Thursday, September 24, 2009

మురికి వాళ్లకు రెండు

రామారావు, సరళ రైలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. రైల్వేస్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నది. రైలు వచ్చి ఆగగానే, ఉన్న రెండు జెనరల్ బోగీల్లోకి దూరేందుకూ జనాలు పోటీపడి కొట్టుకోవటం మొదలెట్టారు.

రామారావు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది- S1లో. S1బోగీ జెనరల్ బోగీని ఆనుకొనే ఉన్నది. అయితే దేవుని దయవల్ల, దాన్నీ, దీన్నీ వేరుచేస్తూ మధ్యలో గోడలున్నై. ఆ గోడలు లేకపోతే వీళ్లూ, వాళ్లూ కలిసిపోవాల్సి వచ్చేది. వందలాదిమంది జనాలు అలాగే గనక దాడి చేస్తే S1 ఇక S1గా ఉండేది కాదు. అదీ జెనరల్ బోగీ అయిపోయేది- ఆపైన S2కూడా...

"చూడండి, అలగా జనం ఎలా కొట్టుకుంటున్నారో?" అంది సరళ. "పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలదాకా పోదంటారు-అందుకే. వాళ్లని మనతోటి మర్యాదస్తులతో పోల్చి చూడండి. మనం క్యూలో నిలబడి వరసగా ఎక్కమూ? వీళ్లూ అసలు మనుషులేనా అనిపిస్తుంది. లేకపోతే ఈ నెట్టుకోవటం ఏంటీ, క్రింద-పైన పడటాలేంటి? చినిగిపోయి, కంపుగొట్టే ఆ చొక్కాలేంటి, కిటికీల్లోంచి లోపలికి పిల్లల్ని దూకించటం ఏంటి? ఇది రైలు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారసలు?"

అంతలో వాళ్లలోంచి ఓ తరంగం లేచి వచ్చి, అప్పుడే రైలెక్కబోతున్న సరళ చేతిని తాకింది! ఓ పిల్లాడు బాణంలా దూసుకొచ్చి ఆమెచేతివేళ్ళకు తగిలాడు.

"కళ్లు కనబడటం లేదూ? ఛీ, ఫో " విదిలించిందామె. చేతి వేళ్ళు ఆ పిల్లాడి జుట్టుకు తగిలాయి- మడ్డి మడ్డిగా, బంక బంకగా ఉన్నది జుట్టు. "తల స్నానం చేసి సంవత్సరం దాటి ఉండాలి. ఛీ, పాడు మనుషులు. స్వచ్ఛత ఎరుగని ముఖాలు. శుచి, శుభ్రత లేనే లేవు" ఆలోచనల్లో ఉండగానే రామారావు S1లోకెక్కి సరళకు చేయందించాడు. ఇద్దరూ తమ సీట్లలో కూలబడ్డారు.

సరళ చేతివేళ్ళు ఇంకా జిడ్డు జిడ్డుగా, అసహ్యంగా తోస్తున్నాయి. ఆ చేతిని ఒక ప్రక్కకు పెట్టుకొని కూర్చుందిగానీ, ముళ్ళమీద ఉన్నట్లే ఉంది. 'సబ్బెక్కడుందో, ఏమో? బయల్దేరే హడావిడిలో సబ్బు ఎక్కడ పెట్టింది, తను?'

"ఈ సీటు మాదండి" ఒకాయన వచ్చి నిలబడ్డాడు సరళకెదురుగా. "ఎంతండీ? మావి పంతొమ్మిదీ, ఇరవై. మీదెన్నో నెంబరు?" అన్నాడు రామారావు సమరసంగా. "ఇరవై నాది. లేవండి" అన్నాడా పెద్దమనిషి, కొంచెం పదునుగా. "ఎలా అవుతుందండీ? మావి రెండు సీట్లుంటేనూ?" అన్నాడు రామారావు తార్కికంగా, తన జేబులోంచి టికెట్ తీస్తూ. "నాకు తెలీదు- నాది ఇరవై. అంతే" అని ఆయన వచ్చి సరళను ప్రక్కకు నెట్టి కూర్చున్నాడు. సరళ కుంచించుకు పోయింది.

"మీ టిక్కెట్టు చూపించండి. ఈ సీటు మీదో, మాదో చూస్తాను." అన్నాడు రామారావు.

"మీకెందుకు చూపాలి? మీరేమన్నా రైల్వే అధికారులా? నేను చూపించక్కర్లేదు" అన్నాడు పెద్దాయన.

గొడవ మొదలైంది. చిలికి చిలికి గాలివానైంది. చివరికది తుఫానయ్యాకగానీ టీటీసి గారు ప్రత్యక్షం కాలేదు. వచ్చి చూసేసరికి, పెద్దమనిషి ఎక్కాల్సిన రైలు ఆ రోజుది కాదు; అంతకు ముందు రోజుది! పెద్దాయన తనను తాను తిట్టుకోలేక, రైల్వేవాళ్లను తిడుతూ, బోగీ దిగిపోయాడు. అంతలో రైలు కదిలింది.

"అందరూ చూడటానికి మనుషులేనండీ, కానీ గుణాలెలాఉంటాయో చూడండి" అన్నాడు సరళకెదురుగా కూర్చున్న కళ్లజోడు కుర్రాడు- చూపులు తలుపువైపు తిప్పుకుని. తలుపుదగ్గర నిలబడి ఉన్నాడొక మురికి పిల్లవాడు-జిడ్డు తలవాడు- బయటికి చూస్తూ. రైలు బయలుదేరగానే, జెనరల్ బోగీలో చోటు అందక, ఇక్కడ ఎక్కినట్లున్నాడు. నల్లగా, గ్రీజు మరకలతో మురికితేలుతున్న చొక్కా. ఆ చొక్కాలో వాడిలాంటి కుర్రవాళ్ళు ఇద్దరు దూరచ్చు.

సరళ కూడా వెనక్కి తిరిగి చూసింది తలుపువైపు. ఆ మురికివాడు- 'అంతకు ముందు తనను తాకింది వాడేనా?- మరి వాడిప్పుడు నావైపే ఎందుకు చూస్తున్నాడు?' గబుక్కున తల వెనక్కి తిప్పుకున్నది. ఎదురుగా కూర్చున్న కళ్ళజోడు కుర్రవాడు నవ్వి, అన్నాడు- " వీళ్లింతేనండీ, టిక్కెట్లుండవు. మాచెడ్డ రోగులండీ, మన దేశానికి పట్టిన చీడ పురుగులు. వికారపు బుద్ధులు. టిక్కెట్లుంటే మాత్రం ఏంటండీ, జెనరల్ వాళ్లు స్లీపర్లోకి ఎక్కకూడదండీ, చట్టప్రకారం. అయినా ఎక్కుతారంతే. ఈ టీటీసీలూ వాళ్లను చూసీ చూడనట్లు పోతుంటారు. నాకేమో వాళ్ళను చూస్తే వాంతికొచ్చినట్లౌతుంటుంది. మన దేశంలో ఎయిడ్సు పెరగటానికి కారణం వీళ్లేనండీ, మళ్ళీ మాట్లాడితే దేశంలో ఎనభై శాతం మేమేనంటారు."

అందరూ అంగీకరిస్తున్నట్లు తలలూపారు. సరళ అభినందిస్తున్నట్లు చూసింది కళ్లజోడతన్ని. ఆపైన వాళ్ళంతా భారతదేశాన్ని అభివృద్ధిచేయటం గురించి మాట్లాడుకున్నారు, అలసి నిద్ర వచ్చేంతవరకూ.

రాత్రై అందరూ పడుకున్నారు గానీ సరళకు నిద్ర రాలేదు.. తలుపు దగ్గర ఆ మురికి పిల్లవాడుఇంకా కూర్చునే ఉన్నాడు- తనవైపే చూస్తూ. "వీడు ఇక్కడే ఉన్నాడు ఇంకా. ఎవరిని ఏంచేస్తాడో? సామాన్లు ఏమైనా ఎత్తుకుపోడు గద! తన గొంతుకోస్తాడేమో, రాత్రి ?!"

అనుకున్నట్లే జరిగింది. ఏదో పేరులేని స్టేషన్లో రైలు ఆగి ఉన్నది. సరళకు అప్పుడే కునుకు పడుతున్నది. అంతలో ఒక చెయ్యి ముందుకొచ్చి, మొరటుగా ఆమె మెడలోని గొలుసును లాక్కున్నది. ఒక్కక్షణకాలం పాటు సరళకు నోట మాట పెగలలేదు. ఆ సరికి దొంగ ఆమె నగను లాక్కొని, బయటికి పరుగెత్తాడు. "దొంగ! దొంగ! పట్టుకోండి! నా గొలుసు!" అని సరళ అరిచేసరికి అందరూ మేలుకొని లైట్లు వేశారు.

ఆ సరికి బయట ప్లాట్ ఫారంపైన చీకట్లో దొమ్మీ జరుగుతున్నది. మురికి పిల్లవాడూ, కళ్ళజోడు కుర్రాడూ ఒకళ్లమీద ఒకళ్ళు పడి కొట్టుకుంటున్నారు. సరళ బ్యాగులు రెండూ వాళ్ల ప్రక్కన పడి ఉన్నై.

"పట్టుకోండి, దొంగ వెధవని. నా నగల్నీ, సామాన్లనీ ఎత్తుకుపోతున్నాడు"- అని కేకలు పెడుతూ సరళ బయట పెనుగులాడుతున్న మురికి పిల్లాడిమీదికి దూకింది, రుద్రమదేవిలా.

ఆ తర్వాతేమైందో ఆమెకు తెలీలేదు: కళ్లజోడు కుర్రవాడి పిడికిలి సూటిగా వచ్చి సరళ ముక్కుకు తాకింది. రామారావు పరుగెత్తుకొస్తున్నాడింకా. సరళకు తలతిరిగింది. కళ్ళు బైర్లు కమ్మాయి.

కళ్ళు తెరిచేసరికి తనూ, రామారావూ రైల్లో ఉన్నారు. రైలు ముందుకు పోతున్నది. ముక్కుకు పట్టీతో, తన తల రామారావు వొళ్ళో ఉన్నది. "ఏమండీ, నేను ముందునుండీ చెప్తూనే ఉన్నాను గదండీ; ఆ అలగావాడు మన బోగీలోకి ఎక్కినప్పుడే నాకు వాడి ఉద్దేశం అర్థమైంది. వాళ్ళ జాతి ఇంతేనండీ. నా నగలూ, మన సామాన్లూ అన్నీ ఎత్తుకుపోయాడు చూశారా? నాగతి ఇలాగైంది. మీకేమీ కాలేదుగద!" అని మూలిగింది సరళ.

"ఏమీ కాలేదు సరళా! మన సామానంతా మనకు దొరికింది. వాడెవడోగానీ, దేవుడిలా అడ్డం వచ్చాడు. లేకపోతే ఆ దొంగ వెధవ పూర్తిగా ఉడాయించేవాడే. ఆ తరువాత నేను వందరూపాయలిస్తే, "వద్దండీ" అని, తీసుకోకుండానే వాడు పోయి జెనరల్ బోగీ ఎక్కాడు" అని రామారావు చెబుతుంటే, ఎవరిగురించో అర్థం కాని సరళ బిక్కముగం వేసింది.

"చూడటానికి కళ్ళజోడు పెట్టుకొని టింగురంగామంటూ ఎంత బాగున్నాడో చూడు, ఈ దొంగ వెధవ! వాడి వేషం చూసి మనలాంటివాడే అనుకున్నాంగదా, మనం అందరం? వాడిట్లా దొంగతనాలు చేస్తుంటాడని మనకేం తెల్సు? ఆ మురికి పిల్లాడిలో ఉన్నంత మర్యాద వీడిలో లేకపోయింది చూడు!" అన్నాడు రామారావు సరళ తల నిమురుతూ.

రైలు పోతూనే ఉంది ఇంకా- మురికి వాళ్ళనీ, మర్యాదస్తుల్నీ మోసుకొని.

మురికివాళ్లకోసం రెండు బోగీలు. మర్యాదస్తులకోసం పదహారు.

1 comment:

Sudha Rani Pantula said...

చాలా బావుందండీ మీ ఈ పోస్టు.
మనుషులను పైపై హంగులను చూసి ఎలాంటి అంచనాలకు వస్తామో, ఎలా మోసపోతామో సోదాహరణంగా చూపారు. నా స్వీయ అనుభవంలో కూడా మాతో పాటు ప్రయాణం చేసిన ఓ పెద్దమనిషే కథలో లాగే మా పక్కసీటులోని మహిళ మెడలోంచి నగలు లాక్కొని కేకలేసేలోపల ఉడాయించాడు. తోటి ప్రయాణీకుడనే అనుకున్నాం..ఆ దర్పం చూసి. మురికిగా కనిపించే వాళ్ళలో కూడా రత్నాలుంటారన్నది మినహాయింపేననుకోండి...కనీసం వాళ్ళ పరిస్థితిని కొంత అర్థంచేసుకోవచ్చు...చిన్నపిల్లలు నేరస్థులుగా మారడంలో. కానీ పెద్దమనుషులరూపంలో తిరిగే వారిని మాత్రం క్షమించలేం. మంచి పోస్టు.అభినందనలు.