Friday, February 21, 2014

ఉరి-యావజ్జీవం

మౌనం ఊరికే గర్జిస్తోంది. రెండ్రోజుల్లో అంతా అయిపోతుందని తెల్సినకొద్దీ యీ గర్జనలు ఎక్కువౌతున్నాయి. మెదడుని తొలిచేసే మౌన సాగరంలో ఇప్పుడు చెలరేగుతున్న అలల్ని ఆపటం ఇక సాధ్యం కావటం లేదు.  పగలు-రాత్రి అనేది లేక గబగబా వచ్చి వాలి మీదపడి దహించే మౌనకెరటాలు...  యీ మౌనపు కెరటాలనే కొందరు పిచ్చోళ్ళు 'ఆలోచనలు' అంటారు కాబోలు.  నిజంగా పిచ్చోళ్ళే.
మౌనం‌ యీ విశ్వమంతటికీ ఆధారంగా పరచుకొని ఉంది.  అంతటా ఉన్నది అసలు యీ మౌనమే.  ఒక్కోసారి యీ మౌనంలో కదలికలు ఏర్పడతాయి. కెరటాలు రేగుతాయి.  మౌనపు ప్రవాహాలొస్తాయి.  వాటిని ఏమనాలో తెలీదు ఎవ్వరికీ అసలు. జనాలు వాటినే ఆలోచనలు అనుకుంటారు. అవి సహజం అనుకుంటారు. అవి లేకుండా తాము లేమని భ్రమపడుతుంటారు.  ఎంత వెర్రి! 'ఆలోచించేవాడే మనిషి'ట! కాదు. అసలైతే ఆలోచించనివాడే మనిషి.
అనంతంగా పరచుకొన్ని యీ మౌనవిశ్వంలో కనీసపు కదలికలు కూడా లేకపోతే... ?! అదే నిజంగా మనిషి అసలు తత్వం!
ఇది కనుక్కోలేని పిచ్చోళ్ళు ఊరికే రేగే యీ కెరటాలతో ముందు మమేకం ఐపోయి, తర్వాత ఓ రకంగా వాటికి అలవాటు పడిపోయి, ఆనక వాటికే బానిసలైపోయి, ఊగిసలాడుతూ 'మనిషంటే ఇలాగే ఉంటాడు' అనుకుంటారు.
రెండ్రోజుల్లో అంతా ఐపోతుందని తెలిస్తే వీళ్ళెవరూ ఇట్లా ఉండలేరు.  ఆర్నెల్లపాటు మరో జీవితో దేంతోటీ‌ మాటలు లేకుండా ఉంటే తప్ప, ఆ రెన్నాళ్ళూ వాళ్ళకి నేను చెప్పే యీ మౌనకెరటాల అనుభూతి కలిగే అవకాశం లేదు... కెరటాలు కనబడాలంటే ముందు పూర్తి నిశ్శబ్దం అనుభూతిలోకి రావాలి-
ఆర్నెల్లుగా నేను అనుభవించినంత నిశ్శబ్దం...
ఉరి అంటే ఏదో‌ 'శిక్ష' అనుకుంటారు. ఎవరికీ తెలీని విషయాల్లో అదీ ఒకటి.  అకస్మాత్తుగా వచ్చి మీద పడి ఉరివేస్తే అది బహుశ: శిక్ష అవ్వచ్చేమోగాని, ఇలా ఆర్నెల్లో, సంవత్సరమో అస్సలు ఎవరితోటీ‌ కలవకుండా విడిగా ఉంచి, తర్వాత 'ఇంకా రెండ్రోజులు' అని చెప్తారు చూడు, అది అసలు శిక్షే కాదు.  అది ఆనంద మార్గం.  ఆ ఆర్నెల్లో, సంవత్సరమో శాంత గంభీర నిశ్చల మౌన సముద్రపుటంచులు- ఆపైన ఒకటి రెండ్రోజుల నిశ్శబ్దపుటలలు- అవి కూడా ద్వంద్వమయ జగత్తులో ద్వంద్వానికి అసలు కారణం ఏంటో‌ తెలియజేసి మనిషి మనసును నిర్వికల్పంగా చేసే మహాద్భుత సాధనాలు! వాటిని దర్శించటం, వాటి అంతాన్ని అనుభవించటం- అది శిక్ష ఎందుకవుతుంది అసలు?!
నిజం శిక్ష ఏదంటే- ఉరిలో పెట్టే ఆశ.  మీకు అర్థం అయి ఉండదు- వివరిస్తాను.  'నిన్ను ఉరి తీస్తే తీస్తాం, లేకపోతే తియ్యం. ఏసంగతీ ఇప్పుడు చెప్పం. నిన్ను బహుశ: అసలు ఉరి తియ్యనే తియ్యమేమో... ప్రాణ భిక్ష పెడతామేమో... నీ ఉరిని 'యావజ్జీవం' చేస్తామేమో... లేకపోతే చెయ్యమేమో... మీవాళ్ళతో సరైన చోట్ల చెప్పించు... మీకు తెలిసిన రాజకీయం‌ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెతుక్కో...సెల్‌ఫోను కావాలా..?' అంటారు చూడు- అదీ అసలు ఉరి కంటే ఘోరమైన శిక్ష.
ఆ శిక్ష పడ్డవాళ్ళు మౌనసంద్రాన్ని అసలు దర్శించనే లేరు. సెల్ ఫోను ఉన్నాక మౌనం ఎక్కడ?! వాళ్లకసలు మౌనం అంటే ఏమిటో అర్థం అయ్యే అవకాశమే లేదు.  ఎప్పుడూ మామూలు మనుషుల్లాగా గందరగోళపడుతూ, ఏదో‌ ఒక పనిలో మునిగిపోయి అర్థరహితంగా జీవిస్తూ, 'ఒరే, ఇలా చెయ్యి, అలా చెయ్యి' అని చెప్పుకుంటూ, ప్రతిక్షణం ఏదో‌ దురాశలో- 'బ్రతికితే చాలు-' అని ప్రాణాలకోసం ఎవరెవరినో అడుక్కుంటూ, నిజానికి నిర్వ్యీర్యం అయిపోతూ, బయటికి మాత్రం ఉత్సాహపు ముసుగులు వేసుకొని పరోక్షపు నరకాన్ని అనుభవిస్తారు.
చివరికి అట్లాంటి వాళ్ళని ఉరి తియ్యకుండా వదలటం అంటే తన వేలితో‌తన కన్నును పొడుచుకోవటమే... ఎందుకంటారా, చూడండి-  అంత అవకాశం‌ ఉండి కూడా ఆ నిశ్చల నీరవాన్ని, మహా అనంత నిశీధిని, జగత్తుని నిండా తనలో ముంచి నిలుపుకొని, బరువుగా అణచిపెట్టిన్ ఆ పరమఘోర మౌనసాగరాన్ని ఏ కొంచెమూ అనుభూతి చెందని ప్రాణి, అసలది ఏమి ప్రాణి? అది బ్రతికీ ఏం ప్రయోజనం?
ఇక రెండో‌పార్శ్వం కూడా చూడండి: తను చేసిన పనులకు ఏమాత్రం చింతనొందకుండా, సమయాన్నంతా తప్పించుకోవటం కోసం వ్యూహాలు పన్నుతూ విలాసంగా గడిపిన ఆ జీవి బాహ్యప్రపంచంలోకి అడుగు పెట్టగానే తన అమానవీయ కార్యకలాపాలను నిస్సిగ్గుగా, మరింత సత్తువతో, తిరిగి ప్రారంభించే అవకాశమే ఎక్కువ.  తనకు 'శిక్ష' విధించిన ఈ తిక్క ప్రపంచాన్నీ; తిరిగి ఆ శిక్షను తను అమలు చెయ్యనివ్వకపోవటంతో ఉక్కిరిబిక్కిరై, తనని వదిలిపెట్టి పారిపోయిన పిరికి వ్యవస్థనీ; తన వ్రేళ్ల చివరన ఆటలాడుతూ, తను ఎలా చెబితే అలా చేసే మూర్ఖపు పనికిమాలిన జనాల్ని చూసి వికవికా నవ్వుకుంటూ తనేం చెయ్యాలో దాన్ని మళ్ళీ పరమ ఉత్సాహంతో చేయదా, ఆ జీవి!?
అందుకనే అన్నది..

ఇదిగో, వస్తున్నారు... 'రండి రండి! ఎప్పుడు, ఇప్పటివరకూ ఇంకా రేపేనా?! సరే సరే. నేనైతే సిద్ధం.  ఇప్పుడైనా సిద్ధమే. ఏంటి, మీరు 'రికమెండ్' చేస్తారా?  యావజ్జీవం చేయమని విన్నపం మీద మళ్ళీ ఓసారి సంతకం చేయాలా? దానిదేముంది, సంతకాలు తీసుకోండి, ఎన్ని కావాలంటే అన్ని.  ఇన్ని తీసుకున్నవాళ్ళు ఆ కొంచెం తీసుకుంటే మాత్రం ఏముంది?  ఇన్ని ఇచ్చినవాడిని ఆ కొన్నీ ఇస్తే మాత్రం ఏముంది?  నావరకూ నాకు తేడా ఏమీ‌లేదు.  మీరు నన్ను వదిలేసినా ఒకటే; ఉంచుకున్నా ఒకటే; ఉరి తీసినా ఒకటే.  మీగురించి మీరు ఆలోచించుకోండి...  మీ భద్రత, మీ శ్రేయస్సు, మీ భవిష్యత్తు.

అసలు నా సలహా ఏమంటే, మీకు వీలైతే అందరికీ 'ఉరిశిక్ష' వేసుకోండి.  వీలును బట్టి, చివరి నిముషంలో రద్దు చేసుకుందురు.  అయితే ఆ మధ్యలో, ఓ‌ఆర్నెల్ల కాలమో- సంవత్సరమో ఎవ్వరినీ‌ మీతో‌ మాట్లాడనివ్వకండి. మహామౌన సముద్రం వచ్చి మిమ్మల్ని ముంచెత్తనిచ్చుకోండి.  ఆశలన్నీ‌కొట్టుకుపోయిన ఆ అద్భుత క్షణాల్ని మీరంతా కూడా ఓసారి అనుభూతి చెందండి. బాగుంటుంది. నిజం...

ఆ తర్వాత కావాలంటే మీరు ఉరిశిక్షను ఎప్పుడు 'యావజ్జీవం' చేయాలో మాట్లాడుకోవచ్చు.


No comments: