Tuesday, October 11, 2011

పులివేంద్రాలు!

చాలా సంవత్సరాల క్రితం ఒక రాజుగారు ఉండేవారట.

ఆ రాజుగారికి పులులంటే చాలా ఇష్టమట.

చిన్న చిన్న పులి పిల్లలంటే మరీ ఇష్టమట. వేటకోసం అడవికి వెళ్ళినప్పుడల్లా ఒక బుజ్జి పులి పిల్లను ఇంటికి తెస్తూ ఉండేవాడట.

అట్లా ఆయన ఆస్థానంలో వందలాది పులులు తయారయ్యాయి.

'పులుల్ని ఊరికే బోనుల్లో‌బందీ చేసి ఉంచితే ఎలాగ?' అని వాటికోసమే ప్రత్యేకంగా ఒక అడవిని కేటాయిద్దామనుకున్నాడాయన.

అయితే వాళ్ల రాజ్యంలో ఏ అడవిని చూసినా అందులో ఏదో ఒక జాతి ప్రజలు నివస్తిస్తూనే ఉన్నారు. మరెలాగ? వాళ్ళు ఉండే అడవిని ఖాళీ చేసి పులులకు ఇచ్చెయ్యమంటే ఆ ప్రజలకు కష్టం కదా? అందుకని రాజుగారు ఒక సమావేశం ఏర్పాటు చేసి మంత్రుల్ని సలహా అడిగారు.

"దానిదేముంది ప్రభూ! క్రొత్తగా ఒక అడవిని తయారు చేస్తే సరి!" అన్నాడొక మంత్రి.

రాజుగారికి ఆ సలహా నచ్చింది. అడవిని పెంచితే పర్యావరణానికీ మేలు; గాలి కూడా బాగుపడుతుంది; పులులూ‌సంతోషంగా ఉంటాయి!
"సరే! అలాగే చేద్దాం! వీలైనంత త్వరగా అడవిని తయారు చేసెయ్యండి!" అన్నారు రాజుగారు.

అయితే అదికూడా సమస్యే అయ్యింది. "రాజ్యంలో అడవులు కాక మిగిలిన భూమి అంతా వ్యవసాయంలో ఉంది. వ్యవసాయం చేసేది ప్రజలే కదా! వాళ్లు ఆ భూముల్నే నమ్ముకొని బ్రతుకుతున్నారు. వాళ్ల భూముల్ని అడవిగా మార్చేస్తే ఇక వాళ్ళకెలాగ?"

అందుకని మంత్రులంతా అనుకున్నారు- "రాజ్యంలో ఎవ్వరూ సాగుచేయని భూమిని వెతుకుదాం. అందులో పులులకోసం అడవిని పెంచుదాం" అని.
అందరూ కలిసి వందలాది ఎకరాలున్న బంజరు భూమిని ఒకదాన్ని ఎంపిక చేశారు. అక్కడ చెట్లు నాటేందుకు గుంతలు త్రవ్వమన్నారు. త్రవ్వటం మొదలు పెట్టేసరికి, ఏమున్నది?! అక్కడ ఒకచోట బొగ్గు! ఒకచోట ఇనుము! ఒక్కోచోట బంగారం! వజ్రాలు! రాగి!- ఇంకా ఏవేవో విలువైన లోహాలు! వెంటనే మంత్రులు గనుల శాఖకు ఇచ్చేశారు, ఆ భూమిని.

కథ మళ్ళీ మొదటికి వచ్చింది. పులులకు భూమి కావాలి.

అప్పుడు రాజుగారికి గుర్తు వచ్చింది. "తన కోటలో చాలా స్థలం ఉంది కదా! వేల వేల ఎకరాల స్థలం అది. అందులో పులుల అడవిని తయారు చేసుకోవచ్చు కదా, బయట ఎందుకు?"

అయితే రాణిగారు అందుకు ఒప్పుకోలేదు. "నేను ఎప్పుడన్నా అట్లా బయట షికారుగా తిరగాలంటే ఈ పులులు అడ్డు వచ్చేస్తాయి బాబూ! ఇవి దగ్గర ఉంచటం కుదరదు!" అన్నది.

అంతలో ప్రజల్లోనే కొందరు తుంటరివాళ్ళు బయలుదేరారు- "అసలు పులుల్ని పెంచుకోవటం ఎందుకు? ఏమైనా ప్రమాదం జరిగితే అందరికీ శ్రమ కదా?! అప్పుడు ఏడ్చుకునే బదులు, ఇప్పుడే ఆ పులుల్ని, అవి మరీ ఎక్కువ కాకమునుపే, మామూలు అడవుల్లో నిశ్శబ్దంగా వదిలేస్తేనేమి?" అని.

రాజుగారు కొంచెం ఆలోచించి, వాటిని అన్నిటినీ రాజ్యంలో వేరు వేరు చోట్ల వదిలిపెట్టించారు. ఎక్కడికక్కడ, చిన్న చిన్న పులివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఎవ్వరూ ఏమీ అనలేదు. అందరూ అభివృద్ధి జరుగుతున్నదని మిన్నకుండిపోయారు. దాన్ని చూసి, ప్రపంచంలోని రాజులందరూ అటుపైన అదేపని చెయ్యటం మొదలు పెట్టారు!

మనం పెంచి పోషించుకుంటున్న పులులు- ఇట్లాంటివి చాలానే ఉన్నట్లున్నాయి. కాలుష్యాన్ని పెంచే కర్మాగారపు పులులు ఒకప్పటి మాటైతే, అణుకేంద్రపు పులులు, అవినీతి పులులు ఇప్పటివి. చిన్న చిన్న పులివేంద్రాలుగా ఇప్పుడు ఇవి ప్రపంచమంతటా పరచుకొని ఉన్నాయి, చప్పుడు చేయకుండా.
ఏ సునామీలో వచ్చినప్పుడు అక్కడ గర్జనలు వినబడుతుంటాయి- అయితే సామ్రాజ్యాల గోడల్ని దాటి బయటికి వచ్చేసరికి, ఆ అరుపులే మనకు పిల్లికూతలుగా వినబడుతుంటాయి.

వేరే వాటి సంగతి ఎలాగున్నా, ముందు ఈ పులివేంద్రాలకు ప్రత్యామ్నాయాలు దొరికితే బాగుండు.

2 comments:

రసజ్ఞ said...

నిజమే అండి చక్కగా చెప్పారు ఆ రోజు కోసం ఎదురు చూద్దాం!

కొత్త పాళీ said...

brilliant