Friday, May 8, 2009

తెలుగమ్మకు కొత్త కర్పూరం!

రామారావు ఈరోజెందుకో అన్యమనస్కంగా ఉన్నాడు. తెలుగు తల్లికి పదనీరాజనాలు అర్పించాలని అతనికి చాలా కోరిక. పాత కర్పూరాలకంటే కొత్త కర్పూరాలే మంచివని ఎవరో చెప్తే, తెలుగమ్మకోసం కొత్త పదకర్పూరాల్నే వెలిగించాలని పట్టుబట్టి కూర్చున్నాడు అతను ఎంతో కాలంగా. కానీ ఎంత కాలం గడిచినా ఆ కర్పూరాలు అంటుకోవట్లేదు. నిల్వలు పేరుకు పోతున్నై; కానీ ఎందుకో సరుకు అమ్ముడవటం లేదు.

జనాలందరూ పాత కర్పూరాల్నే కొనుక్కు పోతున్నారు. ఏమని అడిగితే- "అవి బాగానే వెలుగుతున్నై కదా?" అంటున్నారు. "అలా కాదోయ్, పాత కర్పూరాల్ని ఉన్నవి ఉన్నట్లు వాడుకోకూడదు, వాటికి నూత్న సొబగుల్ని కూర్చి, నవీన గుబాళింపులు అద్ది హారతులిద్దాం, 'మన తల్లేమీ వెనకబడలేద'ని ప్రపంచానికి చాటుదాం" అని రామారావు ఎంత ప్రేరేపించినా, జనాలు వినటంలేదు. పాత వాసనల్నే పట్టుకు వేళ్లాడుతున్నారు.

'చాలాసార్లూ అనీ అనీ బోరుకొట్టి, తను ఎక్కడో 'పల్సార్లు ' అని రాస్తే, ప్రొద్దున వాడెవడో "ఏమయ్యా, బజాజ్ కంపెనీ వాడి రెండు చక్రాల బండి లాగా?" అన్నాడు- అదీ, ప్రస్తుత విషాదయోగానికి 'తూపుదూబ ' (అర్ధం కాదులెండి.. తూపుదూబనే ఆంగ్లంలో ట్రిగ్గర్ అంటారు అని రామారావు గార్నడిగితే తెలుస్తుంది..). నొచ్చుకున్న రామారావు ముఖం మాడ్చుకొని "అట్లనవలదార్యా" అని పురాణఫక్కీలో మర్యాదగా మొదలుపెడితే, "ఏమండీ, మేం మామూలు మనుషులం. మీరు మమ్మల్ని త్రేతాయుగంలోకి తీసుకుపోతామన్నా , మేం రాం" అన్నాడు వాడు. "పాతవి ప్రశంసిస్తే- అర్థం కావట్లేదంటారు, నవీనతను ప్రతిఫలింపజేస్తే- ప్రయోగాలొద్దంటారు- మరెలాగ, భాషాప్రవృద్ధి?"‌ (భాషాభివృద్ధి అనటం పాతదైయాక రామారావు అట్లా అనటం మొదలుపెట్టాడు) అని రామారావుకు బెంగ పట్టుకున్నది.

అంతలో ఆనందమూర్తి వచ్చాడు. పదప్రయోగాల్లో ఆనందమూర్తి రామారావుకు దీటురాయి. ఆయన పదసమ్మేళనం చేస్తే, ఈయన పద సంఘటనం; ఆయన నవీన పద విసృంభణం చేస్తే, ఈయన పురాణపదఖండనం చేస్తుంటాడు. "ఒరేయ్, రామం, ఈ మధ్య అంతర్జాలంలో తెలుగు భాషామాతకు సువాసన కర్పూరం తప్ప మామూలు ధూపం వేయట్లేదటరా! మనం అంతర్జాల పరిభాషలో పాటవం సంపాదించి, మన ప్రకర్షని నిష్కర్షగా ప్రకటించే రజత తరుణం ఆసన్నమైంది" అన్నాడు ఆనందం, వస్తూనే.

"అంతర్జాలం ఏమిటీ, మార్జాలం లాగా?" అని విస్తుపోయాడు రామారావు.

బదులుగా "ఆ!!" అని నిర్ఘాంతపోయాడు ఆనందం. "ఆమాత్రం తెలీదా? సామాన్యులు దాన్ని బ్రిటిష్ లో ఇంటర్నెట్ అంటున్నారు. మనం మన సుసంపన్న తెలుగులో దాన్ని 'అంతర్జాలం' అనాలి " వివరణాత్మకంగా వదించాడు ఆనందం. ఇప్పటికే చిన్నబోయిన రామారావు ముఖం ఈ దెబ్బకు ఇంకా సంకోచించింది.

ఎందుకో ఆనందం ముందు రామారావు ఎప్పుడూ తెలవెలబోతుంటాడు ఇలాగే.

"అలా కాదోయ్ ఆనందం, ఇంటర్నెట్ను 'అంతర్జాలం' అని పిలిస్తే అందరికీ అర్థం కావొద్దూ? ఎంచక్కా "ఈవల" అనొచ్చుగా? అన్నాడు రామారావు తన ప్రయోగానికి తనే ఉబ్బిపోతూ.

"ఈవల అంటే సామాన్యులకు సగం అవ్వదు. వాళ్లు దాన్ని 'ఇక్కడ ' అనుకునే సందర్భం ఉంటుంది. దాని నివారీకరణకోసం అంతర్జాలం అనటమే ప్రశస్తం" అన్నాడు ఆనందం, కొంచెం తగ్గి.

"కాదోయ్, మన వలలో ఎలాగూ ఒకముడికీ మరో ముడికీ గట్టి దారపు సంబంధం ఉండనే ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పక్కర్లేదు. ఏదో ఒక ప్రత్యయం కూర్చాలి గనక, ('e')'ఈ ' అంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునేవాళ్ళు దేన్నైనా నేర్చుకోవాల్సిందే. ఏ పదాల్నైనా కొంచెం బలవంతంగా వాడింపజేస్తే అవి వాడుకలోకి వచ్చేస్తాయి గద!" అన్నాడు రామారావు వివరిస్తున్నట్లు.

ఆహా, ఇంకా రకరకాలుగా అనొచ్చు. ఎలాగూ కొత్తపదమే గనక దాన్ని 'పరస్పర సంబంధ వల ' అనొచ్చు. ఏమైనా అనొచ్చు, విని, వాడేవాళ్లుంటే సరి. అయినా, ఏమోనోయ్, రామం.. మనలో మనకే సయోధ్య కుదరకపోతే బయట మనపని అయోధ్య అయిపోదూ? కొంచెం ఏకాభిప్రాయ సాధనీకరణ చర్చ చేయాలి మనం" అన్నాడు ఆనందం, కూర్చోబోతూ.

"ఏమండీ, లేస్తారా, లేదా? 'పిల్లకి తెలుగు రావట్లేదు, టీచర్లు సున్నాలు వేయలేక నెగటివ్ మార్కులిస్తున్నారు ' అని మొత్తుకుంటున్నా వినకుండా ముచ్చట్లలో మునిగితేలుతున్నారా? లేస్తారా, లేకపోతే బాపుగారి బామ్మ మాదిరి చపాతీ రుద్దేది-..అదేంటో..- అది చేత పట్టుకురమ్మంటారా?" అరిచింది సరళ లోపల్నుండి.

"కోల!!" అని అరిచారిద్దరూ, ఆనందం లేచి బయటికి పరుగెత్తే లోపు.

"జనాలకి ఈ మాట సులభంగా గుర్తుకు రావట్లేదు..కొత్త పదం ఒకదాన్ని సృష్టించాలి.." అని ఆలోచించటం మొదలెట్టాడు రామారావు.