Sunday, April 27, 2008

జెనరేషన్ గ్యాప్

కాలం ప్రవహిస్తోంది. కాల గతిలో జీవితాదర్శాలు మారతాయి, మాట్లాడే భాష,
వాడే పదాల వెనక ఉన్న భావనల లోతు, అన్నీ మారిపోతై.

"హై, సాండీ, నేనూ వస్తా రాత్రి పార్టీకి. ఏంటీ, కవితతో క్లోజ్ గా మూవ్
అవుతున్నావ్? నేనంటే మొహం మెత్తిందా?" సెల్ ఫోన్ లో తన స్నేహితుడితో
అంటోంది మా కూతురు సాహితి.

మనసులో ఏదో మూలన అర్థంకాని ఆవేదన. ఈ పార్టీలేంటి, ఆడ-మగ కలిసి
తిరగటాలేంటి? పచ్చిగా ఇలా మాట్లాడుకోవటాలేంటి? అసలు ఈ సెల్ ఫోన్లేంటి?

"ఏంటి నానా, ఎక్కడికో వెళ్లిపోయినట్లున్నావే?" అంటోంది బిడ్డ. సర్దుకున్నాను.
"ఏం లేదురా బేటా, మీ తరం పోకడలు ఎటుపోతున్నాయని ఆలోచిస్తున్నా,
ఎప్పటిలాగే."

"ఊఁ, ఆలోచించండి. ఇంకా బాగా ఆలోచించండి. జెనరేషన్ గ్యాప్ రా నానా. అది
తేలే సమస్య కాదు. అది సరే, సాయంత్రం పార్టీ. విన్నావుగా? నేను లేటుగా వస్తా,
ఒకె?"

"నేనూ రానా?" అన్నా, ఏమంటుందో చూద్దామని. ఆగిపోయి నా ముఖంలోకి
చూసింది. నేను నా మనసును వేరుచేసి దానికి మాస్క్ వేసి పెట్టుకున్నా,
సిద్ధంగా. "ఇది కపుల్స్ పార్టీరా నానా. నీకూ ఓ గాళ్ ఫ్రెండుంటే నిక్షేపంగా
రావొచ్చు. కమల ఆంటీ వస్తుందేమో కనుక్కోనా?" అంది కన్నుగీటుతూ. కమల
మా సన్నిహితురాలు, సాహిత్య ప్రేమి.

"నువ్వు టిక్కెట్లు బుక్ చెయ్యి చాలు, నేను కమలతో మాట్లాడుతాను" అన్నా.
"నీకేమీ సమస్య అవ్వదుగా?"

"వావ్, వాటె కరేజ్ మ్యాన్! మానాన మళ్ళీ కుర్రవాడౌతున్నాడు!" అంది "నాకేం
ప్రాబ్లెం? నీదారి నీది, నాదారి నాది. ఫ్రీడంరా నానా. అన్ని బాధలకీ ఒకే మందు-
ఫ్రీడం" అంది బిడ్డ.

కమలతో మాట్లాడి చెప్పాను సంగతి. "ఓ సారి చూడాలి, మా సాహితి ప్రపంచాన్ని.
వస్తావా?" అన్నా.

"ఇదేమీ గూఢచర్యం కాదుగదా, పర్లేదు వొస్తాను." అంది కమల. "ప్రియాంక గాంధీ,
వాధ్రాని కలిసిందీ డిస్కోథెక్ లోనేనట. అంత గొప్పవాళ్ళు కలవగా లేనిది,
చిన్నపిల్ల, సాహితి కలిస్తే ఏం తప్పు?" అంది తనే, మళ్లీ.

"తప్పని కాదు, కానీ వీళ్లు ఎటుపోతున్నారని ఆలోచిస్తున్నా."

"చూడండి మాస్టారూ, మీ మార్క్సిజాలూ, గాంధీజాలు ఎటుపోతున్నాయని
ఆలోచించటం అలవాటు చేస్తై. వీళ్లకు ఎవరికీ ఇజాలు లేవు. అందుకని ఆ
బరువూ లేదు. మీరు వీళ్లని మీ అద్దాల్లోంచి చూసి బాధపడుతున్నారా
అనిపిస్తోంది" కమల సాహితిని వెనకేసుకొచ్చింది, అలాగే నాపై విమర్శనాస్త్రాలు
సంధిస్తూ.

సాయంత్రం పార్టీకి వెళ్లేసరికి అది మొదలైపోయి ఉన్నది. నేను, కమల వెళ్లి మాకు
కేటాయించిన టేబుల్ దగ్గర కూచున్నాం. చుట్టూ మద్యం. స్టేజీ మీద
అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా డాన్స్ చేస్తున్నారు. పాశ్చాత్య సంగీతం
హోరెత్తుతోంది.

సాహితి ఒకడిని చేయిపట్టుకొని లాక్కొచ్చి పరిచయం చేసింది. "ఇతను స్యాండీ..
అదే.. సందీప్ నానా. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు" అని.

"మీ గురించి చెప్తుంటుంది సర్, సాహితి. మీరు తనని పెంచిన తీరు- హ్యాట్సాఫ్ టు
యు సర్" అన్నాడతను. "మా మమ్మీడాడీలు మీ రైటింగ్స్ చదువుతుంటారు.
నేను పెద్దగా ఏమీ చదవనులేండి." అన్నాడు అతనే.

నేను కమలకేసి చూశాను. "చదవనని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు?" అన్నట్లు.
కమల అతన్ని అభిమానంగా చూస్తోంది, సాహితి లాగానే. అతను ఇంకా
చెప్తున్నాడు-"మీ అమ్మాయి చాలా కన్సర్వేటివ్ సార్, మొన్నామధ్య రవి తనకి
ప్రొపోజ్ చేస్తే మానాన్న చూసినవాడినే చేసుకుంటాను పొమ్మంది."

"మరి, నువ్వు.." గొణిగా నేను. "నేను, కవిత ప్రేమించుకుంటున్నాం సర్. పెళ్ళి
చేసుకోబోతున్నాం, వచ్చే నెలలో" అని కవితను పిలిచి పరిచయం చేశాడు "హేఁ
కవీ, సాహి వాళ్ల డాడ్" అని.

సాహితి ఇంకా వాడి చెయ్యి పట్టుకొని వేళ్లాడుతోంది.

"వావ్. మీ అమ్మాయి నిజంగా చాలా మంచిది అంకుల్. సాహిత్యంలో తనకు
తెలీని అంశం లేదు. కథలు రాసేవాడిని తప్ప వేరే ఎవర్నీ చేసుకోదట" అంటోంది
కవిత.

"మరి ఇది కపుల్స్ పార్టీకదా, కవిత ఒక్కతీ ఎలా వచ్చింది? కమలని అడిగా,
వాళ్లంతా వెళ్ళాక. "రవిమీద సానుభూతితో అతన్ని వెంటబెట్టుకొచ్చింది" అంది
కమల తాపీగా కూల్ డ్రింక్ ని చప్పరిస్తూ.

నేను తేరిపార చూశాను.

"మహానుభావా, జెనరేషన్ గ్యాప్ అంటే ఏంటో విశ్లేషించినంత మాత్రాన అది
లేకుండా పోదు. నీ బిడ్డమీద నీకు నమ్మకం, గౌరవం ఉంటే తన మానాన తనని
వదలాలి. వేరే ఏమీ చేయలేవు కూడా. కళ్ళాలు బిగించినకొద్దీ ఈ తరం పిల్లలు ఆ
శృంఖలాల్ని తెంపుకు పోతారు. వాళ్లకి ప్రపంచంలో దయ, కరుణ, జాలి వేరే
రూపాల్లో ఉన్నై. అమెరికన్ సంస్కృతి మరుగున దుమ్ముకొట్టుకుపోయి ఉండొచ్చు,
నీ దృష్టిలో. కానీ ఏదో ఒక రూపంలో ఇంకా ఉన్నై, చచ్చిపోలేదు. పిల్లలు నీ
మాదిరి గాంధీని ఆరాధించరు. గాంధీగిరీని, దాన్ని తిరిగి అమ్మిన సంజయ్ దత్
లోని నటుడినీ ఆరాధిస్తారు. కానీ నువ్వు వాళ్ళను తిట్టి, చిన్నబుచ్చి, సాధించేది
ఏమీ లేదు. వాళ్లంతట వాళ్లు తెలుసుకోవలసిందే. సాహితి మంచి పిల్ల. సొంత
నిర్ణయాల్ని తీసుకునే తెలివితేటలున్నాయ్ తనకు. అది నీ అదృష్టం అనుకో." అంది
కమల స్పీచ్ ఇస్తున్నట్లు.

"అయినా, ఇలాంటి జనాలవల్ల మన సమాజంలోని పేదవాడికి ఏం ఒరుగుతుంది?
మన సమాజం ఎటు పోతోంది?" అన్నా.

కమల మాట్లాడలేదు. నాకు తెలుసు, నేను, కమల పాత తరం వాళ్లం. జెనరేషన్
గ్యాప్ ని అధిగమించటం దాదాపు అసాధ్యం మాకు.

Tuesday, April 8, 2008

జామచెట్టు నవ్వింది!!

చెట్లు పండ్లెందుకిస్తాయి?

పిల్లలూ, ఉడతలూ, చిలకలూ అవి తమకోసమే అనుకుంటాయి. మనం, పెద్దవాళ్లం, తమ జాతిని విస్తరింపజేయటం కోసమే చెట్లు పండ్లనిస్తాయని చెప్పుకుంటాం- మనసులో మాత్రం, మనమూ ఆ పండ్లన్నీ మనకోసమేననుకుంటాం. దేవుడు మనిషిని తనలా సృష్టిస్తే, మనిషి దేవుడిని తనలా సృష్టించాడట!

ఏమో, అందరూ ఎవరికి తోచినట్లు వాళ్లు అనుకుంటూ ఉంటే, అసలు సృష్టికర్తలైన ఆ చెట్లు నవ్వుకుంటూ, సంతోషంగా తలలూపి, పండ్లను ఇంకా క్రిందికి, క్రిందికి అందిస్తున్నాయేమో.

లేకపోతే ఏ చెట్టుకాకారణాలుండచ్చు. ఒక్కో చెట్టును ప్రత్యేకంగా అడగాలేమో, నువ్వెందుకు కాయలిస్తావని. అయితే సామాన్యంగా ఏ చెట్టూ ఈ ప్రశ్నకు సరైన జవాబిస్తున్నట్లు లేదు-

ముఖ్యంగా మా ఇంట్లో జామచెట్టు. ఎంత అడిగినా ఉలకదు, పలకదు.

మామూలుగా ఎలాగూ మాట్లాడదు. కొంచెం కవితావేశంతో అడిగితే వేరే ప్రశ్నలన్నిటికీ జవాబిస్తుంది, కానీ ఈ ప్రశ్నకు మాత్రం మౌనమే సమాధానం. అది ఇలా జవాబు చెప్పనప్పుడల్లా నేను ఉక్రోషంతో ఉడుక్కునేవాణ్ణి. నా అంతటివాడికి
జవాబియ్యట్లేదని చిన్నబుచ్చుకునేవాడిని.

అలా జరిగిన ప్రతిసారీ జామ చెట్టు కలవర పడేది. తన మొద్దు మొద్దు ఆకుల్ని నాకు తగిలించేందుకు పెళుసు కొమ్మల్నే కొద్ది కొద్దిగా వంచేది. కాయల్ని, పండ్లని నాకు ఇంకా దగ్గర చేసి అందుకొమ్మని సైగలు చేసేది.- కానీ జవాబు మాత్రం ఇచ్చేదికాదు.

లక్షలమందికి తన ప్రవచనాలతో స్ఫూర్తినిచ్చి తరింపజేసిన బుద్ధమూర్తి కొన్ని ప్రశ్నలడిగితే మాత్రం ముని అయ్యేవాడట. అలా మౌనంతో ఆయన ఉరిమితే, ఆ ఫెళ ఫెళలకు ప్రశ్నించిన వాళ్ల అహంకారం పగిలి అంతర్గంగ ధారలై పారేదట!

మా జామచెట్టు మౌనం మరి నన్నేమీ చేయలేకపోతోంది ఎందుకో. బండబారిన నా హృదయాన్ని తాకేంత శక్తి దాని మౌనానికి లేదేమో ఇంకా. నా అహంకారాన్ని స్పృశించేంత చనువు తీసుకోలేక ఊరుకుంటోందేమో, మరి.

చిన్నప్పటినుండి దాన్ని సాకింది నేనే. ఓ రోజు ప్రొద్దునే పళ్లు తోముకుంటుండగా ఉమ్మివేసే చోట బుజ్జి బుజ్జి ఆకులు వేసిన చిన్న మొక్క కనిపించింది, పదిహేనేళ్ల క్రితం. అప్పట్లో దాన్ని జాగ్రత్తగా త్రవ్వి తీసి, మా ఇంటి పెరడులో తలుపుకెదురుగా నాటి, రోజూ అదెలా ఉందని చూసేవాళ్లం. తరువాత్తరువాత పట్టించుకోవలసిన వాళ్లు వచ్చేసరికి దానిపై శ్రద్ధ తగ్గింది. పండ్ల కాలంలో తప్ప ఇతరసమయాల్లో పెద్దగా తలచుకోలేదు. ఇప్పుడు పిల్లలందరికీ రెక్కలొచ్చి ఎగిరిపోయారు, మేమూ, జామచెట్టూ మిగిలాం మళ్లీ.

మధ్యమధ్య పిల్లలొస్తారు, వాళ్ల పిల్లలతో. మళ్లీ సందడి. అందరూ నవ్వుతారు, హడావిడి పడతారు, కష్టాలు, సుఖాలు పంచుకుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, సలహాలిస్తారు, పెరట్లో చెట్టునెక్కి వెతుక్కుంటారు, వెళ్లి పోతారు, ఇంకోసారి
వచ్చేందుకు. వాళ్లు వచ్చేసరికి చెట్టంతా పళ్లతో నిండి ఉంటే ఎంత బాగుండు! ఇన్నాళ్ల పెంపకమూ ఫలించినట్లౌతుంది.

మేం జామచెట్టును ఎందుకు పెంచాం, అసలు? కాయలకోసమేనా? కాదేమో. కొత్తగా కట్టిన ఇంటికి జామచెట్టు అందంకాదూ? ఆ జామచెట్టు చిన్ని మొక్కగా ఉన్నది, పెరిగి పెద్దదౌతుంటే, రోజూ కొన్ని ఆకులూ, రెమ్మలూ, కొమ్మలూ వేసి ఎదుగుతూ సంతోషంగా ఊగితే, దాన్ని తగిలి పులకించిన గాలి, మాకు గిలిగింతలు పెడితే, దాని పూల కమ్మని వాసన తెలిసీ తెలీని మా మనసుల్ని ఉల్లాస పరిస్తే, ఆ హాయిని సాంతంగా, సొంతంగా అనుభవించాలనే స్వార్థం లేదూ, అందులో? చిన్న పిల్లల్ని పెంచటంలో ఉన్న ఆనందం కొంచెం కొంచెంగా అర్థమౌతున్న ఆరోజుల్లో ఇంకో మూగ ప్రాణి మా చెంత పెరిగి పెద్దదైతే చాలునన్న ఆత్మానందం లేదూ, దాని వెనక? ఇంకా చెప్పటానికి రాని, మాటలకందని భావనలు ఎన్ని ఉంటాయో?

ఎవరైనా నువ్వెందుకు పెంచావని నన్నడిగితే, నేను ఏం చెప్పగలను, నిజంగా? అయినా మా కోరిక మాత్రం చావదు. ఆ చెట్టు మా సొంతం. మా సొంత చెట్టు ఇంకా ఇంకా కాయలు, పళ్లు ఇస్తూనే ఉంటుంది. అదిచ్చే ఆ పళ్లన్నీ మా సొంతమే. వాటిని మేం తింటాం- మేమూ, మా పిల్లలు, వాళ్ల పిల్లలు- అంతే. వేరే వాళ్లకు మేం ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. మా ఆస్తి ఇది. ఇతరులెవరికైనా జామకాయలు కావాలంటే మమ్మల్ని అడగాలంతే. మేం ఇచ్చి దాతలమని పుణ్యం, పేరు గడిస్తాం- ఇవ్వకపోతే తిట్లు తినటంలేదూ, మరి?

కానీ, జనాలు...! ఊరుకోరు. ముఖ్యంగా అలగా జనాలు. ఆ ప్రక్కన గుడిశల్లో ఉంటారే, శుచీ శుభ్రతా తెలీని జనాలు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలీక తమ మాదిరే అడుక్కు తినేలా తయారు చేసే వాళ్లు, వాళ్ల పిల్లలు- వాళ్ల కళ్లన్నీ మా జామచెట్టు మీదనే. స్కూళ్లూ, బళ్ళూ ఎలాగూ లేవు. వాళ్లకు, పిల్లలకీ అంతే, పెద్దలకీ అంతే- సమయం అనేదే లేదు- పొద్దు పొడిచింది మొదలు గోడ వెనక్కే చేరతారు. కట్టెలతో, రాళ్లతో పండ్లు తెంపేందుకు చూస్తారు, వాళ్ల సొంత చెట్టుకు మల్లే. మేం చూసి అరవకపోతే, పరిగెత్తుకొచ్చి తిట్టకపోతే గోడనెక్కేస్తారు కూడాను!

అన్నీ వట్టి ఈ జామకాయలకోసమే. బజార్లో దొరుకుతాయి- కొనుక్కోవచ్చుగదా? ఎందుకు, మా పళ్లే ఆశించాలి? ఈ పిల్లలు ఊరికే రారు. రాళ్లు వేస్తారు. ఆ రాళ్లు ఇంటివాళ్లకు, ఇంటికి ఎవరికి ఎక్కడ తగుల్తాయో చెప్పలేం. కొందరైతే ఏకంగా వంకీ కర్రలు, బుట్టలు పట్టుకొని వస్తారు.

పిల్లలేనంటే, పెద్దవాళ్లు ఇంకా అతి అయిపోయారు. వచ్చి గుమ్మానికి ఎదురుగా మునివేళ్లమీద నిలబడి వంకీ కర్రల్తో పండ్లు కోసుకుంటుంటే చూసి, అరుస్తామా, "ఏమయ్యా, ఏమ్మా, పనిలేదా, చెట్టు మీదే అనుకుంటున్నారా? సిగ్గు లేకుండా అంత బాహాటంగా కోసుకుంటున్నారా, కనీసం అడగాలన్న జ్ఞానం కూడా లేదా? అడిగితే మేం ఇవ్వకపోదుమా, ఓ కాయ? అంత సభ్యత, సంస్కారం లేకుండా ఇంకోళ్ల ఇంటి లోపలి చెట్టు కాయలు తెంపుతున్నారేం?" అని, వాళ్లంటారు- " సరే, మీరు లేరు అనుకొని కోసుకున్నాం. ఇప్పుడు వచ్చారు గదా, మా పాపకు కావాలట, కొన్ని పండ్లు మీరు ఇవ్వండి ఇప్పుడు". అలా అంటూండగానే మరో నాలుగుపళ్ళు వంకీ కర్ర బారిన పడతాయి. అరవటం తప్ప ఏమీ చేయలేని బుసకొట్టే ముసలి పాముల ముఖాలు ముడుచుకు పోతై. ఇంకొంచెం గొంతు పెంచేసరికి- " మరీ అంత కోపం వద్దు సార్, ఏదో పిల్లలు, కొన్ని పండ్లడిగితే ఇస్తే మీదేం పోతుంది?" అంటారు.
పండే రోజుల్లో గుంఫు తరువాత గుంపు- ఇదే వరస...

వాళ్ల బారినుండి తప్పించుకునేందుకు చెట్టునంతా- పచ్చిచి, పండువీ అన్నిటినీ ఊడ్చేయటం కూడా చేశాం, కొన్నిసార్లు. అలా కోసిన కాయల్ని మేం తినలేక, అవి పండిపోయి, ఎండిపోయి, మురిగిపోతుండగా గోమాతకోసం ప్రక్కకు పెట్టాం కూడా.

ఇదంతా గమనిస్తున్న జామచెట్టు నవ్వింది, మళ్లీ, మళ్లీ. జవాబులేని ప్రశ్నలు నన్నెందుకు అడిగావని, విరగబడి నవ్వింది.

కొత్త పల్లి

దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం బబ్లు, మేరీ అనే ఇద్దరు పల్లెలో స్థిరపడి సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, వారికి తమ పిల్లల చదువు గురించి ఆలోచించాల్సి వచ్చి, పల్లెలోని ప్రభుత్వ బడిని గమనించారు. అక్కడి బెత్తపు పెత్తనం చూసి తమ పిల్లలకు వేరేలాంటి బడులు వెతుక్కున్నారు. పిల్లల్ని అక్కడ కొట్టకుండా చదువులు చెబుతారు; దానికి తగినట్లు ఫీజులు వసూలు చేస్తారు.

ఇలా ’డబ్బులున్నవారి పిల్లలకు మాత్రం బెత్తంలేని చదువులుంటే ఎలా’ అన్న ఆలోచనతో టింబక్టు కలెక్టివ్ సంస్థ ఒక ప్రత్యామ్నాయ విద్యాకార్యక్రమం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చెన్నేకొత్తపల్లి పరిసరాల్లోని అనేక గ్రామాల్లోని పేదపిల్లలకోసం చిన్న చిన్న బడులు తెరిచారు. ఈ బడుల్లో పిల్లల్ని కొట్టరు; వాళ్లు ఇష్టంగా చదివితే చెప్తారు; లేకపోతే లేదు. పిల్లలు ఆనందంగా ఉండేందుకు, కళల్లోనైనా సరే, అభిరుచితో ఎదిగేందుకు తగిన వాతావరణం మాత్రం కల్పిస్తారు. వీటిలో ప్రవేశం ఉచితం. పిల్లలకు మధ్యాహ్నంపూట భోజనం, సాయంత్రం పూట "తినేందుకేదైనా" ఇస్తారు. చాలా కష్టకాలంలో ఉన్న పిల్లలకు అక్కడే ఉండేందుకు వసతి కల్పిస్తారు.

ఈ బడుల్ని నడిపేందుకుగాను బబ్లు, మేరీలు అనేకమంది మిత్రుల్ని, నిధులిచ్చే స్వచ్ఛంద సంస్థల్ని ఆశ్రయించారు. మిత్రుల వ్యక్తిగత సహకారంలో హెచ్చు తగ్గులుంటై. స్వచ్ఛంద సంస్థలకు మాత్రం చాలా ప్రశ్నలుంటై:

"మీరు ఎంతకాలం ఇలా చిన్నచిన్న బళ్లు నడిపిస్తారు?" అంటాయి కొన్ని సంస్థలు. "వీటిలోంచి ప్రతిసంవత్సరమూ బయటికొచ్చే పదిమందో, ఇరవై మందో పిల్లలు ఇప్పుడేం చేస్తున్నారు? ఓహోఁ, కూలిపని, ఇళ్లకు రంగులు వేసేపని, వైరింగు పని, పొలంపని, చేస్తున్నారా, అంతేనా?" అంటాయి కొన్ని. "మీరు ఇలా కొంతమంది పిల్లలకే పరిమితమైపోతే ఎలా? వీటిని ఇతరులు అనుకరించేందుకు మీరేం చేస్తున్నారు? మీరు చేస్తున్న పని వల్ల ప్రభుత్వ బడుల టీచర్లలో ఎలాంటి మార్పులొచ్చాయి?" రాసిమ్మని అడుగుతై కొన్ని సంస్థలు. "మీరు విస్తరించాలి, ఇలా ఒక్కచోట intensiveగా పనిచేస్తే చాలదు. ఫలానా సంస్థలమాదిరి బాలకార్మికుల గురించి, చిన్నపిల్లలమీద లైంగిక అత్యాచారాల గురించి ర్యాలీలు, పోస్టర్లు, ప్రచారాలు చేసి వేలమంది, లక్షలమంది పిల్లలతో పనిచేయాలి. అలాగైతేనే మేం డబ్బులిస్తాం. ఈ చిన్న చిన్న బడులతో మేమేం చేస్తాం? " అన్నాయి కొన్ని. టింబక్టు కలెక్టివ్ లోని మిగిలిన కార్యక్రమాల రూపురేఖలు వీళ్లకు అనుగుణంగా మారిపోయాయి. అయినా ఎవరో ఒకరు, దయామయులు సాయం చేస్తూనే వచ్చారు; బడులు అలా పడుతూ, లేస్తూ నడిచినై ఇన్నాళ్లూ. ప్రస్తుతం రెండు బళ్లు, ఓ మంచి లైబ్రరీ, చక్కని ప్రయోగశాల మాత్రం ఉన్నాయి, చిన్నగా.

