ఇరవై ఐదేళ్ళ క్రిందటి సంగతి...
రామారావు, సీత ఇద్దరూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు చంద్రం.
చంద్రానికి రెండేళ్ళు నిండగానే నర్సరీలో చేర్పించారు. ఆ రెండేళ్ళూ సీత పడ్డ పాట్లు సీతమ్మకూడా పడలేదు. అందుకని బడి వాళ్లు ఒకరోజు రమ్మంటే, వీళ్ళూ రెండు రోజులు వెళ్ళి- క్యూలో నిలబడి మరీ చంద్రాన్ని బళ్ళో వేశారు. రెండ్రోజులు శలవతోబాటు ఇరవైవేలు డొనేషనూ కట్టాల్సి వచ్చింది. అంతా చేసి ఆ బళ్ళో హాస్టల్ వసతి లేదు! పిల్లల్ని వాళ్ళు రెండింటికల్లా వదిలేసేవాళ్ళు. ఆ తరువాత వాడు నేరుగా క్రష్ కెళ్ళి, మిగిలిన పిల్లల్తో ఆడుకునేవాడు- అమ్మా, నాన్నా వచ్చి ఇంటికి తీసుకెళ్ళేంతవరకూ.
వాడికి నాలుగేళ్ళు నిండాక వాడ్నితీసి ఇంకో బళ్ళో వేశారు. "ప్రగతి కాంవెంట్"లో ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడింటి వరకూ ఉంచుకునేవాళ్ళు పిల్లల్ని. అందరికీ 'మమ్మీ, డాడీ'లు నేర్పించటంతో పాటు, వాళ్ళు తెలుగులో మాట్లాడితే ఫైన్ కట్టించుకునేవాళ్ళు. ఫలితం బాగుంది- చంద్రం తెలుగుకంటే ముందు ఇంగ్లీషులో ముద్దు ముద్దుగా "ఐ ఈజ్ గుడ్" అంటుంటే మురిసిపోయారు ఇద్దరూనూ.
చంద్రం ఒకటికి రాగానే రామారావు అప్పుచేసి అతన్ని డాష్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించాడు. బడి నియమాల ప్రకారం వాడు బడి హాస్టల్ లోనే ఉండేవాడు. 'పిల్లల్ని ఇంటికి వదిలితే, వేర్వేరు సంస్కృతులు వాళ్ళని ప్రభావితం చేస్తై. అలాకాక అందర్నీ కలిపి పెంచితే, వాళ్ళకి చిన్నప్పటి నుండే పోటీ తత్వం, సమాజపు వ్యాపార నైజం అర్థమౌతాయి ' అనే ఉన్నతమైన భావన ఆ బడిని అభివృద్ధిలోకి తెచ్చింది. చంద్రం వారాంతంలో మాత్రం ఇంటికి వచ్చేవాడు - ఇలా రెండేళ్ళు నడిచింది. ఆ తరువాత వాడు శలవల్లో తప్పిస్తే ఇంటికి రాలేదు.
అయితేనేం, చక్కగా చదువుకుని, ఎనిమిదో తరగతికల్లా సోమయ్యగారి కోచింగ్ లో సీటు సంపాదించుకున్నాడు వాడు. ఆ తరువాత గుజరాత్ లో గిగర్వాల్ గారి శిక్షణలో వాడు మెరికలాగా తయారయ్యాడు. పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు; పెద్దింటి పిల్ల రమను ప్రేమ వివాహం చేసుకున్నాడు; ఇంద్రానికి తండ్రయ్యాడు.
ఇరవై ఐదేళ్ళ తరువాతి సంగతి:
చంద్రం, రమ ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళకో పుత్ర రత్నం. పేరు ఇంద్రం. వీళ్ళు ముగ్గురి మెడలకీ రెండు బరువులు- చంద్రం తల్లిదండ్రులు రామయ్య, సీతమ్మలు.
రామయ్య రిటైరైన రెండేళ్ళకు వాళ్ళిద్దర్నీ ఊరి చివర్లోఉన్న వృద్ధాశ్రమంలోచేర్పించారు. ఆ రెండేళ్ళూ రమ పడ్డ పాట్లు ఏ సినిమా హీరోయిన్ కూడా పడి ఉండదు. అందుకని, వృద్ధాశ్రమం వాళ్ళు రెండు లక్షలు ఇమ్మంటే, చంద్రం రామయ్యతో చెప్పకుండా మొత్తం తనే కట్టేశాడు అవలీలగా. అంతా చేసి ఆ ఆశ్రమంలోహాస్పిటల్ సౌకర్యం లేదు! వీళ్లకు ఏమైనా జబ్బుచేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చి వదిలేసే వాళ్ళు! చివరికి రామయ్య ,సీతమ్మలు అక్కడ ఉండటానికి బదులు నిరంతరం ఇంట్లోనే తిష్ఠవేయటం మొదలుపెట్టారు.
అందుకని రెండేళ్ల తర్వాత వాళ్లిద్దర్నీ ఇంకో వోల్డేజ్ హోం లో వేశారు. "గియానంద వోల్డేజ్ హోం" లో వీళ్ళను చక్కగా చూసుకునేవాళ్ళు. అందరికీ ఇన్ హౌస్ మెడికల్ ఫెసిలిటీ తో బాటు, ప్రతిరోజూ సాయంత్రం మనసుకు ప్రశాంతతను చేకూర్చేందుకుగాను కంపల్సరీ మెడిటేషన్ కూడా ఉండేదక్కడ. అయితే రామారావుకేమయిందో, ఊరికే ఫిట్లు రావటం మొదలై అందరికీ అసౌకర్యంగా తయారైంది.
ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ ఖుషీవ్యాలీ లో ఉన్న 'ఇంటర్నేషనల్ హోం ఫర్ ది ఏజ్డ్ ' లో చేర్పించాడు చంద్రం. దానికోసం అతను ఆఫీసులో లోను తీసుకోవాల్సి వచ్చిందిగానీ, తల్లిదండ్రుల సుఖం కోసం ఆమాత్రం చేయలేదనుకుంటారని, అతను ఆ రిస్కు తీసుకున్నాడు. వీళ్ళు మనల్ని నెలకోసారికంటే ఎక్కువ సంప్రతించరు. చివరికి వీళ్లకేమైనా అయితే క్రిమేట్ చేయించటం, వగైరా అన్నీ వాళ్లే చూసుకుంటారు. "ముసలివాళ్ళని పిల్లలమీద వదిలితే, వాళ్ళు మనవళ్ళకీ, మనవరాళ్లకీ చిన్నప్పటినుండే వెనకబాటు ధోరణులు మప్పుతారు. పిల్లలకు ప్రగతిశీలమైన అలవాట్లు రావాలంటే ముసలివాళ్ళని వీలైనంత దూరంగా ఉంచాలి" అనే ఉన్నతమైన భావన ఖుశీవ్యాలీకి వెలుగులు తెచ్చింది.
అక్కడ వాళ్లిద్దర్నీ కలిసి మాట్లాడుకోనిచ్చినప్పుడల్లా రామయ్య, సీతమ్మ ఒకే సంగతి మళ్లీ మళ్ళీ ముచ్చటించుకునేవాళ్లు- "మనం చిన్నప్పుడు చంద్రాన్ని మనతోపాటు ఉంచుకొని ఉంటే, వాడూ ఇప్పుడు మనల్ని వాడితోబాటు ఉండనిచ్చేవాడేమో" అని!
ఆపైన వాళ్ళిద్దరూ ఇక ఇంటికి పోలేదు. చక్కగా అక్కడే ఉంటూ, హాయిగా అక్కడే కన్నుమూశారు.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
చాలా బాగుందండి
BTW "చరైవ..చరైవ" అంటె ఏమిటండి ?
వాస్తవాలను కళ్ళకు కట్టినట్టు చెప్పారు.రెండు తరాలకు పోలిక బాగుంది. శీర్షిక కి ఇంకో పేరేదైనా పెట్టుంటే ఎక్కువ మంది చదివే అవకాశం వుంటుందనుకుంటున్నాను.ఇంతకీ ఆ టైటిల్ అర్ధం ఏమిటి?
Nice story
చరైవ.. అంటే ' go on ' అని ఆంగ్లార్థం. '(వ్యవస్థ) నడుస్తూ ఉంటుంది ' అన్న అర్థంలో నేను వాడాను. క్షంతవ్యుణ్ని.
Post a Comment