Tuesday, May 5, 2009

ఓ ట్రాజెడీ..

రామారావుకు సహనం ఎక్కువ అనుకుంటుంటారు అంతా. కానీ సరళకూ, సరళ తల్లిదండ్రులకూ మాత్రం అసలు సంగతి తెలుసు- రామారావుకున్నంత కోపం, చికాకు, అసహనం ప్రపంచంలో వేరెవరికీ ఉండవంటుంది సరళ. రామారావు పని చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే, పదిసార్లు పిలిస్తే తప్ప పలకడు. అదీ ఏదోలా ముఖం పెట్టుకొని విన్నట్లు వింటాడు. పదిసార్లు అలా పిలిస్తే- (అంటే పదిపదులు వందసార్లన్నమాట!) అప్పుడు ఇక చికాకు పడూతూ కాగితాలు పక్కన పడేసి లేస్తాడు తను. ఆపైన మాట మాట్లాడకుండా చెప్పిన పని చేస్తాడు. సరళకే అనిపించాలన్నమాట- "ఎందుకు కదిల్చాంరా, భగవంతుడా!" అని.

సరళా ఏమంత సరళమైనది కాదు. హెచ్చుతగ్గులు బాగా ఉంటై, ఆమె తత్వంలో. ఒక్కోసారి తాము గొప్పపేరు సంపాదించుకోవాలని ఉంటుంది. ఒక్కోసారి తాము గొప్ప డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది. రామారావుకు ఆ రెండూ లేనందుకు ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటుంది.

రామారావూ ఓ రకం మనిషి. అంటీ ముట్టనట్లే ఉంటాడు; మళ్లీ అన్నీ తనకు నచ్చినట్లే జరగాలంటాడు. సరళకూ అదే ఇష్టం: ఆమె కూడా అన్నీ తనకు నచ్చినట్లే జరగాలనుకుంటుంది. ఇక ఇద్దరి మధ్యా అంతర్యుద్ధాలు చెలరేగేవి. ఈ యుద్ధాల్లో రామారావు నిశ్శబ్దశీలి. సరళ శబ్దశీలి. ఇరుగు పొరుగులందరికీ సరళ గొంతే వినబడుతుండేది. రామారావు మొండితనం, మంకుపట్టూ సరళకు తప్ప వేరెవరికీ వినబడేది కాదు. "పాపం, రామారావు మంచోడు" అనుకునేవాళ్ళు అందరూ.

పిల్లని పెంచటం రాక సరళ సతమతమౌతుంటే, పిలిచేంతవరకు పట్టించుకోడు రామారావు. అతను పట్టించుకోగానే పిల్ల కిలకిలలాడేది. "పిల్లని ఎప్పుడూ ఎందుకు పట్టించుకోడు, ఎందుకు ఎప్పుడూ కాగితాలు ముందేసుకుని కూర్చుంటాడు?" అని సరళ వేధించేది. "మూగమొద్దులాగా కూర్చోకపోతే కొంచెం టైము నాకూ, పిల్లకీ ఇవ్వచ్చుగా" అని సరళ కొంచెం ఉచ్చ స్థాయిలో అంటే తప్ప, రామారావు ఆ కాయితాలను వదిలి లేచేవాడు కాదు.

గొడవలు బాగా ఎక్కువైతే "వదిలిపెట్టి పారిపోతా"ననేది సరళ. "నువ్వు ఒప్పుకోకగానీ, లేకపోతే నేనే ఎప్పుడో పారిపోయి ఉండేవాడిని" అనేవాడు రామారావు. "ఇలా సర్దుకుపోయి బ్రతుకులు ఈడ్వటం కంటే మమ్మల్ని మా ఇంటికి పంపేసి విడాకులు తీసుకోండి " అనేది సరళ. "ఆ పనేదో నువ్వే చెయ్, నాకు పనిలేదూ?" అని గొణిగేవాడు రామారావు.

రామారావు చేసే పని సరళకు అర్ధవంతంగా అనిపించేదికాదు. అతని రాతలూ, చేతలూ అన్నీ ఏదోలా అనిపించేవి. ఎవరైనా ఆమెముందు అతన్ని మెచ్చుకుంటే , "మీకేంతెలుసు" అనుకునేది. "రాత కోతలు తిండిపెడతాయా, బంగళా కార్లు తెస్తాయా? వాటి బదులు ఇంటిపని చేస్తే ఏం" అని పోట్లాడేది సరళ. "వాటివల్లే ఇల్లు గడుస్తోంది- వాటికి అంతమాత్రం అన్నా గౌరవం ఇవ్వకపోతే ఎలా" అనేవాడు రామారావు, మళ్లీ పేపర్లు ముందేసుకుంటూ.

"తననీ పిల్లనీ మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నాడు. మమ్మల్ని అసలు పట్టించుకోడు" అని సరళకు విశ్వాసం ఏర్పడిపోయింది. "ఇక లాభం లేదు- మా వాళ్లింటికి వెళ్ళిపోతాను. నువ్వు మారితే తప్ప తిరిగి రాను" అని సరళ పెట్టే బేడా సర్దుకొన్నది చాలాసార్లు. రామారావు అలాంటప్పుడు ఏమీ మాట్లాడేవాడు కాదు- మూగమొద్దులాగా నిలబడే అతన్ని చూస్తే సరళకు కోపం ఇంకా పెచ్చుమీరేది.

మనం ఏది తలిస్తే దైవం అదే తలుస్తుందట. జీవితాలు తలక్రిందులైనై, ఓ రోజున. రోడ్డు ప్రమాదంలో సరళ, పిల్ల ఇద్దరూ పోయారు. రామారావు ఏడవలేదు.
ఊరికే కూర్చున్నాడు మౌనంగా.
ఆపైన అతను మాట్లాడటం మానేశాడు.
రాయటం మానేశాడు.
నవ్వటం మానేశాడు.
ముభావంగా తనపని తను చేసుకుంటూ ఉండటం మానేశాడు.
ఓ రోజునుండీ కనబడటం మానేశాడు.

"పాపం, రామారావు మంచోడు. భార్యా,పిల్లలంటే ఎంత ప్రేమ!" అనుకున్నారు ఇరుగుపొరుగులు.

"ఇంకా తత్వం మార్చుకోలేదు. ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు" అనుకున్నది సరళ.

1 comment:

Anonymous said...

కథంతా ఇంటింటి రామాయణమే. చివరకు వచ్చేసరికి అయ్యో అనుకునేలోపే :) ఇలా నవ్వొచ్చేసింది సరళ ఆలోచనకి. ఇంత క్లుప్తంగా ఇలా రాయొచ్చని ఇంతకుముందెప్పుడూ అనుకోలేదు. కొంచెం తరచుగా కనిపించండి.