Friday, February 21, 2014

ఉరి-యావజ్జీవం

మౌనం ఊరికే గర్జిస్తోంది. రెండ్రోజుల్లో అంతా అయిపోతుందని తెల్సినకొద్దీ యీ గర్జనలు ఎక్కువౌతున్నాయి. మెదడుని తొలిచేసే మౌన సాగరంలో ఇప్పుడు చెలరేగుతున్న అలల్ని ఆపటం ఇక సాధ్యం కావటం లేదు.  పగలు-రాత్రి అనేది లేక గబగబా వచ్చి వాలి మీదపడి దహించే మౌనకెరటాలు...  యీ మౌనపు కెరటాలనే కొందరు పిచ్చోళ్ళు 'ఆలోచనలు' అంటారు కాబోలు.  నిజంగా పిచ్చోళ్ళే.
మౌనం‌ యీ విశ్వమంతటికీ ఆధారంగా పరచుకొని ఉంది.  అంతటా ఉన్నది అసలు యీ మౌనమే.  ఒక్కోసారి యీ మౌనంలో కదలికలు ఏర్పడతాయి. కెరటాలు రేగుతాయి.  మౌనపు ప్రవాహాలొస్తాయి.  వాటిని ఏమనాలో తెలీదు ఎవ్వరికీ అసలు. జనాలు వాటినే ఆలోచనలు అనుకుంటారు. అవి సహజం అనుకుంటారు. అవి లేకుండా తాము లేమని భ్రమపడుతుంటారు.  ఎంత వెర్రి! 'ఆలోచించేవాడే మనిషి'ట! కాదు. అసలైతే ఆలోచించనివాడే మనిషి.
అనంతంగా పరచుకొన్ని యీ మౌనవిశ్వంలో కనీసపు కదలికలు కూడా లేకపోతే... ?! అదే నిజంగా మనిషి అసలు తత్వం!
ఇది కనుక్కోలేని పిచ్చోళ్ళు ఊరికే రేగే యీ కెరటాలతో ముందు మమేకం ఐపోయి, తర్వాత ఓ రకంగా వాటికి అలవాటు పడిపోయి, ఆనక వాటికే బానిసలైపోయి, ఊగిసలాడుతూ 'మనిషంటే ఇలాగే ఉంటాడు' అనుకుంటారు.
రెండ్రోజుల్లో అంతా ఐపోతుందని తెలిస్తే వీళ్ళెవరూ ఇట్లా ఉండలేరు.  ఆర్నెల్లపాటు మరో జీవితో దేంతోటీ‌ మాటలు లేకుండా ఉంటే తప్ప, ఆ రెన్నాళ్ళూ వాళ్ళకి నేను చెప్పే యీ మౌనకెరటాల అనుభూతి కలిగే అవకాశం లేదు... కెరటాలు కనబడాలంటే ముందు పూర్తి నిశ్శబ్దం అనుభూతిలోకి రావాలి-
ఆర్నెల్లుగా నేను అనుభవించినంత నిశ్శబ్దం...
ఉరి అంటే ఏదో‌ 'శిక్ష' అనుకుంటారు. ఎవరికీ తెలీని విషయాల్లో అదీ ఒకటి.  అకస్మాత్తుగా వచ్చి మీద పడి ఉరివేస్తే అది బహుశ: శిక్ష అవ్వచ్చేమోగాని, ఇలా ఆర్నెల్లో, సంవత్సరమో అస్సలు ఎవరితోటీ‌ కలవకుండా విడిగా ఉంచి, తర్వాత 'ఇంకా రెండ్రోజులు' అని చెప్తారు చూడు, అది అసలు శిక్షే కాదు.  అది ఆనంద మార్గం.  ఆ ఆర్నెల్లో, సంవత్సరమో శాంత గంభీర నిశ్చల మౌన సముద్రపుటంచులు- ఆపైన ఒకటి రెండ్రోజుల నిశ్శబ్దపుటలలు- అవి కూడా ద్వంద్వమయ జగత్తులో ద్వంద్వానికి అసలు కారణం ఏంటో‌ తెలియజేసి మనిషి మనసును నిర్వికల్పంగా చేసే మహాద్భుత సాధనాలు! వాటిని దర్శించటం, వాటి అంతాన్ని అనుభవించటం- అది శిక్ష ఎందుకవుతుంది అసలు?!
నిజం శిక్ష ఏదంటే- ఉరిలో పెట్టే ఆశ.  మీకు అర్థం అయి ఉండదు- వివరిస్తాను.  'నిన్ను ఉరి తీస్తే తీస్తాం, లేకపోతే తియ్యం. ఏసంగతీ ఇప్పుడు చెప్పం. నిన్ను బహుశ: అసలు ఉరి తియ్యనే తియ్యమేమో... ప్రాణ భిక్ష పెడతామేమో... నీ ఉరిని 'యావజ్జీవం' చేస్తామేమో... లేకపోతే చెయ్యమేమో... మీవాళ్ళతో సరైన చోట్ల చెప్పించు... మీకు తెలిసిన రాజకీయం‌ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెతుక్కో...సెల్‌ఫోను కావాలా..?' అంటారు చూడు- అదీ అసలు ఉరి కంటే ఘోరమైన శిక్ష.
ఆ శిక్ష పడ్డవాళ్ళు మౌనసంద్రాన్ని అసలు దర్శించనే లేరు. సెల్ ఫోను ఉన్నాక మౌనం ఎక్కడ?! వాళ్లకసలు మౌనం అంటే ఏమిటో అర్థం అయ్యే అవకాశమే లేదు.  ఎప్పుడూ మామూలు మనుషుల్లాగా గందరగోళపడుతూ, ఏదో‌ ఒక పనిలో మునిగిపోయి అర్థరహితంగా జీవిస్తూ, 'ఒరే, ఇలా చెయ్యి, అలా చెయ్యి' అని చెప్పుకుంటూ, ప్రతిక్షణం ఏదో‌ దురాశలో- 'బ్రతికితే చాలు-' అని ప్రాణాలకోసం ఎవరెవరినో అడుక్కుంటూ, నిజానికి నిర్వ్యీర్యం అయిపోతూ, బయటికి మాత్రం ఉత్సాహపు ముసుగులు వేసుకొని పరోక్షపు నరకాన్ని అనుభవిస్తారు.
చివరికి అట్లాంటి వాళ్ళని ఉరి తియ్యకుండా వదలటం అంటే తన వేలితో‌తన కన్నును పొడుచుకోవటమే... ఎందుకంటారా, చూడండి-  అంత అవకాశం‌ ఉండి కూడా ఆ నిశ్చల నీరవాన్ని, మహా అనంత నిశీధిని, జగత్తుని నిండా తనలో ముంచి నిలుపుకొని, బరువుగా అణచిపెట్టిన్ ఆ పరమఘోర మౌనసాగరాన్ని ఏ కొంచెమూ అనుభూతి చెందని ప్రాణి, అసలది ఏమి ప్రాణి? అది బ్రతికీ ఏం ప్రయోజనం?
ఇక రెండో‌పార్శ్వం కూడా చూడండి: తను చేసిన పనులకు ఏమాత్రం చింతనొందకుండా, సమయాన్నంతా తప్పించుకోవటం కోసం వ్యూహాలు పన్నుతూ విలాసంగా గడిపిన ఆ జీవి బాహ్యప్రపంచంలోకి అడుగు పెట్టగానే తన అమానవీయ కార్యకలాపాలను నిస్సిగ్గుగా, మరింత సత్తువతో, తిరిగి ప్రారంభించే అవకాశమే ఎక్కువ.  తనకు 'శిక్ష' విధించిన ఈ తిక్క ప్రపంచాన్నీ; తిరిగి ఆ శిక్షను తను అమలు చెయ్యనివ్వకపోవటంతో ఉక్కిరిబిక్కిరై, తనని వదిలిపెట్టి పారిపోయిన పిరికి వ్యవస్థనీ; తన వ్రేళ్ల చివరన ఆటలాడుతూ, తను ఎలా చెబితే అలా చేసే మూర్ఖపు పనికిమాలిన జనాల్ని చూసి వికవికా నవ్వుకుంటూ తనేం చెయ్యాలో దాన్ని మళ్ళీ పరమ ఉత్సాహంతో చేయదా, ఆ జీవి!?
అందుకనే అన్నది..

ఇదిగో, వస్తున్నారు... 'రండి రండి! ఎప్పుడు, ఇప్పటివరకూ ఇంకా రేపేనా?! సరే సరే. నేనైతే సిద్ధం.  ఇప్పుడైనా సిద్ధమే. ఏంటి, మీరు 'రికమెండ్' చేస్తారా?  యావజ్జీవం చేయమని విన్నపం మీద మళ్ళీ ఓసారి సంతకం చేయాలా? దానిదేముంది, సంతకాలు తీసుకోండి, ఎన్ని కావాలంటే అన్ని.  ఇన్ని తీసుకున్నవాళ్ళు ఆ కొంచెం తీసుకుంటే మాత్రం ఏముంది?  ఇన్ని ఇచ్చినవాడిని ఆ కొన్నీ ఇస్తే మాత్రం ఏముంది?  నావరకూ నాకు తేడా ఏమీ‌లేదు.  మీరు నన్ను వదిలేసినా ఒకటే; ఉంచుకున్నా ఒకటే; ఉరి తీసినా ఒకటే.  మీగురించి మీరు ఆలోచించుకోండి...  మీ భద్రత, మీ శ్రేయస్సు, మీ భవిష్యత్తు.

అసలు నా సలహా ఏమంటే, మీకు వీలైతే అందరికీ 'ఉరిశిక్ష' వేసుకోండి.  వీలును బట్టి, చివరి నిముషంలో రద్దు చేసుకుందురు.  అయితే ఆ మధ్యలో, ఓ‌ఆర్నెల్ల కాలమో- సంవత్సరమో ఎవ్వరినీ‌ మీతో‌ మాట్లాడనివ్వకండి. మహామౌన సముద్రం వచ్చి మిమ్మల్ని ముంచెత్తనిచ్చుకోండి.  ఆశలన్నీ‌కొట్టుకుపోయిన ఆ అద్భుత క్షణాల్ని మీరంతా కూడా ఓసారి అనుభూతి చెందండి. బాగుంటుంది. నిజం...

ఆ తర్వాత కావాలంటే మీరు ఉరిశిక్షను ఎప్పుడు 'యావజ్జీవం' చేయాలో మాట్లాడుకోవచ్చు.


Wednesday, November 9, 2011

సంతోషం-దుఖం

దుఖమూ, సంతోషమూ మాట్లాడుకుంటూ కూర్చున్నై, నది ఒడ్డున.

నదిలో నీళ్లు పారుతుంటే రెండూ ఆ నీళ్లలో కాళ్ళు అల్లాడిస్తూ కూర్చున్నై.

కొన్ని నీటి కణాలు సంతోషపు పాదాలకు తగిలి నిండా సంతోషం‌ అయిపోయాయి.

మరికొన్ని నీటి కణాలు దు:ఖపు పాదాలకు తగిలి నిండా దు:ఖం అయిపోయాయి.

చాలా కణాలు, వీటి కాళ్ళకు తగలనివి, నిస్తేజంగా ప్రవహించినై.

అందుకనే, ప్రవాహంలోకి దిగి స్నానమాడే వాళ్ళు చాలామంది నిస్తేజంగా ఉండిపోతున్నారు.

దృష్టి కోణాలు

ఒక యీగ, తేనెటీగ కలుసుకున్నాయి పూలతోటలో.

"ఏమవ్వా, కులాసానా?" అడిగింది తేనెటీగ.

"ముసలిదాన్ని. నా కులాసాకు ఏమొచ్చింది గాని, మీరు పిల్లలు కులాసాగా ఉంటే అంతే చాలు" అన్నది ఈగ.

"ఈ పూలతోట ఎంత అందంగా ఉంటుందో, కద అవ్వా!?" అనంది తేనెటీగ.

"ఏమి అందంలే, ఎంత ఉన్నా పూలే కద!" అన్నది ఈగ.

"ఒక్కొక్క పువ్వులోంచీ యీ వసంతంలో వచ్చే సువాసన ఎంత మత్తెక్కిస్తుందో!" అన్నది తేనెటీగ, ఓ పువ్వు చుట్టూ తిరుగుతూ.

ఈగ ఏమీ మాట్లాడకుండా ఎగిరెళ్ళి అక్కడ పడి ఉన్న పేడకుప్ప మీద వాలింది- ఆశగా, తినేందుకు ఏమన్నా దొరుకుతుందేమోనని చూస్తూ.

Tuesday, October 11, 2011

పులివేంద్రాలు!

చాలా సంవత్సరాల క్రితం ఒక రాజుగారు ఉండేవారట.

ఆ రాజుగారికి పులులంటే చాలా ఇష్టమట.

చిన్న చిన్న పులి పిల్లలంటే మరీ ఇష్టమట. వేటకోసం అడవికి వెళ్ళినప్పుడల్లా ఒక బుజ్జి పులి పిల్లను ఇంటికి తెస్తూ ఉండేవాడట.

అట్లా ఆయన ఆస్థానంలో వందలాది పులులు తయారయ్యాయి.

'పులుల్ని ఊరికే బోనుల్లో‌బందీ చేసి ఉంచితే ఎలాగ?' అని వాటికోసమే ప్రత్యేకంగా ఒక అడవిని కేటాయిద్దామనుకున్నాడాయన.

అయితే వాళ్ల రాజ్యంలో ఏ అడవిని చూసినా అందులో ఏదో ఒక జాతి ప్రజలు నివస్తిస్తూనే ఉన్నారు. మరెలాగ? వాళ్ళు ఉండే అడవిని ఖాళీ చేసి పులులకు ఇచ్చెయ్యమంటే ఆ ప్రజలకు కష్టం కదా? అందుకని రాజుగారు ఒక సమావేశం ఏర్పాటు చేసి మంత్రుల్ని సలహా అడిగారు.

"దానిదేముంది ప్రభూ! క్రొత్తగా ఒక అడవిని తయారు చేస్తే సరి!" అన్నాడొక మంత్రి.

రాజుగారికి ఆ సలహా నచ్చింది. అడవిని పెంచితే పర్యావరణానికీ మేలు; గాలి కూడా బాగుపడుతుంది; పులులూ‌సంతోషంగా ఉంటాయి!
"సరే! అలాగే చేద్దాం! వీలైనంత త్వరగా అడవిని తయారు చేసెయ్యండి!" అన్నారు రాజుగారు.

అయితే అదికూడా సమస్యే అయ్యింది. "రాజ్యంలో అడవులు కాక మిగిలిన భూమి అంతా వ్యవసాయంలో ఉంది. వ్యవసాయం చేసేది ప్రజలే కదా! వాళ్లు ఆ భూముల్నే నమ్ముకొని బ్రతుకుతున్నారు. వాళ్ల భూముల్ని అడవిగా మార్చేస్తే ఇక వాళ్ళకెలాగ?"

అందుకని మంత్రులంతా అనుకున్నారు- "రాజ్యంలో ఎవ్వరూ సాగుచేయని భూమిని వెతుకుదాం. అందులో పులులకోసం అడవిని పెంచుదాం" అని.
అందరూ కలిసి వందలాది ఎకరాలున్న బంజరు భూమిని ఒకదాన్ని ఎంపిక చేశారు. అక్కడ చెట్లు నాటేందుకు గుంతలు త్రవ్వమన్నారు. త్రవ్వటం మొదలు పెట్టేసరికి, ఏమున్నది?! అక్కడ ఒకచోట బొగ్గు! ఒకచోట ఇనుము! ఒక్కోచోట బంగారం! వజ్రాలు! రాగి!- ఇంకా ఏవేవో విలువైన లోహాలు! వెంటనే మంత్రులు గనుల శాఖకు ఇచ్చేశారు, ఆ భూమిని.

కథ మళ్ళీ మొదటికి వచ్చింది. పులులకు భూమి కావాలి.

అప్పుడు రాజుగారికి గుర్తు వచ్చింది. "తన కోటలో చాలా స్థలం ఉంది కదా! వేల వేల ఎకరాల స్థలం అది. అందులో పులుల అడవిని తయారు చేసుకోవచ్చు కదా, బయట ఎందుకు?"

అయితే రాణిగారు అందుకు ఒప్పుకోలేదు. "నేను ఎప్పుడన్నా అట్లా బయట షికారుగా తిరగాలంటే ఈ పులులు అడ్డు వచ్చేస్తాయి బాబూ! ఇవి దగ్గర ఉంచటం కుదరదు!" అన్నది.

అంతలో ప్రజల్లోనే కొందరు తుంటరివాళ్ళు బయలుదేరారు- "అసలు పులుల్ని పెంచుకోవటం ఎందుకు? ఏమైనా ప్రమాదం జరిగితే అందరికీ శ్రమ కదా?! అప్పుడు ఏడ్చుకునే బదులు, ఇప్పుడే ఆ పులుల్ని, అవి మరీ ఎక్కువ కాకమునుపే, మామూలు అడవుల్లో నిశ్శబ్దంగా వదిలేస్తేనేమి?" అని.

రాజుగారు కొంచెం ఆలోచించి, వాటిని అన్నిటినీ రాజ్యంలో వేరు వేరు చోట్ల వదిలిపెట్టించారు. ఎక్కడికక్కడ, చిన్న చిన్న పులివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఎవ్వరూ ఏమీ అనలేదు. అందరూ అభివృద్ధి జరుగుతున్నదని మిన్నకుండిపోయారు. దాన్ని చూసి, ప్రపంచంలోని రాజులందరూ అటుపైన అదేపని చెయ్యటం మొదలు పెట్టారు!

మనం పెంచి పోషించుకుంటున్న పులులు- ఇట్లాంటివి చాలానే ఉన్నట్లున్నాయి. కాలుష్యాన్ని పెంచే కర్మాగారపు పులులు ఒకప్పటి మాటైతే, అణుకేంద్రపు పులులు, అవినీతి పులులు ఇప్పటివి. చిన్న చిన్న పులివేంద్రాలుగా ఇప్పుడు ఇవి ప్రపంచమంతటా పరచుకొని ఉన్నాయి, చప్పుడు చేయకుండా.
ఏ సునామీలో వచ్చినప్పుడు అక్కడ గర్జనలు వినబడుతుంటాయి- అయితే సామ్రాజ్యాల గోడల్ని దాటి బయటికి వచ్చేసరికి, ఆ అరుపులే మనకు పిల్లికూతలుగా వినబడుతుంటాయి.

వేరే వాటి సంగతి ఎలాగున్నా, ముందు ఈ పులివేంద్రాలకు ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుండు.

Wednesday, September 7, 2011

ఉద్యమం

చాలా సంవత్సరాల క్రితం ఒక గురుకుల పాఠశాల.
ఆ బడిలో పిల్లలందరూ నిజంగా ఆణిముత్యాలు. ఐదో తరగతిలోనూ, ఏడో తరగతిలోనూ అద్భుత ప్రతిభ కనబరచిన పిల్లలు. ప్రభుత్వం ఇలాంటి గొప్ప బడులను వాళ్లకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, పిల్లలకోసం చాలా వసతుల్ని కల్పించింది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు వాళ్లకు మనస్ఫూర్తిగా పాఠాలు చెప్పేవాళ్లు.
అక్కడ పని చేసే తెలుగు అయ్యవార్లకు తెలుగంటే నిజంగా ప్రేమ ఉండేది.
సైన్సు టీచరుగారికి నిజంగా విజ్ఞాన శాస్త్రం అంటే అభిమానమూ, శాస్త్రీయ దృక్పథమూ ఉండేవి.
సాంఘిక శాస్త్రపు అయ్యవారికి సమాజం గురించి తనదైన అవగాహన ఒకటి ఉండేది.
హెడ్మాస్టారు గారికి పిల్లలంటే అభిమానమూ, తన బాధ్యతపట్ల నిబద్ధతా ఉండేవి.
అయితేనేమి, ఒకసారి పిల్లలు తినే అన్నంలో పురుగులు కనబడ్డాయి.
చురుకైన పిల్లలు ఆ విషయాన్ని వెంటనే టీచర్ల దృష్టికి తెచ్చారు. టీచర్లు హెడ్మాస్టరుగారికి చెప్పారు.
మరునాడూ పురుగులు కనబడ్డాయి.
పిల్లలకు గొప్ప సామాజిక స్పృహ అలవడింది ఆ సరికి. పురుగుల్ని చూసిన కొందరు పిల్లలకు చాలా కోపం వచ్చేసింది. మిగతావాళ్లను కూడగట్టుకున్నారు. హెడ్మాస్టరుగారిని నిలదీద్దామని వెళ్ళారు.
రోజూ పిల్లలు, టీచర్లు అందరూ కలిసి భోంచేస్తుంటారు బడిలో. ఆరోజున, పాపం, ఆయన తన గదికే అన్నం తెప్పించుకొని తింటున్నారు.
తెలివైన పిల్ల నేతల మెదళ్లు చకచకా పనిచేశాయి- "మాకేమో పురుగుల అన్నం, మీకేమో ప్రత్యేక భోజనమా?" అని. పాపం, హెడ్మాస్టరుగారు తింటున్నది ప్రత్యేక భోజనమేమీకాదు, నిజానికి. పనిలో పడి, సమయానికి భోజనశాలకు రాలేక, అక్కడికే తెప్పించుకున్నారు, ఆ రోజుకు.
అంతే- పిల్లల నిరసన మొదలయిపోయింది. తరగతుల్ని బహిష్కరించేశారు. పిల్లలందరూ చెట్ల క్రిందికి చేరారు. పిల్ల నాయకులు గట్టిగా మాట్లాడారు. "ఈ దోపిడిని, అన్యాయాన్ని ఉపేక్షించకూడదు" అన్నారు. పిల్లలందరూ ఒక్కటై తలలూపారు. టీచర్లు ఏం చెప్పినా, హెడ్మాస్టరుగారు ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మని పరిస్థితి. సభలు, సమావేశాలు- ఎక్కడ చూసినా గందరగోళం- వేరువేరు కూటములు- అందరూ ఎక్కడెక్కడ ఏ ఏ అన్యాయాలు జరుగుతున్నాయో ఉన్నవాటినీ, లేనివాటినీ ఎత్తిపోశారు.
"ఇలాంటి పిల్లలకు మేం పాఠాలు చెప్పలేం" అన్నారు టీచర్లు. "నేనిక్కడ ఉండలేను" అని నొచ్చుకున్నారు హెడ్మాస్టరుగారు. చివరికి బడి మూసేశారు- పదిహేను రోజులు శలవలు ప్రకటించారు.
పదిహేను రోజుల తర్వాత మళ్ళీ బడి తెరిచారు- ఈసారి కొత్త హెడ్మాస్టరుగారు, కొత్త టీచర్లు వచ్చారు.
పిల్లలు కొందరు ఒకింత ఉత్సాహపడ్డారు- "విద్యార్థి ఐక్యతతో ఏదైనా సాధించవచ్చు" అని చెప్పుకున్నారు పైకి.
కానీ పిల్లలవి నిజంగా సున్నిత హృదయాలు. "మేం హెడ్మాస్టరుగారిపైనా, ఉపాధ్యాయులపైనా చేసిన ఆరోపణల్లో పూర్తి నిజం లేదు. నిరసనైతే ప్రకటించాం, కానీ మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన వారి మనసుల్ని మాత్రం చాలా గాయపరచాం" అని వాళ్ళు గుర్తించారు. అయినా గాయపడిన పెద్దల మనసుల్ని ఎలా చక్కదిద్దాలో తెలీక, వాళ్ళూ నొచ్చుకొని ఊరుకున్నారు!

అన్యాయాన్ని నిరసించాలి. అయితే ఆ క్రమంలో సత్యాన్ని వక్రీకరించనక్కర్లేదు. అసత్యాన్ని ప్రోత్సహించకూడదు. సూటిగా, నిజాన్ని మాత్రమే వ్యక్తీకరించటం అవసరం. ఇది ఈనాటి రాజకీయాలకే కాదు; అన్ని సామాజిక ఉద్యమాలకూ చాలా అవసరం- ఏమంటారు?

Saturday, July 3, 2010

నరేంద్రనాథ్

గొర్రెపాటి నరేంద్రనాథ్.. ఇంకా ఉన్నాడు. పోయిన సంవత్సరం ఈరోజున చనిపోయినప్పటికీ, మిత్రులందరి హృదయాల్లో నరేన్ ఇంకా పదిలంగానే ఉన్నాడు.

రాజకీయాల్లో అరాచకీయాన్ని చూస్తున్నా, రక్షకుల అకృత్యాలను చూస్తున్నా, కులాల పేరిట జరిగే కొట్లాటల్ని చూస్తున్నా, చదువుల పేరిట తెస్తున్న దుర్మార్గపు చట్టాల్ని చూస్తున్నా, నేలను దోచుకునే దళారుల్ని- తిరుపతి వేంకటేశ్వరునికి వాళ్లిచ్చే కోట్ల రూపాయల తెల్లధనపు ముడుపుల్ని చూస్తున్నా, వినియోగదారీ సంస్కృతిలో కొట్టుకుపోతున్న యువతరాన్ని చూస్తున్నా, స్వలాభాపేక్షతో మునిగిపోయే ప్రజాసంస్థల్ని చూస్తున్నా, అప్పుల్లో‌ చిక్కుకుని అలమటించే రైతుల్ని చూస్తున్నా- ఆ వ్యథలో జనించే ప్రతి స్పందన లోనూ నరేన్ ప్రతిరూపం కదులుతున్నది ఇంకా.

స్వతంత్ర జీవితాన్ని ప్రేమించిన నరేన్ స్వతంత్రం లేనన్ని రోజులూ- ప్రతి రోజూ గుర్తుకొస్తూనే ఉంటాడు.

Thursday, May 13, 2010

సుబ్బారావు ఎందుకు చచ్చిపోయాడు?

సుబ్బారావుకి కూడా, అందరిలాగే, ప్రాణం అంటే తీపే. చచ్చిపోవాలని అస్సలు లేకుండింది అతనికి.

సుబ్బారావుకి ఒక భార్య, ఒక కొడుకు. వాడికి రెండేళ్ళు. వచ్చీరాని మాటల్తో వాడు ముద్దు ముద్దుగా "ఓయ్, నాన్నా, అవ్వా" అని అరుస్తుంటే సుబ్బారావు మనసు పులకరించిపోయేది. తను చచ్చిపోతానని అసలు ఏనాడూ అనుకోలేదు అతను.

అందుకనే, డాక్టర్లు తన కిడ్నీలో రాళ్ళున్నాయని గుర్తించినప్పుడు, బాగా నీళ్ళు తాగటం కూడా మొదలుపెట్టాడు. ఆయుర్వేదమందులూ వాడాడు.

ఆరోజు సుబ్బారావు పుట్టిన రోజు.

పుట్టినరోజు పార్టీని పదిమంది మిత్రులతో కల్సి జల్సాగా ఫలానా ఊళ్లో తోటలో జరుపుకుంటానన్నాడతను.

"వద్దు- ఇంట్లో ఉండు" అన్నది భార్య, ఎప్పటిలాగానే.

భార్యమాటలు వినాలని అనిపించలేదు సుబ్బారావుకి. మందు పార్టీ ఊరించింది.

పదిమంది మిత్రులూ ఆరేడు మోటారుసైకిళ్లు వేసుకొని, తాగేందుకు మందు సీసాలూ, తినేందుకు మాంసాలూ తీసుకొని బర్రున వెళ్ళిపోయారు- ఫలానా ఊరువైపుకు.

ఫలానా ఊరి తోటలో మిత్రులందరూ కులాసాగా మందు పుచ్చుకొని వీరంగాలు చేస్తుంటే, ఆ తోట వోనరుకు మంటగా అనిపించింది. "పోతారా,లేదా? తాగి తందనాలాడేందుకు మీ అయ్య పొలం అనుకున్నారా?" అని రగడ పెట్టుకున్నాడు.

"నేనేమన్నా మామూలోడ్నా? సుబ్బారావుని!" అని సుబ్బారావుకూ అనక తప్పలేదు. మాటకు మాట పెరిగింది. తోటవాడు పోయి పోలీసుల్ని పిల్చుకు వచ్చాడు.

పోలీసులు మరి ఏమనుకున్నారో, తోటవాడి వెంబడి బయలుదేరి వచ్చారు.

పోలీసులు వస్తున్నారని, మిత్రులంతా తలొకదారినా పరుగెత్తారు- ఎవరి మోటారు సైకిళ్లు వాళ్ళు పట్టుకొని.

సుబ్బారావూ, ఇంకొకడూ హడావిడిగా మోటారుసైకిలెక్కి, హడావిడిగా, జోరుగా బయలుదేరారు- ఇంటివైపుకు.

గవుర్మెంటు వాళ్ళు కొత్తగా వేయించిన రహదారి మెరిసిపోతోంది- పాములాగా, పొడుగ్గా, వంకర్లు తిరుక్కుంటూ పోతోంది.

పొలంవాడిని తాము ఎలా ఏడిపించారో చెప్పుకుంటూ పోతున్నసుబ్బారావుకు వేగం హుషారెక్కించింది.

ఆ తర్వాత ఏమైందో తెలీదు సుబ్బారావుకూ, వెనక కూర్చున్న మిత్రుడికీ: తలపగిలి చచ్చిపోయిన రెండు శరీరాలు, ముద్దైపోయిన ఒక మోటారు సైకిలు దొరికాయి ఊళ్లో వాళ్లకు.

"వద్దంటున్నా వినకుండా వెళ్ళాడు- సినిమాకు" అని ఏడ్చింది సుబ్బారావు భార్య.

రెండేళ్ల పిల్లవాడు బిక్కు బిక్కుమంటూ నిల్చుంటే అందరి గుండే తరుక్కుపోయింది.

భార్య మాట వినకపోవటం వల్లే సుబ్బారావు చచ్చిపోయాడన్నారు కొందరు.

పుట్టిన రోజు పార్టీలు ఇలా చేస్తాయనుకున్నారు, పాత తరం వాళ్ళు కొందరు.

పొలం వోనరుతో రగడ పెట్టుకోకపోతే బాగుండేది. రగడ పెట్టుకునే చచ్చిపోయాడు, సుబ్బారావు" అన్నారు పారిపోయిన సహచరులు.

"అయినా పోలీసులు చేసిన హత్యే, ఇది. వాళ్ళు రాకపోయి ఉంటే సుబ్బారావు చనిపోయేవాడు కాదు" అన్నారు వాళ్లలో ఓ పక్షం వాళ్ళు.

" ఈరకం మోటారు సైకిళ్ళు ఇంతే- బ్యాలన్సు సరిగ్గా లేదు- ఆ బైకు వల్లే సుబ్బారావు చచ్చిపోయాడు" అన్నారు ఊళ్ళో కుర్రవాళ్ళు కొందరు.

"ఇంత వెడల్పాటి రోడ్డుకు ఆ వంకరలెందుకట? వంకర్ల వల్లే సుబ్బారావు పోయాడు" అన్నారు ఊరి పెద్దలు.

"హెల్మెట్ పెట్టుకోనందువల్లే సుబ్బారావు చచ్చిపోయాడు" అని శ్రద్ధాంజలి సభలో ఆర్టీవోగారితోపాటు, స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులూ వక్కాణించారు.

"చచ్చిపోయిన సుబ్బారావు తాగి ఉన్నాడని రాస్తే, పాపం వాడి కుటుంబానికి ఇన్సూరెన్సు డబ్బులు రావు" అని, డాక్టరు గారు దయతలచారు- పోస్టుమార్టం రిపోర్టులో ఆ ఒక్క మాటా రాయలేదు.

ఇంతకీ, అసలు సుబ్బారావు ఎందుకు చచ్చిపోయాడంటారు?