In death there is release.
నిజమనిపిస్తుంది.
నరేంద్రనాథ్ వెళ్ళిపోయాడు. విలువైన విషయాలు చెప్పీ, చెప్పీ అలిసిపోయి, ఇక చెప్పాల్సిన పనిలేకుండా వెళ్ళిపోయాడు.
ఇక ప్రతిరోజూ రాత్రి తొమ్మిది గంటలకు నరేన్ వస్తాడు మనసులోకి- ఏ మాటల్లో ఉన్నా తొమ్మిదికల్లా అతని మెదడు స్విచాఫ్ అయిపోయేది... ఇప్పుడు పూర్తిగా స్విచాఫ్ అయిపోయింది.
ఘోరమైన జీవిత సత్యాన్ని తన కుళ్ళుజోకుల మాధ్యమంగా పలికించీ, పలికించీ- ప్రేమగా తిడుతూ మనసులో మెచ్చుకునేవాళ్ళను వదిలేసి, ఇప్పుడు పోయాడు.
వద్దంటున్నా హోమియో మందులిచ్చీ, ఇచ్చీ, వద్దనేవాళ్ళకు అలవాటు పడిపోయాడు నరేన్. అతనికి అలవాటు పడ్డవాళ్ళం ఇప్పుడు అతను లేకపోవటానికి అలవాటు పడాలి.
నరేన్ తో ప్రత్యేకమైన వెంకట్రామాపురం ఇప్పుడు ఇంకొక గ్రామం అయిపోతుంది. ఇప్పుడక్కడ ఇక అందరూ ఇంకా లోతైన బోర్లు వేసుకోవచ్చు- అరిచేవాడే ఉండడు.
చాలా డబ్బులు పోగొట్టుకున్నాడట, తన ప్రయోగాల్లో- తనే చెప్పుకున్నాడు "ఇట్లు-ఒక రైతు" పుస్తకంలో. కానీ వాటికి కోటిరెట్లు విలువైన విలువల్ని మిత్రులకు పెట్టుబడిగా ఇచ్చాడు- సంరక్షించి, పెంచమని. పాలగుట్టపల్లిలో మామూలు కుర్రాళ్ళు ఒక్కొక్కరి దగ్గరా ఒక్కో సంపద దాచుకున్నాడు నరేన్, నిజంగానే.
నరేన్ సంతకంనుండి సంస్థలుగానీ, సంఘాలు గానీ ఏం నేర్చుకున్నాయో తెలీదు. ఇవాల్టి ఆంధ్రజ్యోతి మథ్యపేజీలో బాలగోపాల్ బాగా రాశాడు. సంస్థలు నిజానికి వ్యక్తుల్నించి ఏమీ నేర్చుకోవనిపిస్తుంది నావరకూ. వ్యక్తులకంటే తాము ఉన్నతమైనవనుకుంటాయేమో అవి. వీలుంటే అవి వ్యక్తుల్ని ఏదో ఒక చట్రంలో బిగించి విశ్లేషిస్తాయి. ఆ తరువాత ఇంకా జగన్నాథ రథ చక్రాలు తోసుకొని పోతూనే ఉంటై.
నరేన్ ఒక వ్యక్తి. ఎంత పోయినాసరే, చాలామంది వ్యక్తులకు నరేన్ ఉన్నాడు. ఇంకా ఉంటాడు చాలా ఏళ్ళు.
(గొర్రెపాటి నరేంద్రనాథ్ నాబోటి చాలా మందికి స్ఫూర్తిదాత, గురువు.. మొన్న చనిపోయాడు.)
Monday, July 6, 2009
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
నరెంద్ర్ర నాథ్ గారి అస్తమయం గురించిన సానుభూతి వారి కుటుంభసభ్యులకు, వారి మిత్రులకే కాదు యావత్ భూమికి,మట్టితొ పెన వేసుకున్న సకల చరా చర ప్రాణకొటికి, మరీ ముఖ్యం గా అయన్ని తెలుసుకొలేని ,అయన పేరు కూడా వినని దురద్రుష్టవంతులకి .
తెలుగు ఫుకుఒకా నరేంద్రనాథ్. ఆయనకు హృదయపూర్వక నివాళి.
మట్టిలో కలిసిపోయిన మట్టి మనీషికి హృదయపూర్వక నివాళి
ఇప్పుడే దిలీప్ గారి బ్లాగులో చూశా.
వీరి "ఇట్లు ఒక రైతు" పుస్తకం నిన్ననే చదివాను. నిజంగా స్ఫూర్తిదాయకం వారి జీవితం.
Post a Comment