Thursday, September 3, 2009

పద్యం

ఈ మధ్య "తెలుగు పద్యం" బ్లాగును చూశాను. మళ్ళీ నా చిన్నతనం గుర్తుకొచ్చింది. చిన్నతనంలో నేను, మా నాన్న పోటీగా తెలుగులో సొంత పద్యాలు చెప్పుకునేవాళ్ళం. ఆ తరువాత నేను గద్యాన్ని- అందులోనూ మామూలు జనాలు మాట్లాడుకునే వచనాన్ని- అలా అలా చిన్నపిల్లలు ఇష్టపడే కథల్ని- ఇష్టపడటం మొదలుపెట్టాను. 'తెలుగు పద్యం' ద్వారా భైరవభట్లగారు నాకు పద్యాలంటే మళ్ళీ ఓసారి అభిమానం పుట్టించారు. వారికి ధన్యవాదాలతో, ఈ చిన్న పద్యసుమం..

ఉ. ఉల్లమునందు భావనలు తుమ్మెదలై విరితావిగోరి పై
దేలగ, వాని యాకలిని దీర్పగనెంచిన పల్కుబోడి ప్రా-
ల్మాలెడి నొక్కతోట కథలై, యొకచో కవితా సుమంబులై
అల్లన పద్యమై యొక వనంబున తేనియలూరు గద్యమై.


చాలారోజుల తరువాత రాయబూనటంతో అన్నీ మర్చిపోయాను-- నాకోసం ఛందస్సుకు సంబంధించి ఈ చిన్న నోట్సు తయారు చేసుకున్నాను. ఎవరికైనా ఉపకరిస్తుందేమోనని ఇక్కడే జతపరుస్తున్నాను:


గణాలను గుర్తించేందుకు ప్రధాన సూత్రం: యమాతారాజభానసలగా
సూర్య గణాలు: గల, న
ఇంద్ర గణాలు: నల, నగ, సల, భ,ర, త.



కంద పద్యం:

౧. నాలుగు పాదాలు. మొదటి రెండూ ఒక భాగం; తర్వాతి రెండూ ఒక భాగం.
౨. ఒక్కో భాగంలోను మొదటి పాదంలో మూడు గణాలుంటాయి; రెండో పాదంలో ఐదు గణాలు- మొత్తం ఒక్కో భాగంలోను ఎనిమిది గణాలు.
౩. 'నల, గగ, భ, జ, స' అనే గణాలు మాత్రమే ఉండాలి. అంటే ప్రతి గణంలోను నాలుగు మాత్రలు ఉంటై.
౪. ఆరవ గణం 'నల'కానీ, 'జ' కానీ అయిఉండాలి.
౫. బేసి గణం 'జ' కాకూడదు.
౬. రెండు, నాలుగు పాదాల్లో ఒకటి-నాలుగు గణాల మొదటి పాదాలకు యతి మైత్రి ఉండాలి.
౭. ప్రాస మైత్రి ఉండాలి.


కందానికి ఉదాహరణలు:

'కందము చెప్పక కవిగా
డందము చందమును కంద పదమే యనగా..'

'తనయుల నజాత పక్షుల
ననల శీఖాభీతి చంచలాత్ముల నెటయుం
జననేరని బాలకులను
జననియు వీక్షించి శోక సంతాపితయై'

తేటగీతి

'సూర్యుడొక్కడుండు- సురరాజులిద్దరు- ఇన గణ ద్వయంబు తేటగీతి'

౧. నాలుగు పాదాలు.
౨. ప్రతి పాదంలోను వరసగా ఒక సూర్య గణం, రెండింద్రగణాలు, రెండు సూర్య గణాలు- మొత్తం అయిదు గణాలుంటాయి.
౩. మొదటి గణం మొదటి అక్షరానికి, నాలుగవ గణం మొదటి అక్షరానికి యతి.
౪. ప్రాస నియమం లేదు.
౫. ప్రాసయతి చెల్లుతుంది.

తేటగీతి కి ఉదాహరణ:

"బిలము సొచ్చితిమేని నందెలుక చంపు
నింద యుండితిమేని దా నేర్చునగ్ని
యెలుకచే జచ్చుకంటె నీ జ్వలన శిఖల
గ్రాగి పుణ్యలోకంబుల గాంతుమేము."

ఆటవెలది:

"ఇన గణ త్రయంబు ఇంద్ర ద్వయంబు
హంస పంచకంబు ఆటవెలది"

౧. పై సూత్రంతో ఒకటి-రెండు పాదాలు తయారౌతాయి. అలాగే మూడు-నాలుగు పాదాలున్నూ.
౨. మొదటి పాదంలోను, మూడవ పాదంలోను మూడు సూర్యగణాలు, రెండు ఇంద్ర గణాలు ఉంటాయి. ఇక రెండవ పాదంలోను, నాల్గవ పాదంలోను వరసగా అయిదేసి సూర్యగణాలుంటాయి.
౩. అన్నిపాదాలలోను ఒకటవ, నాల్గవ పాదాల మొదటి అక్షరాలకు యతి మైత్రి ఉంటుంది.
౪. ప్రాస నియమం లేదు.
౫. ప్రాస యతి చెల్లుతుంది.

ఆటవెలదికి ఉదాహరణ:

అన్ని వేమన పద్యాలు-
"మేడి పండు చూడ మేలిమై యుండును
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ."


సీసము:

౧. నాలుగు పెద్ద పెద్ద పాదాలు: ప్రతి పాదంలోను ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్య గణాలు ఉంటై.
౨. ఒక్కో పాదాన్ని నాలుగేసి గణాలకు విరిచి- రెండు ముక్కలుగా రాయాలి.
౩. ఒక్కో ముక్కలోను మొదటి గణపు తొలి అక్షరానికి, మూడోగణపు తొలి అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౪. ప్రాసయతి పరవాలేదు.
౫. ప్రాయ ఉండనవసరం లేదు.
౬. సీస పద్యం తరవాత దానికి తోడుగా ఆటవెలదిగాని, తేటగీతిగాని ఉండటం తప్పనిసరి.

సీస పద్యానికి ఉదాహరణ:

"ఇరులు కోకిలములై నెచ్చోట కూయునో
అచ్చోట మధుమాసమవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
అవ్వేళ ల వసంతమందగించు
ఇరులేమయూరమై ఎటనాట్యమాడునో
అటనే నవాషాఢమావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆరోజు కార్తికమ్మాగమించు"



ఉత్పలమాల:
"భరనభభరలగ"

౧. నాలుగు ఒకేలాంటి పాదాలు. ప్రతి పాదంలోను వరస గణాలు 'భరనభభరలగ' వస్తాయి. అలా ఒక్కో పాదానికి మొత్తం ఇరవై అక్షరాలు వస్తాయి.
౨. మొదటి అక్షరానికి, పదవ అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౩. ప్రాస మైత్రి ఉండాలి.

ఉత్పలమాలకు ఉదాహరణ:

"కానుగ చెట్ల నీడననొకానొక స్వప్నపు సెజ్జ మీద ని-
ద్రాణత హాయిగొల్పగ సదా శయనింపగ నీ మహాంధకా-
రాన మనస్సు శాంతిగొనె- రాను భవత్కమనీయ కాంతి సౌ
ధానికి- నన్ను బిల్వకుము తన్వి- విభావిభవాభిరామవై."


చంపకమాల:
"నజభజజజర"

౧. నాలుగు పాదాలూ ఒకే రకంవి: "నజభజజజర" అలా ఒక్కో పాదంలోను ఇరవైఒక్క అక్షరాలు వస్తాయి.
౨. ప్రతిపాదంలోను మొదటి అక్షరానికి, పదకొండవ అక్షరానికి యతి మైత్రి ఉండాలి.
౩. ప్రాస మైత్రి ఉండాలి.

చంపక మాలకు ఉదాహరణ:

"పలుమరు సజ్జనుండు ప్రియభాషలె పల్కు, కఠోరవాక్యముల్
పలుకడొకానొకప్పుడవి పల్కిన కీడును కాదు; నిక్కమే!-
చలువకు వచ్చి మేఘుడొక జాడను తా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు, వేగిరమె శీతల నీరముగాక ? భాస్కరా!"


శార్దూలము:

"మసజసతతగ"

౧. నాలుగు ఒకేరకం పాదాలు. "మసజసతతగ". అలా ఒక్కో పాదంలోను మొత్తం పంథొమ్మిది అక్షరాలు ఉంటాయి.
౨. ప్రతి పాదంలోను మొదటి అక్షరానికి, పదమూడవ అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.
౩. ప్రాస ఉంటుంది.

శార్దూలానికి ఉదాహరణ:

"ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి, సు-
శ్లోకంబైన హిమాద్రినుండి భువి; భూలోకంబునందుండి య-
స్తోకాంబోధి; పయోధినుండి పవనాంధోలోకమున్ జేరె గం-
గా కూలంకష; పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్."


మత్తేభము:

"సభరనమయలగ"

౧. నాలుగు ఒకే రకమైన పాదాలు: "సభరనమయలగ". అలా ఒక్కో పాదంలోను మొత్తం ఇరవై అక్షరాలు ఉంటాయి.
౨. మొదటి అక్షరానికి , పధ్నాలుగో అక్షరానికి యతి మైత్రి ఉంటుంది.
౩. ప్రాస మైత్రి ఉంటుంది.

మత్తేభానికి ఉదాహరణ:

"ఇది కల్పాంతమొ ఇమ్మహోగ్ర సలిలంబేకార్ణవాకారమై
పొదలంజూచెనొ ఇంతతోన జగముల్ పోజేసెనో ధాత- యె
య్యది దిక్కెక్కడ సొత్తుమెవ్విధమునన్ బ్రాణంబు రక్షించుకో
లొదవున్ దైవమ యంచు గోపనివహంబుద్వేగమొందెన్మదిన్."

ఇవికాక మరిన్ని మళ్లీ ఇంకోసారి ఎప్పుడైనా.

3 comments:

ఊకదంపుడు said...

నమస్కారమండీ, స్వాగతం
ఈ లగ ను వ గణం అని కూడా అంటారనుకుంటా.
చిన్నతనం లోనే సొంత పద్యాలు అంటే - చాల వ్రసే ఉంటారు. వీలువెంబడి ప్రకటించది, యతి ప్రాసలను పక్కనపెడితే పద్యం ధరా, భావము చాల చక్కగ ఉన్నయి.
ఇక్కడ పద్యవిద్య గురువులు, పద్యవిద్య మీద అభిమానం తో నేర్చుకుంటున్నవారు తగిన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజకీయ విపత్తు కాస్త చల్లరగానే వస్తారు. ఈ లోపు మీరు
padyam.net, ఈ టపా [http://vookadampudu.wordpress.com/2008/10/12/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%95-%e0%b0%aa%e0%b1%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a/] టపా, టపా వ్యాఖ్య లో రానారే ఇచ్చిన నేపధ్యపు లంకె చూడండి

ఊకదంపుడు said...

పైన ధార బదులు ధరా అనీ, మరికొన్నీ అచ్చుతప్పులొచ్చాయి మన్నించండి.

నమస్కారమండీ, స్వాగతం
ఈ లగ ను వ గణం అని కూడా అంటారనుకుంటా.
చిన్నతనం లోనే సొంత పద్యాలు అంటే - చాల వ్రాసే ఉంటారు. వీలువెంబడి ప్రకటించండి.
యతి ప్రాసలను పక్కనపెడితే పద్యం ధార , భావము చాల చక్కగ ఉన్నాయి.
ఇక్కడ పద్యవిద్య గురువులు, పద్యవిద్య మీద అభిమానం తో నేర్చుకుంటున్నవారు తగిన సంఖ్యలో ఉన్నారు. ఈ రాజకీయ విపత్తు కాస్త చల్లారగానే వస్తారు. ఈ లోపు మీరు
padyam.net, ఈ టపా [http://vookadampudu.wordpress.com/2008/10/12/%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%a4%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%95-%e0%b0%aa%e0%b1%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a/], టపా వ్యాఖ్య లో రానారే ఇచ్చిన నేపధ్యపు లంకె చూడండి

కొత్త పాళీ said...

సంతోషం.
తెలుగు ఛందస్సు మూలసమాచారం చాలా వరకూ తెలుగు వికీపీడియాలో చేర్చారు.
కందం నియమాల్లో .. మొదటి పాదం గురువుతో మొదలైతే మిగతావి కూడా గురువుతో మొదలవ్వాలనీ, అలాగే లఘువుతోనూ అనీ ఒక నియమం ఉంది.