Tuesday, April 8, 2008

కొత్త పల్లి

దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం బబ్లు, మేరీ అనే ఇద్దరు పల్లెలో స్థిరపడి సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, వారికి తమ పిల్లల చదువు గురించి ఆలోచించాల్సి వచ్చి, పల్లెలోని ప్రభుత్వ బడిని గమనించారు. అక్కడి బెత్తపు పెత్తనం చూసి తమ పిల్లలకు వేరేలాంటి బడులు వెతుక్కున్నారు. పిల్లల్ని అక్కడ కొట్టకుండా చదువులు చెబుతారు; దానికి తగినట్లు ఫీజులు వసూలు చేస్తారు.

ఇలా ’డబ్బులున్నవారి పిల్లలకు మాత్రం బెత్తంలేని చదువులుంటే ఎలా’ అన్న ఆలోచనతో టింబక్టు కలెక్టివ్ సంస్థ ఒక ప్రత్యామ్నాయ విద్యాకార్యక్రమం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం ద్వారా చెన్నేకొత్తపల్లి పరిసరాల్లోని అనేక గ్రామాల్లోని పేదపిల్లలకోసం చిన్న చిన్న బడులు తెరిచారు. ఈ బడుల్లో పిల్లల్ని కొట్టరు; వాళ్లు ఇష్టంగా చదివితే చెప్తారు; లేకపోతే లేదు. పిల్లలు ఆనందంగా ఉండేందుకు, కళల్లోనైనా సరే, అభిరుచితో ఎదిగేందుకు తగిన వాతావరణం మాత్రం కల్పిస్తారు. వీటిలో ప్రవేశం ఉచితం. పిల్లలకు మధ్యాహ్నంపూట భోజనం, సాయంత్రం పూట "తినేందుకేదైనా" ఇస్తారు. చాలా కష్టకాలంలో ఉన్న పిల్లలకు అక్కడే ఉండేందుకు వసతి కల్పిస్తారు.

ఈ బడుల్ని నడిపేందుకుగాను బబ్లు, మేరీలు అనేకమంది మిత్రుల్ని, నిధులిచ్చే స్వచ్ఛంద సంస్థల్ని ఆశ్రయించారు. మిత్రుల వ్యక్తిగత సహకారంలో హెచ్చు తగ్గులుంటై. స్వచ్ఛంద సంస్థలకు మాత్రం చాలా ప్రశ్నలుంటై:

"మీరు ఎంతకాలం ఇలా చిన్నచిన్న బళ్లు నడిపిస్తారు?" అంటాయి కొన్ని సంస్థలు. "వీటిలోంచి ప్రతిసంవత్సరమూ బయటికొచ్చే పదిమందో, ఇరవై మందో పిల్లలు ఇప్పుడేం చేస్తున్నారు? ఓహోఁ, కూలిపని, ఇళ్లకు రంగులు వేసేపని, వైరింగు పని, పొలంపని, చేస్తున్నారా, అంతేనా?" అంటాయి కొన్ని. "మీరు ఇలా కొంతమంది పిల్లలకే పరిమితమైపోతే ఎలా? వీటిని ఇతరులు అనుకరించేందుకు మీరేం చేస్తున్నారు? మీరు చేస్తున్న పని వల్ల ప్రభుత్వ బడుల టీచర్లలో ఎలాంటి మార్పులొచ్చాయి?" రాసిమ్మని అడుగుతై కొన్ని సంస్థలు. "మీరు విస్తరించాలి, ఇలా ఒక్కచోట intensiveగా పనిచేస్తే చాలదు. ఫలానా సంస్థలమాదిరి బాలకార్మికుల గురించి, చిన్నపిల్లలమీద లైంగిక అత్యాచారాల గురించి ర్యాలీలు, పోస్టర్లు, ప్రచారాలు చేసి వేలమంది, లక్షలమంది పిల్లలతో పనిచేయాలి. అలాగైతేనే మేం డబ్బులిస్తాం. ఈ చిన్న చిన్న బడులతో మేమేం చేస్తాం? " అన్నాయి కొన్ని. టింబక్టు కలెక్టివ్ లోని మిగిలిన కార్యక్రమాల రూపురేఖలు వీళ్లకు అనుగుణంగా మారిపోయాయి. అయినా ఎవరో ఒకరు, దయామయులు సాయం చేస్తూనే వచ్చారు; బడులు అలా పడుతూ, లేస్తూ నడిచినై ఇన్నాళ్లూ. ప్రస్తుతం రెండు బళ్లు, ఓ మంచి లైబ్రరీ, చక్కని ప్రయోగశాల మాత్రం ఉన్నాయి, చిన్నగా.

"మీరు మీ పిల్లల దగ్గర ఫీజులు తీసుకోండి......." ; "బడులకు ఇప్పుడు సాయం చేస్తాం సరే- మరి, భవిష్యత్తులో మేం ఉండకపోతే ఎలా? మీ బళ్లు మేం ఇచ్చే ఈ డబ్బుతో స్వయం సమృద్ధితో స్వావలంబనను ఎలా సాధిస్తాయో చెప్పండి...." అని వేధిస్తూనే ఉన్నాయి సంస్థలన్నీ.

ఈ మధ్యలో మేం వచ్చాం.

"బడులు కర్మాగారాలు కావు; పిల్లలు కూలీలు కారు- లాభాలు సంపాదించటానికి, స్వావలంబన సాధించటానికిన్నీ. పేదపిల్లలు కూలిచేసి చదవరు. సమాజం వారి బాధ్యత తీసుకొని, వారికి ప్రేమగా, ఇష్టంగా చదువు పెట్టాలి, భోజనంతో బాటూ." అని చెప్పాలనుకున్నాం మేమంతా ఎప్పటినుండో, అయినా నోళ్లు నొక్కుకున్నాం.

"ప్రభుత్వాన్నో, ఇంకెవర్నో ప్రశ్నించటం, మీటింగుల్లోను సమావేశాల్లోను గడపటం, ర్యాలీలు చెయ్యటం పెద్దలుగా మీరు చెయ్యండి. మేం పిల్లలకు నేర్పించే పని చేస్తుంటాం. పిల్లల్ని పాపం, ఇంకొన్నేళ్లు అమాయకంగాను, ఆప్యాయంగాను, లోకమంటే ఇష్టంగాను ఎదగనివ్వండి. ఎయిడ్స్ ర్యాలీలు, దేశ సమైక్యత పరుగులు పాపం వాళ్లచేత చేయించనక్కర్లేదు. మీ వ్యాపార ప్రపంచాన్ని వారికి ఇలా పరిచయం చేయనక్కర్లేదు " అని గొణుక్కున్నాం.

"మేం ర్యాలీలు చేయించం. పది గవర్నమెంటు స్కూళ్లకు తలొక పుస్తకమూ పడేసి, ఆ బడులలోని ఆరువేలమంది పిల్లల్నీ మాఖాతాలో జమవేసుకొని, అన్ని వేల మందితో పనిచేస్తున్నట్లు కాకి లెక్కలు చూపించం. మీరూ మీ గణాంకాలూ ఎక్కడికైనా పోండి, మాకు బరువైనప్పుడు ఈ బళ్లు మూసేస్తాం, అంతే" అని నిశ్శబ్దంగా ఏడ్చుకున్నాం.

"మీకు అవసరముంటే వచ్చి ఏం పరిశోధించుకుంటారో పరిశోధించుకోండి. మీ నివేదికలు మీరు చేసుకొని పోండి. మావల్ల ఎవరికి ఏం ఒరిగిందో మాకు తెలీదు; పరిశోధనలు మేమే నిర్వహించేంత తీరికా మాకు లేదు. పిల్లలతో గడపటం, పిల్లలకు నేర్పిస్తూ, మేం నేర్చుకుంటూ ఉండటం మాకిష్టం. మిగతాది మీ కష్టం" అని నిర్మొహమాటంగా చెప్పాలనుకొనీ, చెప్పక, మాటలు దిగమ్రింగాం.

" ’చిన్న బళ్ల వల్ల ఏం లాభం’ అంటారా, ’వ్యక్తిగతంగా చూపే ప్రేమల వల్ల ఏమొస్తుంది?’ అంటారా?- బాపు రమణల్ని అడగండి, న్యాయపతి రాఘవరావు వాళ్లకేమైనా చేశాడో, లేదో.. అయన వెయ్యిమందికి సాయం చేస్తే, వెయ్యి మందీ సంతోషంగా పెరిగారు. అందరికీ ఏదో ఓ మేలు జరిగింది తప్పకుండా. మేలు మేలే. దాన్ని లెక్కించటానికి వీల్లేదు. కొలిచే సంగతులు కావివి" అనుకున్నాం తప్ప, బయటికి ఏమీ అనలేదు.

"ఈ సంస్థలన్నీ పై పై పూతలు వదిలి, గొప్ప గొప్ప మాటలు వదిలి, నిజంగా నేలమీద పనిచేసి చూడరాదూ, కనీసం ఓ పదిమందికన్నానిజంగా మేలు జరుగుతుంది? బాల కార్మికుల వెంటపడి, వీధి బాలల్ని వేధించి, బడికి పోని వాళ్లనల్లా దోషులుగా నిలబెట్టి, అలాగని ఆ బళ్లు జైళ్లుగా ఉన్నాఏమీ చెయ్యక, సమర్థించుకుంటూ ఎందుకు పోతున్నారు? అరేఁ, ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లోనే 600 మంది పిల్లలకుగాను 4 టాయిలెట్లుంటున్నాయే, ఇక ఆ ప్రైవేటు నరకాల్లోకి పిల్లల్ని పంపలేదని ఎవరినైనా తిట్టేదెందుకు, బాధపెట్టేదెందుకు?" అని తిట్టుకుంటూన్నాం, తప్ప ఎవ్వరినీ తిట్టలేదు ఇన్నేళ్లూ.

ఇప్పుడిక ఆగకూడదనిపిస్తోంది- అన్నీ అడుగుతాం, మొహమాటం లేకుండా. అందుకే e ప్రపంచంలోకి వచ్చాం. ముందుగా కొత్తపల్లి పిల్లల e మాసపత్రిక http://kottapalli.in మొదలుపెట్టాం. ఈ కొత్తపల్లి పత్రిక పూర్తిగా పిల్లల ప్రపంచమే. ఇందులో పెద్దల సమస్యలకు (మా సమస్యలకు కూడా) తావులేదు. ఇందులో ఉండేవి పిల్లలకు, పెద్దలకు విజ్ఞాన వినోదాల్ని, సంతోషపు తరగల్నీ అందిస్తాయి అంతే.

దీని సరసన, పిల్లలకు ఇష్టం అయితే నేర్చుకునేందుకు కావలసిన వైజ్ఞానిక, శిక్షణా వనరులను కూడా చాలా ఉంచబోతున్నాం, కొన్ని కొన్నిగా, అన్నీ ఉచితంగానే.

వీటితోబాటు విద్యా రంగంపై మా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని వ్యక్తం చేసేందుకో చోటును సిద్ధం చేస్తున్నాం.

"అక్షర భారతి" లో భాగస్వాములుగా ఇతరులందరికీ తెలుగు-ఇంగ్లీషు ద్విభాషా వెబ్‍సైట్లను తయారుచేసి ఇచ్చి, వాటిని నిర్వహించి పెడతాం. వెబ్ పేజీలకు కావలసిన తెలుగు content ని తయారు చేస్తాం.

వీటిని ప్రోత్సహిస్తూ సహృదయంతో ఎవరేమిచ్చినా సగౌరవంగా తీసుకుంటాం.

ఇక ఎవ్వరూ అడగకూడదు- చిన్న బడులేం చేయగలవని: కొత్తపల్లిలో మా బడుల టీచర్లున్నారు: రామాంజి, ఆది, కల్యాణి, హనుమంతు, మోహన, నాగరాజు, బషీర్, బయ్యపరెడ్డి... ; మా బడుల్లోనే చదివి, ఎదిగి చేతికందొచ్చిన పిల్ల మాణిక్యాలున్నై- అడవి రాముడు, కుమారి,...; మా బళ్లల్లో ఇంకా నేర్చుకుంటున్న పిల్ల కళాకారులున్నారు నూటయాభై మంది, మా పల్లె చుట్టూ ఇంకా కొంతమంది అద్భుతమైన బాలలున్నారు.. వీళ్లంతా "కొత్త పల్లి"ని తెస్తారు. మీరంతా చేతులు కలుపుతారు- ప్రపంచంలోని తెలుగు పిల్లలంతా నడిపిస్తారు.

చిన్నబళ్లు, చిన్న పిల్లలు చాలా చేయగలరు. జై సీతారాం చెప్పినట్లు, మేం, పిల్లలం, ప్రపంచాన్నే శాసిస్తాం- మాకిష్టమైతే. లేకపోతే ఏమీ చేయం- ఊరికే ప్రశాంతంగా మా దారిన మేముంటాం. మీరూ మాలో ఒకరవ్వండి- మాకు ఈ ధైర్యాన్నిచ్చి, సాహసించి గొంతెత్తేందుకు సాయపడ్డ ఆనంద్, లక్ష్మిల మాదిరి. మీ మీ శక్తుల్తో, శక్తికొలదీ సాయం చేయండి. రండి, కలిసి ఇష్టంగా ఏదైనా చేద్దాం.

6 comments:

Anonymous said...

This is very interesting.
The idea itself is fascinating.
I will keep browsing to know more.

http://www.telugu4kids.com

రాధిక said...

మొదటి అదుగు వేయగలిగితే మరికొన్ని అడుగులు వాటికవే పడతాయి. చివరిదాకా అడుగులేయాలంటే సాయం తప్పనిసరి.మీరు చేసే మంచి పని కొందరి జీవితాల్లో వెలుగు తెస్తుందనడంలో సందేహం లేదనిపిస్తుంది.

Anonymous said...

మీరు ఏమైనా సాధించగలరని ఇక్కడి ప్రతి వాక్యమూ చెబుతోంది. మీబడెలాంటిదో కొత్తపల్లి.ఇన్ మొదటిపేజీ చెబుతోంది.

నాబోటి ఉడతలు మీ ఉద్యమంలో ఎలా చెయ్యి కలపొచ్చో చెప్పగలరు.

(మీ బడి గురించి చదువుతూంటే కొన్నేళ్ళ కిందట సమ్మర్‌హిల్ బడి గురించి చదివిన విషయాలు గుర్తొచ్చాయి.)

Kolluri Soma Sankar said...

మీ కొత్తపల్లి చూసాను. చాలా బాగుంది. మీ బృందానికి నా అభినందనలు. పిల్లల పత్రిక అభివృద్ధిలోకి రావలని కోరుకుంటున్నాను.
నేను ఓ రచయితని, అనువాదకుడిని. పూర్తి వివరాలకోసం నా బ్లాగు www.kollurisomasankar.wordpress.com చూడండి.

yukta said...

naaraayana gaaru,
pillala patla mee (team) mamakaaram, aaraatam vaari bhaavi jeevitham gurinchi mee thaapathrayam.... abhinandinchakundaa vundaleka pothunnaanandee. mee krushi ki sirasu vanchi namaskaristhunnaa. nenu computer ki net ki chaalaa kotta. bahushaa mee 8th class kedar kunna paati e-gnaanam kooda naaku lekapovachu. endukante generation gap kadandee. nenu kooda primary school teacher ni. antha goppa telivithetalu lekapovachu... emainaa vupayoga padathanemo choodandee. okka vishayam maastaaroo.. blog lo telugulo elaa type cheyyaalo nerputhaaraa? once again meeku shubhaabhinandanalu. vuntaanandee

sujana said...

పిల్లల కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. నేను నా బ్లాగ్ లో చిన్నప్పుడు నేను ఇష్త్ర్టంగా చదువుకున్న కధలను వ్రాస్తున్నాను. మీ కొత్తపల్లి కి అవసరమవుతాయెమో చూడండి.
www.duttaluru.blogspot.com