కాలం ప్రవహిస్తోంది. కాల గతిలో జీవితాదర్శాలు మారతాయి, మాట్లాడే భాష,
వాడే పదాల వెనక ఉన్న భావనల లోతు, అన్నీ మారిపోతై.
"హై, సాండీ, నేనూ వస్తా రాత్రి పార్టీకి. ఏంటీ, కవితతో క్లోజ్ గా మూవ్
అవుతున్నావ్? నేనంటే మొహం మెత్తిందా?" సెల్ ఫోన్ లో తన స్నేహితుడితో
అంటోంది మా కూతురు సాహితి.
మనసులో ఏదో మూలన అర్థంకాని ఆవేదన. ఈ పార్టీలేంటి, ఆడ-మగ కలిసి
తిరగటాలేంటి? పచ్చిగా ఇలా మాట్లాడుకోవటాలేంటి? అసలు ఈ సెల్ ఫోన్లేంటి?
"ఏంటి నానా, ఎక్కడికో వెళ్లిపోయినట్లున్నావే?" అంటోంది బిడ్డ. సర్దుకున్నాను.
"ఏం లేదురా బేటా, మీ తరం పోకడలు ఎటుపోతున్నాయని ఆలోచిస్తున్నా,
ఎప్పటిలాగే."
"ఊఁ, ఆలోచించండి. ఇంకా బాగా ఆలోచించండి. జెనరేషన్ గ్యాప్ రా నానా. అది
తేలే సమస్య కాదు. అది సరే, సాయంత్రం పార్టీ. విన్నావుగా? నేను లేటుగా వస్తా,
ఒకె?"
"నేనూ రానా?" అన్నా, ఏమంటుందో చూద్దామని. ఆగిపోయి నా ముఖంలోకి
చూసింది. నేను నా మనసును వేరుచేసి దానికి మాస్క్ వేసి పెట్టుకున్నా,
సిద్ధంగా. "ఇది కపుల్స్ పార్టీరా నానా. నీకూ ఓ గాళ్ ఫ్రెండుంటే నిక్షేపంగా
రావొచ్చు. కమల ఆంటీ వస్తుందేమో కనుక్కోనా?" అంది కన్నుగీటుతూ. కమల
మా సన్నిహితురాలు, సాహిత్య ప్రేమి.
"నువ్వు టిక్కెట్లు బుక్ చెయ్యి చాలు, నేను కమలతో మాట్లాడుతాను" అన్నా.
"నీకేమీ సమస్య అవ్వదుగా?"
"వావ్, వాటె కరేజ్ మ్యాన్! మానాన మళ్ళీ కుర్రవాడౌతున్నాడు!" అంది "నాకేం
ప్రాబ్లెం? నీదారి నీది, నాదారి నాది. ఫ్రీడంరా నానా. అన్ని బాధలకీ ఒకే మందు-
ఫ్రీడం" అంది బిడ్డ.
కమలతో మాట్లాడి చెప్పాను సంగతి. "ఓ సారి చూడాలి, మా సాహితి ప్రపంచాన్ని.
వస్తావా?" అన్నా.
"ఇదేమీ గూఢచర్యం కాదుగదా, పర్లేదు వొస్తాను." అంది కమల. "ప్రియాంక గాంధీ,
వాధ్రాని కలిసిందీ డిస్కోథెక్ లోనేనట. అంత గొప్పవాళ్ళు కలవగా లేనిది,
చిన్నపిల్ల, సాహితి కలిస్తే ఏం తప్పు?" అంది తనే, మళ్లీ.
"తప్పని కాదు, కానీ వీళ్లు ఎటుపోతున్నారని ఆలోచిస్తున్నా."
"చూడండి మాస్టారూ, మీ మార్క్సిజాలూ, గాంధీజాలు ఎటుపోతున్నాయని
ఆలోచించటం అలవాటు చేస్తై. వీళ్లకు ఎవరికీ ఇజాలు లేవు. అందుకని ఆ
బరువూ లేదు. మీరు వీళ్లని మీ అద్దాల్లోంచి చూసి బాధపడుతున్నారా
అనిపిస్తోంది" కమల సాహితిని వెనకేసుకొచ్చింది, అలాగే నాపై విమర్శనాస్త్రాలు
సంధిస్తూ.
సాయంత్రం పార్టీకి వెళ్లేసరికి అది మొదలైపోయి ఉన్నది. నేను, కమల వెళ్లి మాకు
కేటాయించిన టేబుల్ దగ్గర కూచున్నాం. చుట్టూ మద్యం. స్టేజీ మీద
అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా డాన్స్ చేస్తున్నారు. పాశ్చాత్య సంగీతం
హోరెత్తుతోంది.
సాహితి ఒకడిని చేయిపట్టుకొని లాక్కొచ్చి పరిచయం చేసింది. "ఇతను స్యాండీ..
అదే.. సందీప్ నానా. సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు" అని.
"మీ గురించి చెప్తుంటుంది సర్, సాహితి. మీరు తనని పెంచిన తీరు- హ్యాట్సాఫ్ టు
యు సర్" అన్నాడతను. "మా మమ్మీడాడీలు మీ రైటింగ్స్ చదువుతుంటారు.
నేను పెద్దగా ఏమీ చదవనులేండి." అన్నాడు అతనే.
నేను కమలకేసి చూశాను. "చదవనని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు?" అన్నట్లు.
కమల అతన్ని అభిమానంగా చూస్తోంది, సాహితి లాగానే. అతను ఇంకా
చెప్తున్నాడు-"మీ అమ్మాయి చాలా కన్సర్వేటివ్ సార్, మొన్నామధ్య రవి తనకి
ప్రొపోజ్ చేస్తే మానాన్న చూసినవాడినే చేసుకుంటాను పొమ్మంది."
"మరి, నువ్వు.." గొణిగా నేను. "నేను, కవిత ప్రేమించుకుంటున్నాం సర్. పెళ్ళి
చేసుకోబోతున్నాం, వచ్చే నెలలో" అని కవితను పిలిచి పరిచయం చేశాడు "హేఁ
కవీ, సాహి వాళ్ల డాడ్" అని.
సాహితి ఇంకా వాడి చెయ్యి పట్టుకొని వేళ్లాడుతోంది.
"వావ్. మీ అమ్మాయి నిజంగా చాలా మంచిది అంకుల్. సాహిత్యంలో తనకు
తెలీని అంశం లేదు. కథలు రాసేవాడిని తప్ప వేరే ఎవర్నీ చేసుకోదట" అంటోంది
కవిత.
"మరి ఇది కపుల్స్ పార్టీకదా, కవిత ఒక్కతీ ఎలా వచ్చింది? కమలని అడిగా,
వాళ్లంతా వెళ్ళాక. "రవిమీద సానుభూతితో అతన్ని వెంటబెట్టుకొచ్చింది" అంది
కమల తాపీగా కూల్ డ్రింక్ ని చప్పరిస్తూ.
నేను తేరిపార చూశాను.
"మహానుభావా, జెనరేషన్ గ్యాప్ అంటే ఏంటో విశ్లేషించినంత మాత్రాన అది
లేకుండా పోదు. నీ బిడ్డమీద నీకు నమ్మకం, గౌరవం ఉంటే తన మానాన తనని
వదలాలి. వేరే ఏమీ చేయలేవు కూడా. కళ్ళాలు బిగించినకొద్దీ ఈ తరం పిల్లలు ఆ
శృంఖలాల్ని తెంపుకు పోతారు. వాళ్లకి ప్రపంచంలో దయ, కరుణ, జాలి వేరే
రూపాల్లో ఉన్నై. అమెరికన్ సంస్కృతి మరుగున దుమ్ముకొట్టుకుపోయి ఉండొచ్చు,
నీ దృష్టిలో. కానీ ఏదో ఒక రూపంలో ఇంకా ఉన్నై, చచ్చిపోలేదు. పిల్లలు నీ
మాదిరి గాంధీని ఆరాధించరు. గాంధీగిరీని, దాన్ని తిరిగి అమ్మిన సంజయ్ దత్
లోని నటుడినీ ఆరాధిస్తారు. కానీ నువ్వు వాళ్ళను తిట్టి, చిన్నబుచ్చి, సాధించేది
ఏమీ లేదు. వాళ్లంతట వాళ్లు తెలుసుకోవలసిందే. సాహితి మంచి పిల్ల. సొంత
నిర్ణయాల్ని తీసుకునే తెలివితేటలున్నాయ్ తనకు. అది నీ అదృష్టం అనుకో." అంది
కమల స్పీచ్ ఇస్తున్నట్లు.
"అయినా, ఇలాంటి జనాలవల్ల మన సమాజంలోని పేదవాడికి ఏం ఒరుగుతుంది?
మన సమాజం ఎటు పోతోంది?" అన్నా.
కమల మాట్లాడలేదు. నాకు తెలుసు, నేను, కమల పాత తరం వాళ్లం. జెనరేషన్
గ్యాప్ ని అధిగమించటం దాదాపు అసాధ్యం మాకు.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
బావుంది మీ ఆర్టికల్!
జనరేషన్ గాప్ అనేది ఈనాటి సమస్యే కాదు. మన గురించి మన తల్లిదండ్రులు కూడా అలానే అనుకునేవారు. తరం-తరానికీ "విలువలు" మారుతూంటాయి. పరిష్కారం కూడా మీరే చెప్పారు కదా! "కళ్ళాలు బిగించినకొద్దీ ఈ తరం పిల్లలు ఆ
శృంఖలాల్ని తెంపుకు పోతారు. వాళ్లకి ప్రపంచంలో దయ, కరుణ, జాలి వేరే
రూపాల్లో ఉన్నై. వాళ్ళను తిట్టి, చిన్నబుచ్చి, సాధించేది
ఏమీ లేదు. వాళ్లంతట వాళ్లు తెలుసుకోవలసిందే."
ఇక పేదవాడి గురించి అంటారా, ప్రతీ తరంలోను కొంత మంది వ్యక్తులు శక్తులు గా మారి పోరాడుతునే ఉంటారు. ఏ తరం వాళ్ళు ఆ తరపు role models ని ఎంచుకుంటారు. వాళ్ళదైన పద్దతిలో సమజానికి ఉపయోగపడతారు.
కొల్లూరి సోమ శంకర్
చాలా బాగుందండి.పిల్లల కోణం కూడా తెలుసుకోగలిగారు.ఇక పేదవాడి సంగతంటారా?సోమశంకర్ గారు సరిగ్గా చెప్పారు.ఏతరానికి ఆతరం కొత్త రోల్ మోడల్స్ ని ఎంచుకుంటుంది.అయినా ఏ తరంలో అన్నా ప్రతీ ఒక్కరూ పేదవాడి గురించి ఆలోచించలేదుకదా.అలాగే ఈ తరం కూడా.కొంతమంది సాయం చెయ్యడమే వృత్తిగా పెట్టుకుంటే,కొంత మంది ప్రత్యేక రోజులప్పుడు సాయం చేస్తున్నారు.చాలా కంపెనీల్లో ఉద్యోగుల జీతాల్లోనుండి కొంత శాతం డైరెక్టుగా చారిటబుల్ ట్రస్టులకు వెళ్ళేట్టుగా పెట్టారు.ఏదోఒక రూపంలో వాళ్ళూ కొంత చేస్తున్నట్టేగా.మనం పదోతరగతి చదివేటప్పుడు మన జ్ఞానం,పరిధి ఇవన్నీ,ఇప్పటి పదోతరగతి పిల్లలతో పోల్చుకుంటే చాలా తక్కువ.ఇప్పటి పిల్లలకి అన్నీ తెలుసు.ఏది చెయ్యాలో,ఏది చెయ్యకూడదో అన్నీ....మనం చెయ్యాల్సిందల్లా వాళ్ళు మంచిగా ఉండడానికి సరయిన వాతావరణం కల్పించడమే.
బావుందండీ...
జనరేషన్ గాప్ గురించి సూక్ష్మంలో చెప్పారు.
very nice!
Wonderful. I totally agree with soma shekhar and Radhika. Thats true its like .... the more we hold sand in our hands the faster it escapes. Great job.
Post a Comment