Friday, May 8, 2009

తెలుగమ్మకు కొత్త కర్పూరం!

రామారావు ఈరోజెందుకో అన్యమనస్కంగా ఉన్నాడు. తెలుగు తల్లికి పదనీరాజనాలు అర్పించాలని అతనికి చాలా కోరిక. పాత కర్పూరాలకంటే కొత్త కర్పూరాలే మంచివని ఎవరో చెప్తే, తెలుగమ్మకోసం కొత్త పదకర్పూరాల్నే వెలిగించాలని పట్టుబట్టి కూర్చున్నాడు అతను ఎంతో కాలంగా. కానీ ఎంత కాలం గడిచినా ఆ కర్పూరాలు అంటుకోవట్లేదు. నిల్వలు పేరుకు పోతున్నై; కానీ ఎందుకో సరుకు అమ్ముడవటం లేదు.

జనాలందరూ పాత కర్పూరాల్నే కొనుక్కు పోతున్నారు. ఏమని అడిగితే- "అవి బాగానే వెలుగుతున్నై కదా?" అంటున్నారు. "అలా కాదోయ్, పాత కర్పూరాల్ని ఉన్నవి ఉన్నట్లు వాడుకోకూడదు, వాటికి నూత్న సొబగుల్ని కూర్చి, నవీన గుబాళింపులు అద్ది హారతులిద్దాం, 'మన తల్లేమీ వెనకబడలేద'ని ప్రపంచానికి చాటుదాం" అని రామారావు ఎంత ప్రేరేపించినా, జనాలు వినటంలేదు. పాత వాసనల్నే పట్టుకు వేళ్లాడుతున్నారు.

'చాలాసార్లూ అనీ అనీ బోరుకొట్టి, తను ఎక్కడో 'పల్సార్లు ' అని రాస్తే, ప్రొద్దున వాడెవడో "ఏమయ్యా, బజాజ్ కంపెనీ వాడి రెండు చక్రాల బండి లాగా?" అన్నాడు- అదీ, ప్రస్తుత విషాదయోగానికి 'తూపుదూబ ' (అర్ధం కాదులెండి.. తూపుదూబనే ఆంగ్లంలో ట్రిగ్గర్ అంటారు అని రామారావు గార్నడిగితే తెలుస్తుంది..). నొచ్చుకున్న రామారావు ముఖం మాడ్చుకొని "అట్లనవలదార్యా" అని పురాణఫక్కీలో మర్యాదగా మొదలుపెడితే, "ఏమండీ, మేం మామూలు మనుషులం. మీరు మమ్మల్ని త్రేతాయుగంలోకి తీసుకుపోతామన్నా , మేం రాం" అన్నాడు వాడు. "పాతవి ప్రశంసిస్తే- అర్థం కావట్లేదంటారు, నవీనతను ప్రతిఫలింపజేస్తే- ప్రయోగాలొద్దంటారు- మరెలాగ, భాషాప్రవృద్ధి?"‌ (భాషాభివృద్ధి అనటం పాతదైయాక రామారావు అట్లా అనటం మొదలుపెట్టాడు) అని రామారావుకు బెంగ పట్టుకున్నది.

అంతలో ఆనందమూర్తి వచ్చాడు. పదప్రయోగాల్లో ఆనందమూర్తి రామారావుకు దీటురాయి. ఆయన పదసమ్మేళనం చేస్తే, ఈయన పద సంఘటనం; ఆయన నవీన పద విసృంభణం చేస్తే, ఈయన పురాణపదఖండనం చేస్తుంటాడు. "ఒరేయ్, రామం, ఈ మధ్య అంతర్జాలంలో తెలుగు భాషామాతకు సువాసన కర్పూరం తప్ప మామూలు ధూపం వేయట్లేదటరా! మనం అంతర్జాల పరిభాషలో పాటవం సంపాదించి, మన ప్రకర్షని నిష్కర్షగా ప్రకటించే రజత తరుణం ఆసన్నమైంది" అన్నాడు ఆనందం, వస్తూనే.

"అంతర్జాలం ఏమిటీ, మార్జాలం లాగా?" అని విస్తుపోయాడు రామారావు.

బదులుగా "ఆ!!" అని నిర్ఘాంతపోయాడు ఆనందం. "ఆమాత్రం తెలీదా? సామాన్యులు దాన్ని బ్రిటిష్ లో ఇంటర్నెట్ అంటున్నారు. మనం మన సుసంపన్న తెలుగులో దాన్ని 'అంతర్జాలం' అనాలి " వివరణాత్మకంగా వదించాడు ఆనందం. ఇప్పటికే చిన్నబోయిన రామారావు ముఖం ఈ దెబ్బకు ఇంకా సంకోచించింది.

ఎందుకో ఆనందం ముందు రామారావు ఎప్పుడూ తెలవెలబోతుంటాడు ఇలాగే.

"అలా కాదోయ్ ఆనందం, ఇంటర్నెట్ను 'అంతర్జాలం' అని పిలిస్తే అందరికీ అర్థం కావొద్దూ? ఎంచక్కా "ఈవల" అనొచ్చుగా? అన్నాడు రామారావు తన ప్రయోగానికి తనే ఉబ్బిపోతూ.

"ఈవల అంటే సామాన్యులకు సగం అవ్వదు. వాళ్లు దాన్ని 'ఇక్కడ ' అనుకునే సందర్భం ఉంటుంది. దాని నివారీకరణకోసం అంతర్జాలం అనటమే ప్రశస్తం" అన్నాడు ఆనందం, కొంచెం తగ్గి.

"కాదోయ్, మన వలలో ఎలాగూ ఒకముడికీ మరో ముడికీ గట్టి దారపు సంబంధం ఉండనే ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పక్కర్లేదు. ఏదో ఒక ప్రత్యయం కూర్చాలి గనక, ('e')'ఈ ' అంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునేవాళ్ళు దేన్నైనా నేర్చుకోవాల్సిందే. ఏ పదాల్నైనా కొంచెం బలవంతంగా వాడింపజేస్తే అవి వాడుకలోకి వచ్చేస్తాయి గద!" అన్నాడు రామారావు వివరిస్తున్నట్లు.

ఆహా, ఇంకా రకరకాలుగా అనొచ్చు. ఎలాగూ కొత్తపదమే గనక దాన్ని 'పరస్పర సంబంధ వల ' అనొచ్చు. ఏమైనా అనొచ్చు, విని, వాడేవాళ్లుంటే సరి. అయినా, ఏమోనోయ్, రామం.. మనలో మనకే సయోధ్య కుదరకపోతే బయట మనపని అయోధ్య అయిపోదూ? కొంచెం ఏకాభిప్రాయ సాధనీకరణ చర్చ చేయాలి మనం" అన్నాడు ఆనందం, కూర్చోబోతూ.

"ఏమండీ, లేస్తారా, లేదా? 'పిల్లకి తెలుగు రావట్లేదు, టీచర్లు సున్నాలు వేయలేక నెగటివ్ మార్కులిస్తున్నారు ' అని మొత్తుకుంటున్నా వినకుండా ముచ్చట్లలో మునిగితేలుతున్నారా? లేస్తారా, లేకపోతే బాపుగారి బామ్మ మాదిరి చపాతీ రుద్దేది-..అదేంటో..- అది చేత పట్టుకురమ్మంటారా?" అరిచింది సరళ లోపల్నుండి.

"కోల!!" అని అరిచారిద్దరూ, ఆనందం లేచి బయటికి పరుగెత్తే లోపు.

"జనాలకి ఈ మాట సులభంగా గుర్తుకు రావట్లేదు..కొత్త పదం ఒకదాన్ని సృష్టించాలి.." అని ఆలోచించటం మొదలెట్టాడు రామారావు.

Thursday, May 7, 2009

చరైవ..చరైవ

ఇరవై ఐదేళ్ళ క్రిందటి సంగతి...

రామారావు, సీత ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు చంద్రం.

చంద్రానికి రెండేళ్ళు నిండగానే నర్సరీలో చేర్పించారు. ఆ రెండేళ్ళూ సీత పడ్డ పాట్లు సీతమ్మకూడా పడలేదు. అందుకని బడి వాళ్లు ఒకరోజు రమ్మంటే, వీళ్ళూ రెండు రోజులు వెళ్ళి- క్యూలో నిలబడి మరీ చంద్రాన్ని బళ్ళో వేశారు. రెండ్రోజులు శలవతోబాటు ఇరవైవేలు డొనేషనూ కట్టాల్సి వచ్చింది. అంతా చేసి ఆ బళ్ళో హాస్టల్ వసతి లేదు! పిల్లల్ని వాళ్ళు రెండింటికల్లా వదిలేసేవాళ్ళు. ఆ తరువాత వాడు నేరుగా క్రష్ కెళ్ళి, మిగిలిన పిల్లల్తో ఆడుకునేవాడు- అమ్మా, నాన్నా వచ్చి ఇంటికి తీసుకెళ్ళేంతవరకూ.

వాడికి నాలుగేళ్ళు నిండాక వాడ్నితీసి ఇంకో బళ్ళో వేశారు. "ప్రగతి కాంవెంట్"లో ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడింటి వరకూ ఉంచుకునేవాళ్ళు పిల్లల్ని. అందరికీ 'మమ్మీ, డాడీ'లు నేర్పించటంతో పాటు, వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఫలితం బాగుంది- చంద్రం తెలుగుకంటే ముందు ఇంగ్లీషులో ముద్దు ముద్దుగా "ఐ ఈజ్ గుడ్" అంటుంటే మురిసిపోయారు ఇద్దరూనూ.

చంద్రం ఒకటికి రాగానే రామారావు అప్పుచేసి అతన్ని డాష్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించాడు. బడి నియమాల ప్రకారం వాడు బడి హాస్టల్ లోనే ఉండేవాడు. 'పిల్లల్ని ఇంటికి వదిలితే, వేర్వేరు సంస్కృతులు వాళ్ళని ప్రభావితం చేస్తై. అలాకాక అందర్నీ కలిపి పెంచితే, వాళ్ళకి చిన్నప్పటి నుండే పోటీ తత్వం, సమాజపు వ్యాపార నైజం అర్థమౌతాయి ' అనే ఉన్నతమైన భావన ఆ బడిని అభివృద్ధిలోకి తెచ్చింది. చంద్రం వారాంతంలో మాత్రం ఇంటికి వచ్చేవాడు - ఇలా రెండేళ్ళు నడిచింది. ఆ తరువాత వాడు శలవల్లో తప్పిస్తే ఇంటికి రాలేదు.

అయితేనేం, చక్కగా చదువుకుని, ఎనిమిదో తరగతికల్లా సోమయ్యగారి కోచింగ్ లో సీటు సంపాదించుకున్నాడు వాడు. ఆ తరువాత గుజరాత్ లో గిగర్వాల్ గారి శిక్షణలో వాడు మెరికలాగా తయారయ్యాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు; పెద్దింటి పిల్ల రమను ప్రేమ వివాహం చేసుకున్నాడు; ఇంద్రానికి తండ్రయ్యాడు.

ఇరవై ఐదేళ్ళ తరువాతి సంగతి:

చంద్రం, రమ ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు ఇంద్రం. వీళ్ళు ముగ్గురి మెడలకీ రెండు బరువులు- చంద్రం తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మలు.

రామయ్య రిటైరైన రెండేళ్ళకు వాళ్ళిద్దర్నీ ఊరి చివర్లో‌ఉన్న వృద్ధాశ్రమంలో‌చేర్పించారు. ఆ రెండేళ్ళూ రమ పడ్డ పాట్లు ఏ సినిమా హీరోయిన్ కూడా పడి ఉండదు. అందుకని, వృద్ధాశ్రమం వాళ్ళు రెండు లక్షలు ఇమ్మంటే, చంద్రం రామయ్యతో చెప్పకుండా మొత్తం తనే కట్టేశాడు అవలీలగా. అంతా చేసి ఆ ఆశ్రమంలో‌హాస్పిటల్ సౌకర్యం లేదు! వీళ్లకు ఏమైనా జబ్బుచేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చి వదిలేసే వాళ్ళు! చివరికి రామయ్య ,సీతమ్మలు అక్కడ ఉండటానికి బదులు నిరంతరం‌ ఇంట్లోనే తిష్ఠవేయటం మొదలుపెట్టారు.

అందుకని రెండేళ్ల తర్వాత వాళ్లిద్దర్నీ ఇంకో వోల్డేజ్ హోం లో వేశారు. "గియానంద వోల్డేజ్ హోం" లో వీళ్ళను చక్కగా చూసుకునేవాళ్ళు. అందరికీ ఇన్ హౌస్ మెడికల్ ఫెసిలిటీ తో బాటు, ప్రతిరోజూ సాయంత్రం మనసుకు ప్రశాంతతను చేకూర్చేందుకుగాను కంపల్సరీ మెడిటేషన్ కూడా ఉండేదక్కడ. అయితే రామారావుకేమయిందో, ఊరికే ఫిట్లు రావటం మొదలై అందరికీ అసౌకర్యంగా తయారైంది.

ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ ఖుషీవ్యాలీ లో ఉన్న 'ఇంటర్నేషనల్ హోం ఫర్ ది ఏజ్డ్ ' లో చేర్పించాడు చంద్రం. దానికోసం అతను ఆఫీసులో లోను తీసుకోవాల్సి వచ్చిందిగానీ, తల్లిదండ్రుల సుఖం కోసం ఆమాత్రం చేయలేదనుకుంటారని, అతను ఆ రిస్కు తీసుకున్నాడు. వీళ్ళు మనల్ని నెలకోసారికంటే ఎక్కువ సంప్రతించరు. చివరికి వీళ్లకేమైనా అయితే క్రిమేట్ చేయించటం, వగైరా అన్నీ వాళ్లే చూసుకుంటారు. "ముసలివాళ్ళని పిల్లలమీద వదిలితే, వాళ్ళు మనవళ్ళకీ, మనవరాళ్లకీ చిన్నప్పటినుండే వెనకబాటు ధోరణులు మప్పుతారు. పిల్లలకు ప్రగతిశీలమైన అలవాట్లు రావాలంటే ముసలివాళ్ళని వీలైనంత దూరంగా ఉంచాలి" అనే ఉన్నతమైన భావన ఖుశీవ్యాలీకి వెలుగులు తెచ్చింది.


అక్కడ వాళ్లిద్దర్నీ కలిసి మాట్లాడుకోనిచ్చినప్పుడల్లా రామయ్య, సీతమ్మ ఒకే సంగతి మళ్లీ మళ్ళీ ముచ్చటించుకునేవాళ్లు- "మనం చిన్నప్పుడు చంద్రాన్ని మనతోపాటు ఉంచుకొని ఉంటే, వాడూ ఇప్పుడు మనల్ని వాడితోబాటు ఉండనిచ్చేవాడేమో" అని!

ఆపైన వాళ్ళిద్దరూ ఇక ఇంటికి పోలేదు. చక్కగా అక్కడే ఉంటూ, హాయిగా అక్కడే కన్నుమూశారు.

Tuesday, May 5, 2009

ఓ ట్రాజెడీ..

రామారావుకు సహనం ఎక్కువ అనుకుంటుంటారు అంతా. కానీ సరళకూ, సరళ తల్లిదండ్రులకూ మాత్రం అసలు సంగతి తెలుసు- రామారావుకున్నంత కోపం, చికాకు, అసహనం ప్రపంచంలో వేరెవరికీ ఉండవంటుంది సరళ. రామారావు పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే, పదిసార్లు పిలిస్తే తప్ప పలకడు. అదీ ఏదోలా ముఖం పెట్టుకొని విన్నట్లు వింటాడు. పదిసార్లు అలా పిలిస్తే- (అంటే పదిపదులు వందసార్లన్నమాట!) అప్పుడు ఇక చికాకు పడూతూ కాగితాలు పక్కన పడేసి లేస్తాడు తను. ఆపైన మాట మాట్లాడకుండా చెప్పిన పని చేస్తాడు. సరళకే అనిపించాలన్నమాట- "ఎందుకు కదిల్చాంరా, భగవంతుడా!" అని.

సరళా ఏమంత సరళమైనది కాదు. హెచ్చుతగ్గులు బాగా ఉంటై, ఆమె తత్వంలో. ఒక్కోసారి తాము గొప్పపేరు సంపాదించుకోవాలని ఉంటుంది. ఒక్కోసారి తాము గొప్ప డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది. రామారావుకు ఆ రెండూ లేనందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది.

రామారావూ ఓ రకం మనిషి. అంటీ ముట్టనట్లే ఉంటాడు; మళ్లీ అన్నీ తనకు నచ్చినట్లే జరగాలంటాడు. సరళకూ అదే ఇష్టం: ఆమె కూడా అన్నీ తనకు నచ్చినట్లే జరగాలనుకుంటుంది. ఇక ఇద్దరి మధ్యా అంతర్యుద్ధాలు చెలరేగేవి. ఈ యుద్ధాల్లో రామారావు నిశ్శబ్దశీలి. సరళ శబ్దశీలి. ఇరుగు పొరుగులందరికీ సరళ గొంతే వినబడుతుండేది. రామారావు మొండితనం, మంకుపట్టూ సరళకు తప్ప వేరెవరికీ వినబడేది కాదు. "పాపం, రామారావు మంచోడు" అనుకునేవాళ్ళు అందరూ.

పిల్లని పెంచటం రాక సరళ సతమతమౌతుంటే, పిలిచేంతవరకు పట్టించుకోడు రామారావు. అతను పట్టించుకోగానే పిల్ల కిలకిలలాడేది. "పిల్లని ఎప్పుడూ ఎందుకు పట్టించుకోడు, ఎందుకు ఎప్పుడూ కాగితాలు ముందేసుకుని కూర్చుంటాడు?" అని సరళ వేధించేది. "మూగమొద్దులాగా కూర్చోకపోతే కొంచెం టైము నాకూ, పిల్లకీ ఇవ్వచ్చుగా" అని సరళ కొంచెం ఉచ్చ స్థాయిలో అంటే తప్ప, రామారావు ఆ కాయితాలను వదిలి లేచేవాడు కాదు.

గొడవలు బాగా ఎక్కువైతే "వదిలిపెట్టి పారిపోతా"ననేది సరళ. "నువ్వు ఒప్పుకోకగానీ, లేకపోతే నేనే ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని" అనేవాడు రామారావు. "ఇలా సర్దుకుపోయి బ్రతుకులు ఈడ్వటం కంటే మమ్మల్ని మా ఇంటికి పంపేసి విడాకులు తీసుకోండి " అనేది సరళ. "ఆ పనేదో నువ్వే చెయ్, నాకు పనిలేదూ?" అని గొణిగేవాడు రామారావు.

రామారావు చేసే పని సరళకు అర్ధవంతంగా అనిపించేదికాదు. అతని రాతలూ, చేతలూ అన్నీ ఏదోలా అనిపించేవి. ఎవరైనా ఆమెముందు అతన్ని మెచ్చుకుంటే , "మీకేంతెలుసు" అనుకునేది. "రాత కోతలు తిండిపెడతాయా, బంగళా కార్లు తెస్తాయా? వాటి బదులు ఇంటిపని చేస్తే ఏం" అని పోట్లాడేది సరళ. "వాటివల్లే ఇల్లు గడుస్తోంది- వాటికి అంతమాత్రం అన్నా గౌరవం ఇవ్వకపోతే ఎలా" అనేవాడు రామారావు, మళ్లీ పేపర్లు ముందేసుకుంటూ.

"తననీ పిల్లనీ మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నాడు. మమ్మల్ని అసలు పట్టించుకోడు" అని సరళకు విశ్వాసం ఏర్పడిపోయింది. "ఇక లాభం లేదు- మా వాళ్లింటికి వెళ్ళిపోతాను. నువ్వు మారితే తప్ప తిరిగి రాను" అని సరళ పెట్టే బేడా సర్దుకొన్నది చాలాసార్లు. రామారావు అలాంటప్పుడు ఏమీ మాట్లాడేవాడు కాదు- మూగమొద్దులాగా నిలబడే అతన్ని చూస్తే సరళకు కోపం ఇంకా పెచ్చుమీరేది.

మనం ఏది తలిస్తే దైవం అదే తలుస్తుందట. జీవితాలు తలక్రిందులైనై, ఓ రోజున. రోడ్డు ప్రమాదంలో సరళ, పిల్ల ఇద్దరూ పోయారు. రామారావు ఏడవలేదు.
ఊరికే కూర్చున్నాడు మౌనంగా.
ఆపైన అతను మాట్లాడటం మానేశాడు.
రాయటం మానేశాడు.
నవ్వటం మానేశాడు.
ముభావంగా తనపని తను చేసుకుంటూ ఉండటం మానేశాడు.
ఓ రోజునుండీ కనబడటం మానేశాడు.

"పాపం, రామారావు మంచోడు. భార్యా,పిల్లలంటే ఎంత ప్రేమ!" అనుకున్నారు ఇరుగుపొరుగులు.

"ఇంకా తత్వం మార్చుకోలేదు. ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు" అనుకున్నది సరళ.