"మీరు మీ పిల్లల దగ్గర ఫీజులు తీసుకోండి......." ; "బడులకు ఇప్పుడు సాయం చేస్తాం సరే- మరి, భవిష్యత్తులో మేం ఉండకపోతే ఎలా? మీ బళ్లు మేం ఇచ్చే ఈ డబ్బుతో స్వయం సమృద్ధితో స్వావలంబనను ఎలా సాధిస్తాయో చెప్పండి...." అని వేధిస్తూనే ఉన్నాయి సంస్థలన్నీ.

ఈ మధ్యలో మేం వచ్చాం.

"బడులు కర్మాగారాలు కావు; పిల్లలు కూలీలు కారు- లాభాలు సంపాదించటానికి, స్వావలంబన సాధించటానికిన్నీ. పేదపిల్లలు కూలిచేసి చదవరు. సమాజం వారి బాధ్యత తీసుకొని, వారికి ప్రేమగా, ఇష్టంగా చదువు పెట్టాలి, భోజనంతో బాటూ." అని చెప్పాలనుకున్నాం మేమంతా ఎప్పటినుండో, అయినా నోళ్లు నొక్కుకున్నాం.

"ప్రభుత్వాన్నో, ఇంకెవర్నో ప్రశ్నించటం, మీటింగుల్లోను సమావేశాల్లోను గడపటం, ర్యాలీలు చెయ్యటం పెద్దలుగా మీరు చెయ్యండి. మేం పిల్లలకు నేర్పించే పని చేస్తుంటాం. పిల్లల్ని పాపం, ఇంకొన్నేళ్లు అమాయకంగాను, ఆప్యాయంగాను, లోకమంటే ఇష్టంగాను ఎదగనివ్వండి. ఎయిడ్స్ ర్యాలీలు, దేశ సమైక్యత పరుగులు పాపం వాళ్లచేత చేయించనక్కర్లేదు. మీ వ్యాపార ప్రపంచాన్ని వారికి ఇలా పరిచయం చేయనక్కర్లేదు " అని గొణుక్కున్నాం.

"మేం ర్యాలీలు చేయించం. పది గవర్నమెంటు స్కూళ్లకు తలొక పుస్తకమూ పడేసి, ఆ బడులలోని ఆరువేలమంది పిల్లల్నీ మాఖాతాలో జమవేసుకొని, అన్ని వేల మందితో పనిచేస్తున్నట్లు కాకి లెక్కలు చూపించం. మీరూ మీ గణాంకాలూ ఎక్కడికైనా పోండి, మాకు బరువైనప్పుడు ఈ బళ్లు మూసేస్తాం, అంతే" అని నిశ్శబ్దంగా ఏడ్చుకున్నాం.

"మీకు అవసరముంటే వచ్చి ఏం పరిశోధించుకుంటారో పరిశోధించుకోండి. మీ నివేదికలు మీరు చేసుకొని పోండి. మావల్ల ఎవరికి ఏం ఒరిగిందో మాకు తెలీదు; పరిశోధనలు మేమే నిర్వహించేంత తీరికా మాకు లేదు. పిల్లలతో గడపటం, పిల్లలకు నేర్పిస్తూ, మేం నేర్చుకుంటూ ఉండటం మాకిష్టం. మిగతాది మీ కష్టం" అని నిర్మొహమాటంగా చెప్పాలనుకొనీ, చెప్పక, మాటలు దిగమ్రింగాం.

" ’చిన్న బళ్ల వల్ల ఏం లాభం’ అంటారా, ’వ్యక్తిగతంగా చూపే ప్రేమల వల్ల ఏమొస్తుంది?’ అంటారా?- బాపు రమణల్ని అడగండి, న్యాయపతి రాఘవరావు వాళ్లకేమైనా చేశాడో, లేదో.. అయన వెయ్యిమందికి సాయం చేస్తే, వెయ్యి మందీ సంతోషంగా పెరిగారు. అందరికీ ఏదో ఓ మేలు జరిగింది తప్పకుండా. మేలు మేలే. దాన్ని లెక్కించటానికి వీల్లేదు. కొలిచే సంగతులు కావివి" అనుకున్నాం తప్ప, బయటికి ఏమీ అనలేదు.

"ఈ సంస్థలన్నీ పై పై పూతలు వదిలి, గొప్ప గొప్ప మాటలు వదిలి, నిజంగా నేలమీద పనిచేసి చూడరాదూ, కనీసం ఓ పదిమందికన్నానిజంగా మేలు జరుగుతుంది? బాల కార్మికుల వెంటపడి, వీధి బాలల్ని వేధించి, బడికి పోని వాళ్లనల్లా దోషులుగా నిలబెట్టి, అలాగని ఆ బళ్లు జైళ్లుగా ఉన్నాఏమీ చెయ్యక, సమర్థించుకుంటూ ఎందుకు పోతున్నారు? అరేఁ, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లోనే 600 మంది పిల్లలకుగాను 4 టాయిలెట్లుంటున్నాయే, ఇక ఆ ప్రైవేటు నరకాల్లోకి పిల్లల్ని పంపలేదని ఎవరినైనా తిట్టేదెందుకు, బాధపెట్టేదెందుకు?" అని తిట్టుకుంటూన్నాం, తప్ప ఎవ్వరినీ తిట్టలేదు ఇన్నేళ్లూ.

ఇప్పుడిక ఆగకూడదనిపిస్తోంది- అన్నీ అడుగుతాం, మొహమాటం లేకుండా. అందుకే e ప్రపంచంలోకి వచ్చాం. ముందుగా కొత్తపల్లి పిల్లల e మాసపత్రిక http://kottapalli.in మొదలుపెట్టాం. ఈ కొత్తపల్లి పత్రిక పూర్తిగా పిల్లల ప్రపంచమే. ఇందులో పెద్దల సమస్యలకు (మా సమస్యలకు కూడా) తావులేదు. ఇందులో ఉండేవి పిల్లలకు, పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని, సంతోషపు తరగల్నీ అందిస్తాయి అంతే.

దీని సరసన, పిల్లలకు ఇష్టం అయితే నేర్చుకునేందుకు కావలసిన వైజ్ఞానిక, శిక్షణా వనరులను కూడా చాలా ఉంచబోతున్నాం, కొన్ని కొన్నిగా, అన్నీ ఉచితంగానే.

వీటితోబాటు విద్యా రంగంపై మా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని వ్యక్తం చేసేందుకో చోటును సిద్ధం చేస్తున్నాం.

"అక్షర భారతి" లో భాగస్వాములుగా ఇతరులందరికీ తెలుగు-ఇంగ్లీషు ద్విభాషా వెబ్‍సైట్లను తయారుచేసి ఇచ్చి, వాటిని నిర్వహించి పెడతాం. వెబ్ పేజీలకు కావలసిన తెలుగు content ని తయారు చేస్తాం.

వీటిని ప్రోత్సహిస్తూ సహృదయంతో ఎవరేమిచ్చినా సగౌరవంగా తీసుకుంటాం.

ఇక ఎవ్వరూ అడగకూడదు- చిన్న బడులేం చేయగలవని: కొత్తపల్లిలో మా బడుల టీచర్లున్నారు: రామాంజి, ఆది, కల్యాణి, హనుమంతు, మోహన, నాగరాజు, బషీర్, బయ్యపరెడ్డి... ; మా బడుల్లోనే చదివి, ఎదిగి చేతికందొచ్చిన పిల్ల మాణిక్యాలున్నై- అడవి రాముడు, కుమారి,...; మా బళ్లల్లో ఇంకా నేర్చుకుంటున్న పిల్ల కళాకారులున్నారు నూటయాభై మంది, మా పల్లె చుట్టూ ఇంకా కొంతమంది అద్భుతమైన బాలలున్నారు.. వీళ్లంతా "కొత్త పల్లి"ని తెస్తారు. మీరంతా చేతులు కలుపుతారు- ప్రపంచంలోని తెలుగు పిల్లలంతా నడిపిస్తారు.

చిన్నబళ్లు, చిన్న పిల్లలు చాలా చేయగలరు. జై సీతారాం చెప్పినట్లు, మేం, పిల్లలం, ప్రపంచాన్నే శాసిస్తాం- మాకిష్టమైతే. లేకపోతే ఏమీ చేయం- ఊరికే ప్రశాంతంగా మా దారిన మేముంటాం. మీరూ మాలో ఒకరవ్వండి- మాకు ఈ ధైర్యాన్నిచ్చి, సాహసించి గొంతెత్తేందుకు సాయపడ్డ ఆనంద్, లక్ష్మిల మాదిరి. మీ మీ శక్తుల్తో, శక్తికొలదీ సాయం చేయండి. రండి, కలిసి ఇష్టంగా ఏదైనా చేద్దాం.

Monday, March 24, 2008

కొంచెం తీరిక దొరికితే చాలు

ఉగాది పండగ వచ్చింది- పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు, ఘాటు..రుచులన్నీ తీసుకొచ్చింది. ఇష్టమైనవాటినీ, ఇష్టంలేనివాటినీ మోసుకొచ్చింది. జీవితంలో తీపి, చేదు రెండూ ఉంటాయని గుర్తుచేసేందుకు.. గెలుపు ఉన్నదంటే ఓటమి కూడా ఉంటుందని గుర్తుచేసేందుకు వచ్చింది. అన్నింటినీ సమానంగా స్వీకరించాలని చెప్పేందుకు వచ్చింది మళ్లీ.

ఇంగ్లీషువాళ్లు వంద సంవత్సరాల్ని సెంచురీ కింద మూటగట్టినట్లు, మనవాళ్లు 60 సంవత్సరాల్ని కలిపి మూటలు కట్టారు: ’ప్రభవ’ తో మొదలై, ’అక్షయ’ తో ముగిసే 60 సంవత్సరాల కాలమాన చక్రం మనది. అనంతంగా పరిభ్రమించే ఈ కాలచక్రగమనపు ఒక విడతలో ’సర్వజిత్తు’ పోయింది; ’సర్వధారి’ పేరుగల సంవత్సరం ఈ ఉగాదితో మొదలౌతోంది.

సంవత్సరాలకున్న ఈ పేర్లను ఏమి ఆలోచించి పెట్టారో తెలీదు. కానీ అన్నిటికీ అర్థాలైతే ఉన్నాయి. సర్వజిత్: అందరినీ జయించేది. సర్వధారి: అన్నిటినీ ధరించేది... జీవితమే, అన్ని రుచుల్నీ మోసుకొచ్చేదీ ఇదే, అందరినీ జయించేదీ ఇదే. ప్రభవించేదీ ఇదే, అక్షయమై మళ్లీ మళ్లీ వచ్చేదీ ఇదే. ఎవ్వరికోసమూ ఆగని కాల ప్రవాహం ఇదే.

చూస్తూ చూస్తుండగానే- పుట్టిన పిల్లలు దోగాడతారు, లేచి నిలబడతారు, తప్పటడుగులు వేస్తారు, నేర్చుకుంటారు, మీరౌతారు, ఇంకా పెద్దవుతారు, ముసలివాళ్లౌతారు.. అందరి వెనకా కాలం అనంతంగా ప్రవహించి పోతోంది.

జీవితంలో చాలా ప్రవాహాలున్నాయి, గమనించి చూడాలంతే. ప్రవాహాల్ని చూసినప్పుడు వాటి ఒడ్డున విశ్రాంతిగా కూర్చొని, మర్యాదగా, ప్రశాంతంగా చూడాలట, వాటిని. మహాత్ములు అందరూ ఈ పనే చేశారట, బుద్ధుడు, క్రీస్తు, రమణుడు, క్రిష్ణమూర్తి, గాంధీజీ...

అయితే ఇలా కొంచెంసేపు కూర్చోటానికి కూడా తీరిక ఉండటం లేదు మనకు.

ఈ సర్వధారి సంవత్సరం మనల్ని అందరినీ చల్లగా చూసి, సంతోషంగా, ప్రశాంతంగా ఉండేందుకు మనకంటూ కొంచెం తీరికను తెస్తుందని ఆశిద్దాం.

మళ్లీ వచ్చేసింది వసంతం

మళ్లీ వచ్చేసింది వసంతం.... పట్టణాల్లోకి కాదు- వసంతం పల్లెలకే సొంతం. ఒకసారి చుట్టూ చూడండి. వసంత శోభని చూడాలంటే పల్లెలకి పోండి.

మామిడి పిందెలు, వేపపూత, అలికిన లోగిళ్లు, పొంగే పాలు, చెరకుగడలు, చిలకల కులుకులు, అన్నివైపులా పచ్చదనం, పరీక్షగా చూస్తే ఆ పచ్చదనంలో కనిపించే వందలాది రంగులు, రంగురంగుల పూలు, లేత చిగుర్లు, వాటిని మేసే కోయిలల కువకువలు. ఎడారులు కూడా ఉల్లాసాన్నిచ్చేది ఇప్పుడే. వెళ్లండి. చూడండి, తనివితీరా చూడండి..

ఇంకో సంవత్సరం వరకు రాదీ భాగ్యం.ఆ లోపల కాలం గడిచిపోతుంది.. మీరు పెద్దవాళ్ళైపోతారు. పెద్దవాళ్లైతే చూసే తీరు మారిపోతుంది. అప్పుడు కళ్లకెదురుగా ఉన్న వాస్తవాలు కనబడవు. ఏవేవో ఆలోచనలు, భయాలు, సంతోషాలు, ఆశలతో మెదడంతా నిండి, పోతుంది. వసంతాన్ని చూసేందుకు సరైన సమయం మళ్లీరాదు- ఇప్పుడే చూడాలి.

పట్టణాల్లోకి రానన్న వసంతాన్ని రప్పించేందుకు ఉగాది పండగని తెచ్చారు మనవాళ్లు. వేపపూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి పిందెలు అన్నీ చూసి ఆశపడి వసంతం కొన్నాళ్లు పట్టణాల్లోకీ వెళ్లింది. ఇప్పుడు పోవటం మానేసింది మళ్లీ. నాలుగు రెబ్బల వేపపూతని ఐదు రూపాయలో, పది డాలర్లో ఇచ్చి కొంటున్న ఈ తరాన్ని, అమ్మితేనైనా పొట్టనిండుతుందేమోనన్న ఆశతో చెట్లను, భూముల్ని అమ్ముకుంటున్న పేదమనసుల్నీ చూసి బాధపడి పట్టణాల్ని వదిలేసింది వసంతం.

అందుకే, రండి, రండి. పల్లెలకి రండి వసంతాన్ని వెతుక్కుంటూ. వచ్చి తీసుకెళ్లండి దీన్ని, మీవెంట. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారంటే అది మీ వెన్నంటి రాక పోదు- ప్రయత్నించండి. అలా రానన్నా, కనీసం వసంతాన్ని చూసి, పలకరించిన అదృష్టమైనా దక్కుతుంది. అద్భుతమైన ఆ క్షణాల్ని తలుచుకుంటూ ఏడాదంతా గడపచ్చు- మళ్లీ ఉగాదికోసం నిరీక్షిస్తూ.