Thursday, May 13, 2010

సుబ్బారావు ఎందుకు చచ్చిపోయాడు?

సుబ్బారావుకి కూడా, అందరిలాగే, ప్రాణం అంటే తీపే. చచ్చిపోవాలని అస్సలు లేకుండింది అతనికి.

సుబ్బారావుకి ఒక భార్య, ఒక కొడుకు. వాడికి రెండేళ్ళు. వచ్చీరాని మాటల్తో వాడు ముద్దు ముద్దుగా "ఓయ్, నాన్నా, అవ్వా" అని అరుస్తుంటే సుబ్బారావు మనసు పులకరించిపోయేది. తను చచ్చిపోతానని అసలు ఏనాడూ అనుకోలేదు అతను.

అందుకనే, డాక్టర్లు తన కిడ్నీలో రాళ్ళున్నాయని గుర్తించినప్పుడు, బాగా నీళ్ళు తాగటం కూడా మొదలుపెట్టాడు. ఆయుర్వేదమందులూ వాడాడు.

ఆరోజు సుబ్బారావు పుట్టిన రోజు.

పుట్టినరోజు పార్టీని పదిమంది మిత్రులతో కల్సి జల్సాగా ఫలానా ఊళ్లో తోటలో జరుపుకుంటానన్నాడతను.

"వద్దు- ఇంట్లో ఉండు" అన్నది భార్య, ఎప్పటిలాగానే.

భార్యమాటలు వినాలని అనిపించలేదు సుబ్బారావుకి. మందు పార్టీ ఊరించింది.

పదిమంది మిత్రులూ ఆరేడు మోటారుసైకిళ్లు వేసుకొని, తాగేందుకు మందు సీసాలూ, తినేందుకు మాంసాలూ తీసుకొని బర్రున వెళ్ళిపోయారు- ఫలానా ఊరువైపుకు.

ఫలానా ఊరి తోటలో మిత్రులందరూ కులాసాగా మందు పుచ్చుకొని వీరంగాలు చేస్తుంటే, ఆ తోట వోనరుకు మంటగా అనిపించింది. "పోతారా,లేదా? తాగి తందనాలాడేందుకు మీ అయ్య పొలం అనుకున్నారా?" అని రగడ పెట్టుకున్నాడు.

"నేనేమన్నా మామూలోడ్నా? సుబ్బారావుని!" అని సుబ్బారావుకూ అనక తప్పలేదు. మాటకు మాట పెరిగింది. తోటవాడు పోయి పోలీసుల్ని పిల్చుకు వచ్చాడు.

పోలీసులు మరి ఏమనుకున్నారో, తోటవాడి వెంబడి బయలుదేరి వచ్చారు.

పోలీసులు వస్తున్నారని, మిత్రులంతా తలొకదారినా పరుగెత్తారు- ఎవరి మోటారు సైకిళ్లు వాళ్ళు పట్టుకొని.

సుబ్బారావూ, ఇంకొకడూ హడావిడిగా మోటారుసైకిలెక్కి, హడావిడిగా, జోరుగా బయలుదేరారు- ఇంటివైపుకు.

గవుర్మెంటు వాళ్ళు కొత్తగా వేయించిన రహదారి మెరిసిపోతోంది- పాములాగా, పొడుగ్గా, వంకర్లు తిరుక్కుంటూ పోతోంది.

పొలంవాడిని తాము ఎలా ఏడిపించారో చెప్పుకుంటూ పోతున్నసుబ్బారావుకు వేగం హుషారెక్కించింది.

ఆ తర్వాత ఏమైందో తెలీదు సుబ్బారావుకూ, వెనక కూర్చున్న మిత్రుడికీ: తలపగిలి చచ్చిపోయిన రెండు శరీరాలు, ముద్దైపోయిన ఒక మోటారు సైకిలు దొరికాయి ఊళ్లో వాళ్లకు.

"వద్దంటున్నా వినకుండా వెళ్ళాడు- సినిమాకు" అని ఏడ్చింది సుబ్బారావు భార్య.

రెండేళ్ల పిల్లవాడు బిక్కు బిక్కుమంటూ నిల్చుంటే అందరి గుండే తరుక్కుపోయింది.

భార్య మాట వినకపోవటం వల్లే సుబ్బారావు చచ్చిపోయాడన్నారు కొందరు.

పుట్టిన రోజు పార్టీలు ఇలా చేస్తాయనుకున్నారు, పాత తరం వాళ్ళు కొందరు.

పొలం వోనరుతో రగడ పెట్టుకోకపోతే బాగుండేది. రగడ పెట్టుకునే చచ్చిపోయాడు, సుబ్బారావు" అన్నారు పారిపోయిన సహచరులు.

"అయినా పోలీసులు చేసిన హత్యే, ఇది. వాళ్ళు రాకపోయి ఉంటే సుబ్బారావు చనిపోయేవాడు కాదు" అన్నారు వాళ్లలో ఓ పక్షం వాళ్ళు.

" ఈరకం మోటారు సైకిళ్ళు ఇంతే- బ్యాలన్సు సరిగ్గా లేదు- ఆ బైకు వల్లే సుబ్బారావు చచ్చిపోయాడు" అన్నారు ఊళ్ళో కుర్రవాళ్ళు కొందరు.

"ఇంత వెడల్పాటి రోడ్డుకు ఆ వంకరలెందుకట? వంకర్ల వల్లే సుబ్బారావు పోయాడు" అన్నారు ఊరి పెద్దలు.

"హెల్మెట్ పెట్టుకోనందువల్లే సుబ్బారావు చచ్చిపోయాడు" అని శ్రద్ధాంజలి సభలో ఆర్టీవోగారితోపాటు, స్థానిక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులూ వక్కాణించారు.

"చచ్చిపోయిన సుబ్బారావు తాగి ఉన్నాడని రాస్తే, పాపం వాడి కుటుంబానికి ఇన్సూరెన్సు డబ్బులు రావు" అని, డాక్టరు గారు దయతలచారు- పోస్టుమార్టం రిపోర్టులో ఆ ఒక్క మాటా రాయలేదు.

ఇంతకీ, అసలు సుబ్బారావు ఎందుకు చచ్చిపోయాడంటారు?

3 comments:

ఆ.సౌమ్య said...

తాగి, కొవ్వెక్కి, ఒళ్ళు బలిసి.

Unknown said...
This comment has been removed by a blog administrator.
ramudu said...

సంతోషంగా ఇంటిలో చేసుకోవలసిన పార్టిని ఇతరులకు ఇబ్బంది కలిగే చోట చెసుకొవడం వల్ల, నిద్రపోవలసిన సమయములో బాధ్యత లేకుండ తాగి బండి నడపడం వల్ల సుబ్బారావు చచ్చిపోయాడు.