Saturday, January 9, 2010

బందులూ-ఉద్యమాలూ ఇంకెన్నాళ్ళు?

రాష్ట్రంలో బందులను చూస్తుంటే తిక్క రేగుతోంది.

చాలు స్వామీ! ఈ బందులు ఇక బందు చేయండి. మామూలు జనాల్ని బొంద పెట్టకండి.

మీకు ఏది కావాలో అది తీసేసుకోండి- తొందరగా- ఈ ఒక్క సారికీ. మళ్ళీ‌మీక్కావలసింది మీకు దొరుకుతుందో, దొరకదో. ఇప్పుడే తీసేస్కోండి. మామూలు జనాల్ని బందు చేయటం మాత్రం ఆపేయండి ఇంక.

'ఉద్యమాలవాళ్ళూ'! మీ బ్రతుకు తెరువులేంటి? ఉద్యమాలేనా? ఉద్యమాలు బాగా కూడు పెడుతున్నాయా? బందుల్లో జనాలకు ఉప్పు దొరక్క అల్లాడుతుంటే, పగలగొట్టిన మెగా దుకాణాల చక్కెర మీకు దక్కటంలేదు గద!?

ఉద్యమాల్లో బస్సుల్ని కాల్చేసీ కాల్చేసీ, అవైపోయిన తరువాత అరచేతులు దురద పెడితే మీ కోడళ్ళనీ, భార్యల్నీ, అమ్మల్నీ, అక్కచెల్లెళ్లనీ కాల్చెయ్యరు గద!?

టివి దుకాణాల టివిలు, నగల దుకాణాల నగలు, ఆర్టీసీ‌బస్సుల సీట్లు, కనబడ్డ టూ వీలర్లూ, కార్లూ, రిలయన్సు దుకాణాల పచారీ సరుకులూ అన్నీ మీకేనా? అవన్నీ‌ అయిపోయాక, రాళ్ళూ వేసేందుకు వేరే ఏవీ దొరక్క, మామూలు జనాల ఇళ్ల మీదికి వస్తారేమో, ఎలాగ!?

మీడియా వాళ్ళూ! మిమ్మల్ని ఎవ్వరూ‌ఏమీ అనకూడదు కాబోలు. దేవుళ్ళూ మీరే, దయ్యాలూ మీరే, సర్వమూ మీరే. అందరూ మీ బాంచలే. కాల్మొక్కాలి కాబోలు. ముసలి గంగారాం గుండెజబ్బుతో పోతే మీకు అది తెలంగాణా మరణమా? సుబ్బయ్య ఊపిరాడక చస్తే మీకు అది చప్పున సమైక్యాంధ్ర మృతి లెక్కల్లోకి చేరుకుంటుందా? శవాల మీద బ్రతికేది రాబందులేమో గదా, వాటి పాత్రా మీరే నిర్వహిస్తే ఎలాగ? ఇంతకీ మీరు రాష్ట్రాన్ని కాల్చబోవట్లేదా? ఎందుకు కాల్చట్లేదు? పోనీ, రేపేమన్నా కాల్చుతారా? ఎందుకు కాల్చరు? కాల్చకపోవటం వెనక ఏమేం శక్తులున్నాయంటారు? ఏశక్తులూ లేవంటే, దాని అర్థం ఎవరో మనుషులు ఉన్నట్లేనంటారా? లేరంటారా? మరి మీ యజమానులు ఏం చేస్తున్నట్లు? వాళ్లు మనుషులు కారంటారా? ఏమైనా అయితే మీ జర్నలిస్టులను పట్టుకుంటారెందుకు? మీ యజమానులు మీకు అంత స్వేచ్ఛ ఇస్తున్నారుగదా, తప్పులన్నీ‌ మీవేనంటారా? నిజంగానే!? అబ్బ!! ఎంత స్వేచ్ఛాజీవులండీ, మీరు! మీ ఓనర్లు స్వయంగా ఎవరో రాజకీయం వాళ్ళు అని జనాలు అనుకుంటున్నారు గదా! కాదంటారా? అవునంటున్నారా! అయినా ప్రభుత్వం వాళ్ళను ఏమీ ఆనకూడదంటారా? వాళ్ళ పీక నొక్కితే ప్రజాస్వామ్యానికి ఊపిరాడదు కాబోలు. మీరూ నొక్కక, ప్రభుత్వమూ నొక్కక, కోర్టులూ నొక్కకపోతే, మరి మీవాళ్లను అడ్డుకునేదెవ్వరు? "పత్రికా స్వేచ్ఛ" అంటే మీ వోనర్ల స్వేచ్ఛేనా? నెలన్నరగా రాష్ట్రాన్నంతా అతలాకుతలం చేసేస్తున్నారే, మీ వోనర్లూ, రాజకీయనాయకులూ ఒక్కటేనని అందరూ అంటున్నారే, అయినా మీవాళ్ళు ఈ "స్వేచ్ఛ" ముసుగులు వేసుకునే ఉన్నారే, మామూలు జనాలకేనా, స్వేచ్ఛలు లేనిది? మీ వోనర్లనేమైనా చేస్తే మీరంతా కదం తొక్కుతారే, మీకేమైనా అయితే మామూలు జనాల దుకాణాలు మీరంతా కల్సి బందుపెడతారే, మరి మీరు మామూలు జనాలకు ఏం తిండి పెడుతున్నారు? టీఆర్పీ రేటింగులూ, అడ్వర్టైజుమెంట్ల రేట్లూ తప్ప, "మీకు జనాల శ్రేయస్సు అవసరం" అని మేమెందుకు నమ్మాలి? ఎవరైనా మిమ్మల్నెందుకు వదిలెయ్యాలి, ఇంత జరిగాక? సెన్సార్షిప్ పేరుతో మిమ్మల్ని ఎవరో నియంత్రించబూనితే, మా స్వాతంత్ర్యం తగ్గిపోయినట్లు మామూలు జనాలం, మేమెందుకు ఏడవాలి? మీదీ వ్యాపారమే. ఈ బందుల్లో అందరి వ్యాపారాలూ దెబ్బ తిన్నాయి- మీరొక్కరే లాభపడ్డారు. మీ వోనర్లకు ఇది బాగుంది. వాళ్ళు ఇలా కొనసాగించమంటారు. మీరు ఇంకెంతకాలం, వాళ్ళకు చెంచాగిరీ చేస్తారు? మీ అంతరాత్మలు చచ్చిపోనైతే లేదు గద!?

ఒరేయ్, 'విద్యార్థులూ', మీరు గూండాలట్రా? లేకపోతే చెంచాగాళ్ళా? తెలంగాణా వస్తే మీరంతా మంత్రులౌతారట్రా? సమైక్యాంధ్ర మీకేమైనా కిరీటాలు పెడుతున్నదట్రా? మీకేం ఒరుగుతున్నదో మీకేమైనా తెలుస్తున్నదట్రా, అసలు? సభలు పెట్టీ, యూనివర్సిటీల్లో ఊరేగింపులు చేసీ ఎవరేం పొడుస్తున్నార్రా? మీకందరికీ కనీసపు బ్రతుకు తెరువు, మర్యాదతోకూడిన జీవితాలు- చూపించగలర్రా, వీళ్ళు? జలయజ్ఞాల్లో సొమ్ము రాయలసీమకు చేరలేదురా, ఒరేయ్, సీమలో‌పదిమంది జేబుల్లోకి దూరింది. ప్రామిస్. నమ్మండి. మామూలు జనాలకు ఒక్కపైసా లాభం కలగలేదురా. తెలంగాణా వాళ్ళు రాయలసీమ మూలల్లోకెళ్ళి చూడండి. సీమవాళ్ళు తెలంగాణ పల్లెల్లోకెళ్ళి చూడండిరా, ఒరేయ్, మామూలు జనాలు అందరూ-అంతటా అడుక్కుంటూ, పట్నాలను అనుకరించలేక, మురిగిపోతూ, పెద్దోళ్ళ కాళ్లొత్తుతూనే ఉన్నార్రా. తెలంగాణాలో ఉన్నంత వెనకబాటు తనం లేని ఊళ్ళు ఏ జిల్లాలోనూ లేవురా, ఒరేయ్, వీళ్ళూ మిమ్మల్ని వాడుకుంటున్నార్రా! మీ చదువులు నాశనం. మీకు రాబోయే ఉద్యోగాలు నాశనం. మీ ఇంటోళ్ల సంపాదననాశనం. మీ నోటిదగ్గర కూడు నాశనం అవుతోందిరా, ఒరేయ్, అమ్మ అయ్యలు తెచ్చి పెడుతున్నారట్రా, మీకు, ఖాళీ రోడ్లమీద, పంచభక్ష్య పరమాన్నాలు? అవి తెచ్చిపెడుతున్నవాళ్ళూ ఏ స్వార్థమూ లేని గాంధీ మహాత్ములేనట్రా? ఒరేయ్, కొంచెం ఆలోచించండ్రా, తొత్తులవ్వకండి. నిజంగా మేలుకోండి. మీ చదువులు మీరు బాగా చదవండిరా, మీ అమ్మ అయ్యల కలలు నిజం చెయ్యండి. అర్టీసీ బస్సులు పగలగొడితేనూ, సీట్లు-టైర్లు కాలిస్తేనూ‌ ఏమొస్తుందిరా, ధరలు పెరగటం తప్ప? విద్యార్థిశక్తిని పనిలో చూపండిరా, మేధస్సులో చూపించండి. వినాశంలో కాదమ్మా! గూండాలవ్వద్దండమ్మా! ఇంకోళ్లని కాల్చటం పాపం బాబులూ! ఏది కావాలంటే అది తీసేసుకోండి- దయచేసి మీ గూండాగిరీని అంత పబ్లిక్ గా ప్రదర్శించకండి. ప్లీజ్!

గూండాలమీద కేసులు పెట్టటం ప్రభుత్వ బాధ్యత. ప్రజా ఆస్తుల్ని నష్టపరచిన వాళ్లను పట్టుకోవటం, వాళ్లమీద కేసులు పెట్టటం ప్రభుత్వం పని. ఆపని ప్రభుత్వం చేసేట్లుగా చూడటం కోర్టుల బాధ్యత. జనాల ఆస్తుల్ని నాశనంచేసినవాళ్లతో ప్రభుత్వం కుమ్మక్కై, వాళ్లమీద కేసులు ఎత్తెయ్యాలంటే, మరి నష్టపోయిన ఆస్తుల సంగతేమిటి? వాటినెవరు భరించాలి? కేసులు ఎత్తెయ్యాలనేవాళ్ళు ఆ ఖర్చునూ‌భరిస్తే బాగుంటుందేమో! అందరూ ఆలోచించండి- ఎలాగూ గాలిలో చాలా డబ్బులే మూలుగుతున్నట్లున్నాయి- లేకుంటే ఇంత గొప్ప అల్లర్లను నెలన్నర పాటు రచించటం ఒట్టి మాటలు కాదు. పోనీ, జరిగిన నష్టాలన్నిటినీ గాలి భరిస్తుందేమో అడగరాదూ, ఎవరైనా?

6 comments:

KumarN said...

హ్మ్. కామన్ మాన్ ఆవేశం, ఆవేదన బాగా కనిపించాయి.

నిరంజన్ said...

ఇక కొనసాగదానికి వీల్లేదు.సామాన్యుని బాధలు పట్టని ఈ ఉద్యమాలు,బంద్ లు మనకెందుకు?

ప్రేరణ... said...

చాలా బాగా చెప్పారండి.expressed well.

Anonymous said...

మీ పాఠం బాగుంది.
రాష్ట్రంలోని విధ్యార్థులందరికి చెప్పేవారెవరు?

విరజాజి said...

చాలా బాగా చెప్పారు... కానీ వినేదెవ్వరు? సగటు జీవి జీవితాన్ని గురించి ఎవ్వరికి పట్టింది? ఉద్యమాలు చేసేవారికి అస్సలు అవగాహన ఉన్నదా? మన లో చాలా లోపాలు పెట్టుకుని ఎదుటి వాడిని వేలెత్తి చూపడం చాలా సులభం కదా..... జనాలు అదే చేస్తున్నారు. విద్యార్ధులు.... విద్య అర్ధించేవారుగాలేరు, రాష్ట్రాలని అర్ధిచేవారు గా ఉన్నారు. 7వ తరగతి చదివే బడి పిల్లాడికి తెలంగాణా కావాలట.... చేతిలో రాయి ఉంటే అద్దాలు పగలగొట్టడానికి ప్రతీ ఒక్క తుంటరి వెధవా రెడీ.... వాడికదో సరదా.... అలా పిచ్చోడి చేతిలో రాయి చందాన ఉద్యమాలు సా.......గుతున్నాయి. గొఱ్ఱెల మంద లాటి వారు ఈ రాజకీయనాయకుల ఉచ్చులో పడుతున్నంత వరకు - పరిస్థితులు బాగు పడవు.

కొత్త పాళీ said...

ఇక కాలనీ కాలనీకీ, పేట పేటకీ స్థానిక నివాసుల సైన్యాలు ఏర్పడాలి, అక్కడి ప్రైవేటు ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించుకోడానికి