్ గారు వారానికొకటి చొప్పున, అనేక సంవత్సరాలుగా తనకు గుర్తుకొచ్చిన కథలు రాస్తున్నారు-ఇంగ్లీషులో. ఉడతాభక్తిగా వాటిలో కొన్నింటిని తెలుగులోకి చేద్దామని ప్రయత్నం మొదలెట్టాను... ఆ క్రమంలో ఈ బ్లాగుకు మొదటి కథ ఇది:


జపాన్ లో బౌద్ధభిక్షువులు చాలామంది కాలినడకన దేశమంతటా తిరిగేవాళ్ళు. వాళ్ళకు సాయంగా ఉండేందుకని, దారిలో, ఎక్కడపడితే అక్కడ, జెన్ ఆరామాలు ఉండేవి. నడిచే భిక్షువులు ఎవరైనా, ఒకటి రెండు రోజులపాటు నడిస్తే, ఏదో ఒక ఆరామాన్ని తప్పక చేరుకోగలిగేవాళ్ళు. వాళ్ళకి అక్కడ ఉచితంగా వసతి, భోజనం వగైరా సదుపాయాలుండేవి.

అయితే ఈ ఆరామాల్లో ప్రవేశం అంత సులువుగా లభించేదికాదు. భిక్షువులలాగా వేషం వేసుకొని తిరిగే మోసకారులను గుర్తించి, త్రిప్పి పంపేందుకుగాను ఆరామాల్లో ప్రత్యేక పద్ధతులుండేవి. దీనికి కారణాలు రెండు: వనరులు పరిమితంగానే ఉండటం ఎలాగూ ఒక కారణం; అయితే సమయాన్ని వృధా చేసుకోవటం ఇష్టం లేకపోవటం ముఖ్యమైన అసలు కారణం.

ఇలా సందర్శకుల్ని త్రిప్పి పంపేసేందుకు వాడే విధానాల్లో ముఖ్యమైనది, "ప్రశ్నించటం". ప్రతి సందర్శకుడినీ ఒక ప్రత్యేకమైన ప్రశ్ననడుగుతారు. దానికి వాళ్లిచ్చే జవాబు అర్థవంతంగా లేకపోతే వారికి ఆ ఊళ్ళోని హోటళ్ల, సత్రాల చిరునామాలుండే పట్టికనిచ్చి మర్యాదగా సాగనంపుతారు.

ఒకసారి, సన్యాసి ఒకడు, రెండురోజుల నడకనీ ఒకే రోజున ముగించి, చాలా అలసిపోయి, విపరీతమైన ఆకలితో, సూర్యాస్తమయం అయిన తరువాత చాలాసేపటికి ఒక ఆరామాన్ని చేరుకొని తలుపు తట్టాడు. అప్పటికి బాగా చీకటి పడింది. బయట ఎముకలు కొరికేంత చలిగా ఉన్నది. ఆరామంలో చదువుకునే పిల్ల సన్యాసి ఒకడు, తలుపు రెక్కను కొద్దిగా తెరిచి, బయటికి తొంగి చూసి, మామూలుగా అడిగే ప్రశ్నల పరంపర మొదలుపెట్టాడు: "నువ్వెవరు? ఎక్కడినుండి వస్తున్నావు? ఎక్కడుంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చావు?..." ఇలా.

నడిచి వచ్చిన సన్యాసికి సంగతి అర్థమైంది. ప్రతి ప్రశ్నకూ అతను మర్యాదగా, జెన్ సన్యాసులకు సహజమైన స్పష్టతతో, సమాధానం ఇచ్చాడు. కానీ అప్పటికే అతను బాగా అలసిపోయి ఉన్నాడు; అతని ఓపిక వేగంగా తగ్గిపోతున్నది; "ఇక ఈ వెర్రి, కుర్ర సన్యాసి తన ప్రశ్నల జోరును ఆపి, తలుపు తెరిచి తనని లోనికి రమ్మంటే బాగుండును- తనకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, నిద్రముంచుకొస్తున్నది" అనుకుంటున్నాడు అతను.

ఆలోగా కుర్ర సన్యాసికి ఉదయం తన గురువుగారు తనని అడిగిన ప్రశ్న ఒకటి గుర్తుకొచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క తను ఉదయంనుండీ తంటాలు పడుతున్నాడు! అందుకని, అతను తమ సందర్శకుడిని పరీక్షించేందుకుగాను అదే ప్రశ్నని ఎంచుకున్నాడు- " ఒక చేత్తో కొట్టిన చప్పట్ల శబ్దం ఎలా ఉంటుందో నీకు తెలుసా?" అని.

బయట చలిలో నిలబడ్డ సన్యాసి ఓపిక ఆసరికి పూర్తిగా నశించింది. ఈ కుర్రవాడితో మరిన్ని ప్రశ్నలు అడిగించుకునే శక్తి లేదు అతనికి. అలాగని వీడితో సైద్ధాంతిక చర్చలో పాల్గొనే ఇష్టమూ లేదు! అందుకని, అతను మెరుపువేగంతో తన కాలి చెప్పును తీసి, ఆ చెప్పుతో కుర్ర సన్యాసి గూబ గుయ్ మనేట్లు ఒక్కటిచ్చాడు- "వినబడిందా? ఒంటి చేతి చప్పట్ల శబ్దం?" అంటూ.

కుర్ర సన్యాసి నిర్ఘాంతపోయాడు. అతనిలోని ప్రశ్నలన్నీ ఎండుకుపోయాయి. వెంటనే తలుపులు తెరిచి, అతను సందర్శకుడిని లోనికి రానిచ్చాడు.

భోజనం కానిచ్చిన సన్యాసి వెంటనే నిద్రపోయాడు.

మరునాడు ఉదయం అతను శలవు తీసుకుంటుండగా, కుర్ర సన్యాసి అడిగాడు వినమ్రంగా: "అయ్యా! నిన్న రాత్రి మీరు నాకు ఇచ్చిన ఒంటిచేతి చప్పట్ల శబ్దం నిజంగా ఒంటి చేతి చప్పట్ల శబ్దమేనంటారా?" అని.

"ఏమాత్రం సందేహ పడకు సోదరా, అది ఒంటి చేతి చప్పట్ల శబ్దం ఎంతమాత్రమూ కాదు. రోజంతా నడిచీ, నడిచీ అలసిపోయిన నేను, నీ ప్రశ్నల పరంపరకు తాళలేక, నిన్ను ఆపేందుకని, నీకు ఒక్కటిచ్చుకున్నాను- అంతే. అయితే, మరికొంత ఆలోచించినమీదట, నా చర్య నువ్వడిగిన శబ్దాన్ని ఉత్పత్తి చేసిందనే తోస్తున్నది నాకు. ఎందుకంటే, అది తక్షణమే కోరిన ఫలితాన్ని ఇచ్చింది గద! అంతేకాక, నా చర్య ఆలోచనా రహితంగా ఉత్పన్నమైన అసంకల్పిత చర్య. ఒంటిచేతి చప్పట్ల శబ్దం అలాంటి చర్యనుండే ఉత్పన్నం అవ్వాలి మరి!" అన్నాడు సన్యాసి, నవ్వుతూ.

(మూలం: పర్తాప్ అగర్వాల్, అప్రచురిత కథలు)

No comments: