Monday, March 24, 2008

కొంచెం తీరిక దొరికితే చాలు

ఉగాది పండగ వచ్చింది- పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు, ఘాటు..రుచులన్నీ తీసుకొచ్చింది. ఇష్టమైనవాటినీ, ఇష్టంలేనివాటినీ మోసుకొచ్చింది. జీవితంలో తీపి, చేదు రెండూ ఉంటాయని గుర్తుచేసేందుకు.. గెలుపు ఉన్నదంటే ఓటమి కూడా ఉంటుందని గుర్తుచేసేందుకు వచ్చింది. అన్నింటినీ సమానంగా స్వీకరించాలని చెప్పేందుకు వచ్చింది మళ్లీ.

ఇంగ్లీషువాళ్లు వంద సంవత్సరాల్ని సెంచురీ కింద మూటగట్టినట్లు, మనవాళ్లు 60 సంవత్సరాల్ని కలిపి మూటలు కట్టారు: ’ప్రభవ’ తో మొదలై, ’అక్షయ’ తో ముగిసే 60 సంవత్సరాల కాలమాన చక్రం మనది. అనంతంగా పరిభ్రమించే ఈ కాలచక్రగమనపు ఒక విడతలో ’సర్వజిత్తు’ పోయింది; ’సర్వధారి’ పేరుగల సంవత్సరం ఈ ఉగాదితో మొదలౌతోంది.

సంవత్సరాలకున్న ఈ పేర్లను ఏమి ఆలోచించి పెట్టారో తెలీదు. కానీ అన్నిటికీ అర్థాలైతే ఉన్నాయి. సర్వజిత్: అందరినీ జయించేది. సర్వధారి: అన్నిటినీ ధరించేది... జీవితమే, అన్ని రుచుల్నీ మోసుకొచ్చేదీ ఇదే, అందరినీ జయించేదీ ఇదే. ప్రభవించేదీ ఇదే, అక్షయమై మళ్లీ మళ్లీ వచ్చేదీ ఇదే. ఎవ్వరికోసమూ ఆగని కాల ప్రవాహం ఇదే.

చూస్తూ చూస్తుండగానే- పుట్టిన పిల్లలు దోగాడతారు, లేచి నిలబడతారు, తప్పటడుగులు వేస్తారు, నేర్చుకుంటారు, మీరౌతారు, ఇంకా పెద్దవుతారు, ముసలివాళ్లౌతారు.. అందరి వెనకా కాలం అనంతంగా ప్రవహించి పోతోంది.

జీవితంలో చాలా ప్రవాహాలున్నాయి, గమనించి చూడాలంతే. ప్రవాహాల్ని చూసినప్పుడు వాటి ఒడ్డున విశ్రాంతిగా కూర్చొని, మర్యాదగా, ప్రశాంతంగా చూడాలట, వాటిని. మహాత్ములు అందరూ ఈ పనే చేశారట, బుద్ధుడు, క్రీస్తు, రమణుడు, క్రిష్ణమూర్తి, గాంధీజీ...

అయితే ఇలా కొంచెంసేపు కూర్చోటానికి కూడా తీరిక ఉండటం లేదు మనకు.

ఈ సర్వధారి సంవత్సరం మనల్ని అందరినీ చల్లగా చూసి, సంతోషంగా, ప్రశాంతంగా ఉండేందుకు మనకంటూ కొంచెం తీరికను తెస్తుందని ఆశిద్దాం.

No comments: