Monday, March 24, 2008

మళ్లీ వచ్చేసింది వసంతం

మళ్లీ వచ్చేసింది వసంతం.... పట్టణాల్లోకి కాదు- వసంతం పల్లెలకే సొంతం. ఒకసారి చుట్టూ చూడండి. వసంత శోభని చూడాలంటే పల్లెలకి పోండి.

మామిడి పిందెలు, వేపపూత, అలికిన లోగిళ్లు, పొంగే పాలు, చెరకుగడలు, చిలకల కులుకులు, అన్నివైపులా పచ్చదనం, పరీక్షగా చూస్తే ఆ పచ్చదనంలో కనిపించే వందలాది రంగులు, రంగురంగుల పూలు, లేత చిగుర్లు, వాటిని మేసే కోయిలల కువకువలు. ఎడారులు కూడా ఉల్లాసాన్నిచ్చేది ఇప్పుడే. వెళ్లండి. చూడండి, తనివితీరా చూడండి..

ఇంకో సంవత్సరం వరకు రాదీ భాగ్యం.ఆ లోపల కాలం గడిచిపోతుంది.. మీరు పెద్దవాళ్ళైపోతారు. పెద్దవాళ్లైతే చూసే తీరు మారిపోతుంది. అప్పుడు కళ్లకెదురుగా ఉన్న వాస్తవాలు కనబడవు. ఏవేవో ఆలోచనలు, భయాలు, సంతోషాలు, ఆశలతో మెదడంతా నిండి, పోతుంది. వసంతాన్ని చూసేందుకు సరైన సమయం మళ్లీరాదు- ఇప్పుడే చూడాలి.

పట్టణాల్లోకి రానన్న వసంతాన్ని రప్పించేందుకు ఉగాది పండగని తెచ్చారు మనవాళ్లు. వేపపూత, కొత్త బెల్లం, కొత్త చింతపండు, మామిడి పిందెలు అన్నీ చూసి ఆశపడి వసంతం కొన్నాళ్లు పట్టణాల్లోకీ వెళ్లింది. ఇప్పుడు పోవటం మానేసింది మళ్లీ. నాలుగు రెబ్బల వేపపూతని ఐదు రూపాయలో, పది డాలర్లో ఇచ్చి కొంటున్న ఈ తరాన్ని, అమ్మితేనైనా పొట్టనిండుతుందేమోనన్న ఆశతో చెట్లను, భూముల్ని అమ్ముకుంటున్న పేదమనసుల్నీ చూసి బాధపడి పట్టణాల్ని వదిలేసింది వసంతం.

అందుకే, రండి, రండి. పల్లెలకి రండి వసంతాన్ని వెతుక్కుంటూ. వచ్చి తీసుకెళ్లండి దీన్ని, మీవెంట. మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారంటే అది మీ వెన్నంటి రాక పోదు- ప్రయత్నించండి. అలా రానన్నా, కనీసం వసంతాన్ని చూసి, పలకరించిన అదృష్టమైనా దక్కుతుంది. అద్భుతమైన ఆ క్షణాల్ని తలుచుకుంటూ ఏడాదంతా గడపచ్చు- మళ్లీ ఉగాదికోసం నిరీక్షిస్తూ.

No comments: